Tuesday, April 30, 2024

దసరా పండుగకు ప్రత్యేక సర్వీసులు….

- Advertisement -
- Advertisement -

TSRTC Special services for Dussehra festival

చర్యలు చేపట్టిన రైల్వే శాఖ, ఆర్టీసిలు
రెగ్యులర్ ట్రైన్‌లతో పాటు మరో 46 ప్రత్యేక రైళ్లు ప్రయాణికుల కోసం
అందుబాటులోకి…
30 శాతం అదనపు చార్జీలు వసూలు చేయడానికి
దక్షిణమధ్య రైల్వే సిద్ధం
సాధారణ చార్జీలతో ప్రయాణికుల మేలు చేయనున్న ఆర్టీసి
4,198 బస్సు సర్వీసులను సిద్ధం చేసిన ఆర్టీసి

హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో దక్షిణమధ్య రైల్వే అదనపు చార్జీలను వసూలు చేయనుండగా, ఆర్టీసి మాత్రం సాధారణ చార్జీలను వసూలు చేయాలని నిర్ణయించింది. దసరా పండుగ సందర్భంగా తమ సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులతో ప్రతిసారి బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోతాయి. దీంతోపాటు అదనపు చార్జీలను వసూలు చేస్తున్నా ప్రయాణికుల రద్దీ మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలోనే రైల్వే శాఖతో పాటు ఆర్టీసిలు మరిన్ని ప్రత్యేక రైళ్లను, బస్సులను నడపడానికి నిర్ణయించాయి. అయితే రైల్వే శాఖ మాత్రం ప్రయాణికుల నుంచి అదనపు చార్జీలను వసూలు చేయాలని నిర్ణయించింది.

30 శాతం అదనపు చార్జీలు
దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లతో పాటు రెగ్యులర్ రైళ్లలో బోగీల సంఖ్యను కుదించి, ఆ స్థానంలో ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టి ప్రయాణికుల నుంచి 30 శాతం అదనపు చార్జీలు వసూలు చేస్తోంది. 30 శాతం అదనపు చార్జీలను రైల్వే శాఖ వసూలు చేస్తున్నా ప్రయాణికుల బుకింగ్ మాత్రం ఆగడం లేదు. హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ, వరంగల్, కరీంనగర్ తదితర నగరాల నుంచి బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా చాలామంది తమ స్వస్థలాలకు వెళ్లడానికి టికెట్‌లను బుకింగ్ చేసుకోవడంతో ఇప్పటికే రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ భారీగా పెరిగిపోయింది. నెలరోజుల క్రితం సొంత గ్రామాలకు వెళ్లడానికి రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు వెయిటింగ్ లిస్ట్ వచ్చినా వారు బుకింగ్ చేసుకోవడానికి వెనుకాడడం లేదు.

46 ప్రత్యేకరైళ్లు అందుబాటులోకి….
ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ప్రస్తుతం నడుస్తున్న రైళ్లకు తోడు సుమారు 46 ప్రత్యేకరైళ్లను దక్షిణమధ్య రైల్వే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రైళ్లు వచ్చేనెల 10వ తేదీ వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని దక్షిణమధ్య రైల్వే చర్యలు చేపట్టింది.

తెలంగాణపై చిన్నచూపు
అయితే ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్ల నుంచి తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు ఎలాంటి ప్రత్యేక రైళ్లను నడపడం లేదని, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్టణం, కర్నూలు సిటీ, తిరుపతి తదితర స్టేషన్లకు వెళ్తున్న రైళ్లకు మాత్రమే తెలంగాణ రైల్వేస్టేషన్లలో అదనపు స్టాపులు ఇస్తున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దసరాకు టిఎస్ ఆర్టీసి ప్రత్యేక బస్సులు
నష్టాల నుంచి గట్టెక్కుతున్న టిఎస్ ఆర్టీసి ఈ ఏడాది దసరా పండగకు అదనపు ఆదాయం రాబట్టుకునేందుకు సిద్ధం అవుతోంది. ఈ ఏడాది అదనపు బాదుడు లేకుండా పండుగకు నగరం నుంచి ప్రయాణికుడిని వారి సొంతూళ్లకు చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రయాణికులు ప్రైవేటు వాహనాలు ఎక్కే అవకాశం లేకుండా ప్రయాణికుల వద్దకే బస్సులను పంపి అదనపు రాబడి కోసం కొత్తదారులను అన్వేషిస్తుంది. తెలంగాణతో పాటు ఏపిలోని అన్ని జిల్లాలకు ఆర్టీసి ప్రత్యేక బస్సులను నడపనుంది.

వచ్చే నెల 5వరకు 3,461 బస్సులు
గతంలో ఏ పండుగ వచ్చినా అదనపు బాదుడుతో ప్రయాణికుడి జేబుకు ఆర్టీసి చిల్లుపెట్టేది. ఈ సారీ దసరాకు సాధారణ చార్జీలతోనే గమ్య స్థానాలకు చేర్చేందుకు టిఎస్ ఆర్టీసి ప్రయత్నాలు చేస్తోంది. గతేడాది మాదిరిగానే ఈఏడాది దసరాకు 4,198 బస్సు సర్వీసులను నడపనుంది. దసరా రద్దీ దృష్ట్యా ఈనెల 24వ తేదీ నుంచి అక్టోబర్ 4 వరకు టిఎస్ ఆర్టీసి ప్రత్యేక బస్సులు నడుపనుంది. ఈనెల 24, 25 రోజుల్లో 737 బస్సులు ఈనెల 30 నుంచి వచ్చే నెల 5వరకు 3,461 బస్సులను నడపాలని ఆర్టీసి నిర్ణయించింది. అంతేకాకుండా పండుగకు వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ముందస్తు రిజర్వేషన్ కోసం 517 బస్సులను ఆర్టీసి అందుబాటులో ఉంచింది. ఆర్టీసి బస్సులోనే ప్రయాణికులు ప్రయాణించేలా అదనపు బాదుడుకు ఆర్టీసి పక్కన పెట్టింది.

గతేడాది 3636 బస్సులు…రూ.14 కోట్ల పైచిలుకు ఆదాయం
దసరా పండుగ సందర్భంగా జూబ్లీ బస్ స్టేషన్ నుంచి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలకు ప్రత్యేక బస్సులను ఆర్టీసి నడుపనుంది. ఉప్పల్ క్రాస్ రోడ్డు నుంచి యాదగిరిగుట్ట, జనగామ, పరకాల, నర్సంపేట, మహబూబాబాద్, తొర్రూరు, వరంగల్ బస్సులు దిల్ సుఖ్ నగర్ నుంచి మిర్యాలగూడ, నల్లగొండ, కోదాడ, సూర్యాపేట బస్సులను నడపనున్నారు. సిబిఎస్ నుంచి కర్నూల్, తిరుపతి, మాచర్ల,ఒంగోలు, నెల్లూరు, అనంతపురం, గుత్తి, పుట్టపర్తి, ధర్మవరం, మదనపల్లికి ఆర్టీసి బస్సులను నడుపుతోంది. గతేడాది దసరా సందర్భంగా మొత్తం 8రోజులకు 3,636 బస్సులకు గాను రూ.14 కోట్ల 79 లక్షల ఆదాయం ఆర్టీసికి రాగా ఈసారి అంత కంటే ఎక్కువ ఆదాయం రాబట్టాలని ఆర్టీసి ప్రణాళికలు చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News