Monday, April 29, 2024

రష్యాలో సరుకులయిపోతున్నయ్.. ఇండియావైపు ఎదురుచూపులు

- Advertisement -
- Advertisement -

రష్యాలో సరుకులయిపోతున్నయ్
కార్లు స్పేర్‌పార్ట్, వెరైటి ఫుడ్‌కు కటకట
ఇండియావైపు ఆశతో ఎదురుచూపులు
వోడ్కా తప్ప మరో రకం దొరకని వైనం
మాస్కో: ఉక్రెయిన్‌తో ఏడాదిగా పోరు సాగిస్తూ గాంభీర్యం ప్రదర్శిస్తూ వస్తున్న రష్యాలో ఇప్పుడు పలు విధాలుగా సంకట పరిస్థితి ఏర్పడుతోంది. పలు పశ్చిమ దేశాలు రష్యాపై కటుతర ఆంక్షలను విధించాయి. దీనితో రష్యాకు వాహనాలకు సంబంధించిన ముడిభాగాల సరఫరా గణనీయంగా తగ్గింది. రష్యా ఎక్కువగా పశ్చిమ దేశాలపై ఆటోమొబైల్స్, వ్యవసాయ ఉత్పత్తులపై ఆధారపడుతోంది. అయితే అక్కడి నుంచి ఇప్పుడు సరఫరాలు లేకపోవడంతో కార్లు, వాహనాల విడిభాగాలు, తమదేశంలో దొరకని ఆహారపదార్థాలపై ఇప్పుడు రష్యా ఎక్కువగా భారతదేశం వైపు ఆశతో చూస్తోందని వెల్లడైంది.

అయితే భారతీయ వ్యాపారవర్గాలు వెనువెంటనే రష్యా డిమాండ్ల ఆఫర్లను అంగీకరించలేకపోతున్నాయి. అంతర్జాతీయంగా తమకున్న డాలర్ మారక రేటు, రష్యాకు సరఫరా చేస్తే తమ కంపెనీలపై ఇతర దేశాల నుంచి పడే వేటు వంటి విషయాలను జాగ్రత్తగా పరిశీలించుకుంటున్నాయి. తమకు నిర్ణీత రూపీ రూబ్‌ల్ మారక రేటు అవసరం అని స్పష్టం చేస్తున్నారు.

Also Read: వీటో అధికారం దుర్వినియోగం: శక్తివంత దేశాలపై ఇండియా విమర్శ

భారతదేశం నుంచే ఎక్కువగా వివిధ రకాల సరుకులు తెచ్చుకోవాలని రష్యా ఇటీవలి కాలంలో తపిస్తోంది. దేశంలోకి ముడిభాగాల సరఫరా లేకపోవడంతో అవసరానికి తగ్గట్లుగా కార్ల తయారీ లేదు. దీనితో ఇండియా నుంచి కార్లను, ఆహార పదార్థాలను దిగుమతి చేసుకోవల్సిన పరిస్థితిలో రష్యా ఉంది. భారతదేశానికి రష్యా ఇప్పుడు చవక ధరకు క్రూడాయిల్ విక్రయించడం, అంతర్జాతీయ వేదికలపై రష్యాకు వ్యతిరేక తీర్మానాల దశలో ఓటింగ్‌కు దూరంగా ఉండటం వంటి పరిణామాలు ఇరుదేశాల లోపాయికారి ప్రస్తుత మిత్రత్వాన్ని తెలియచేస్తున్నాయి. అయితే దీర్ఘకాలిక సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఇండియా బ్యాంకులు, కంపెనీలు రష్యాతో లావాదేవీలకు దూరంగా ఉంటున్నాయి. కానీ ఇప్పుడు రష్యా ఇండియా నుంచి దిగుమతులకు ఆత్రుతతో ఉందని పరిణామాలు స్పష్టం చేశాయి.

రష్యాలో ఇప్పుడు వాహనవినియోగదార్లు తమ వాహనాలకు అవసరం అయిన స్పేర్‌పార్టులు దొరకకపోవడంతో తమ కార్లను ఇతర వాహనాలను మూలకు పెట్టాల్సి వస్తోంది. కాలినడక ప్రయాణాలు ఎక్కువ అవుతున్నాయి. లేదా ప్రజా సామూహిక రవాణాలకు దిగుతున్నారు. భారత్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలకు రష్యా నుంచి ఇప్పుడు విపరీత డిమాండ్ ఆర్డర్లు వస్తున్నా , పశ్చిమ దేశాలలోని తమ భారీ మార్కెట్‌ను కాదని రష్యాకు ఎంటర్ అయ్యేందుకు సిద్ధంగా లేవని తెలిసింది. కాగా సోయా ఇతర వ్యవసాయ సంబంధిత ఉత్పత్తులు కోసం ఇండియా వైపు చూస్తోంది. రష్యాలోని పలు ప్రముఖ సూపర్‌మార్కెట్లలో ఇప్పుడు సరుకులు లేక వెలవెలపోతున్నాయి. ఇంతకు ముందటి రకం లేకపోవడంతో వినియోగదారులు విలవిలలాడుతున్నారు. చివరికి ఎయిర్‌పోర్టుల వంటి చోట్ల ఉండే సుంకాల రహిత షాప్‌లలో ఇప్పుడు రష్యా వోడ్కా తప్ప మరో సరుకు దొరకడం లేదని రష్యాలో పర్యటించి ఇటీవలే ఇక్కడికి వచ్చిన ఓ వ్యాపారవేత్త తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News