Monday, April 29, 2024

విభజన వివాదాలు తెగేనా?

- Advertisement -
- Advertisement -

Union Home Ministry will meet CSs of Telugu States on Jan 12

జనవరి 12న తెలుగు రాష్ట్రాల ప్రధానకార్యదర్శులతో కేంద్రం భేటీ
విభజన సమస్యలు, జల వివాదాలు చర్చకు వచ్చే అవకాశం

మన తెలంగాణ/ హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజన వివాదాలను పరిష్కరించడానికి ఎట్టకేలకు కేంద్ర హోంశాఖ చొరవ చూపించింది. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గడచిన మూడేళ్ళుగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నప్పటికీ సమస్యల పరిష్కారానికి ముందుకు రాకుండా కాలయాపన చేస్తూ వచ్చిన కేంద్ర హోంశాఖ వచ్చే నెల జనవరి 12వ తేదీన తెలుగు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో న్యూఢిల్లీలో సమావేశం నిర్వహించనుంది. ఈ మేరకు కేంద్రహోంశాఖ అండర్ సెక్రటరీ లలిత టి.హొదావూ గురువారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు లేఖలు రాశారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా అధ్యక్షతన రెండు తెలుగు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు సమావేశమవుతారు. ఈ భేటీలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న పెండింగ్‌లో ఉన్న విభజన అంశాలు చర్చకు రానున్నాయి. ముఖ్యంగా కృష్ణా, గోదావరి నదుల నీటిని వినియోగించుకునే విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలను పరిష్కరించేందుకు కూడా ప్రధానంగా చర్చకు వస్తాయి.

అంతేగాక కృష్ణా నదీ యాజమాన్య బోర్డు, గోదావరి నదీ యాజమాన్యా బోర్డులకు రెండు రాష్ట్రాలూ డిపాజిట్ చేయాల్సిన నిధులపైనే కేంద్ర హోంశాఖ కార్యదర్శి దృష్టి కేంద్రీకరించే అవకాశాలు ఉన్నాయని అధికారవర్గాల సమాచారం. ఎందుకంటే రెండు రాష్ట్రాలు కలిపి సుమారు 400 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయాల్సి ఉండగా, ఆ నిధులను ఇవ్వకుండా రెండు రాష్ట్రాలూ అనేక సాకులు చెప్పి తప్పించుకొంటున్నాయని, బోర్డుల పెద్దలు కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారని, అందుకే బోర్డుకు అవసరమైన నిధులపైనే హోంశాఖ కార్యదర్శి ప్రధానంగా దృష్టి కేంద్రీకరించవచ్చునని భావిస్తున్నారు. అంతేగాక తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 6111 కోట్ల 88 లక్షల రూపాయల విద్యుత్తు బకాయిలు చెల్లించాల్సి ఉందనే అంశం కూడా కేంద్ర హోంశాఖలో అపరిష్కృతంగా ఉంది. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి గత జూలై నెలలో కేంద్రహోంశాఖకు ఒక లేఖను కూడా రాశారు.

అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే తెలంగాణాకు 4,457 కోట్ల రూపాయల నిధులను ఇవ్వాల్సి ఉందని కోరుతోంది. ఇలా రెండు రాష్ట్రాలూ విద్యుత్తు బకాయిల విషయంలో వేల కోట్ల రూపాయలను నువ్వు ఇవ్వాలంటే నీవే ఇవ్వాలంటూ పరస్పరం వాదించుకొంటున్న అంశాలు కూడా కేంద్ర హోంశాఖ కార్యదర్శి వద్ద చర్చకు రానున్నాయి. ఈ సమస్యపై మళ్ళీ రెండు రాష్ట్రాల వాదనలు వినే అవకాశాలున్నాయని అంటున్నారు. న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ భూములు, హైదరాబాద్‌లోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ కార్యాలయాల భవనాలు, ఇతర ఆస్తుల పంపకాలకు సంబంధించిన అంశాలు కూడా పెండింగ్‌లోనే ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిలో భవనాల నిర్మాణాల కోసం కనీసం 2,200 కోట్ల రూపాయల నిధులను ఇవ్వాల్సిఉందని, ఇక ఉద్యోగుల విభజన అంశాలు కొన్ని శాఖల్లో పెండింగ్‌లోనే ఉన్నాయని అంటున్నారు. విద్యుత్తు, ఎక్సైజ్, పోలీస్‌శాఖ, సెక్రటేరియట్ ఉద్యోగుల విభజన అంశాలు కూడా నేటికీ పెండింగ్‌లోనే ఉన్నాయని, వాటిపైన కూడా కేంద్ర హోంశాఖ కార్యదర్శి రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలను నివేదికలు కోరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మొత్తం మీద జనవరి 12వ తేదీన హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా అధ్యక్షతన జరగబోయే సమావేశానికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడిందని అధికారవర్గాలు అంటున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News