Monday, April 29, 2024

రైతుల తరహాలోనే నేతన్నలూ తిరగబడతారు

- Advertisement -
- Advertisement -

GST tax on textile industry should be waived

మా మాట వినకున్నా.. మీ గుజరాత్ నేతల మాటైనా పట్టించుకోండి
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు కెటిఆర్ లేఖ, పీయూష్‌కు ట్వీట్

మన తెలంగాణ/హైదరాబాద్ : వస్త్ర పరిశ్రమపై విధించే అదనపు జీఎస్టీ పన్ను ప్రతిపాదనలను వెంటనే విరమించుకోవాలని పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు కోరారు. జనవరి ఒకటో తేదీ నుంచి వస్త్ర పరిశ్రమపైన విధించబోతున్న అదనపు జీఎస్టీ పన్ను ప్రతిపాదనలను వెంటనే విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. జీఎస్టీ కౌన్సిల్‌లో ఈ పన్ను పెంపు ప్రతిపాదన విరమించుకోవాలని కేంద్ర అర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆయన లేఖ రాశారు. జిఎస్టీ పన్ను పెంపుతో దేశంలోని వస్త్ర, చేనేత పరిశ్రమ పూర్తిస్థాయిలో కుదేలవుతుందన్నఆందోళన వ్యక్తం చేశారు. వస్త్ర పరిశ్రమపై అధారపడిన కోట్లాది మంది కార్మికులకు సమ్మెట పోటని, ఇది వారి జీవితాలను పూర్తిగా దెబ్బ తీస్తుందని కెటిఆర్ వ్యక్తం చేశారు.

పన్ను పెంపుతో 80 నుంచి 85 శాతం దేశంలోని చేనేత జౌళి పరిశ్రమ ఉత్పత్తులు ప్రభావానికి గురవుతాయి. టెక్స్‌టైల్, అప్పారెల్ యూనిట్లు నష్టాలపాలై మూతపడే ప్రమాదం ఉందన్నారు. చేనేత, జౌళి రంగంలోని కోట్లాదిమంది ఉద్యోగాలకు ఎసరు పెట్టే ఈ ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో మొండిగా ముందుకు వెళ్తే, వ్యవసాయ చట్టాల విషయంలో రైతులు తిరగబడిన తరహాలోనే నేత కార్మికులు సైతం తిరగబడతారు. పన్ను పెంపు ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం విరమించుకునే వరకు ఈ విషయంలో వస్త్ర పరిశ్రమ పారిశ్రామిక వర్గాలకు, దేశంలోని నేతన్నలకు తెలంగాణ తరపున అండగా నిలబడతామన్న కెటిఆర్ వెల్లడించారు.

గుజరాతీలనైనా పట్టించుకోండి

చేనేత వస్త్ర పరిశ్రమపై 12 శాతం జిఎస్‌టి పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చేనేత సంఘం నేతలు కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ధర్నాలు చేసేందుకు సిద్ధమయ్యారు. చేనేతపై జిఎస్‌టి తగ్గించాలని బిజెపియేతర పార్టీలే కాకుండా ఆ పార్టీకి చెందిన వారు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని మంత్రి కెటిఆర్ ట్విట్టర్ వేదికగా పేర్కొంటూ.. కేంద్ర టెక్స్‌టైల్స్ శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు చురకలంటించారు. కేంద్ర మంత్రి దర్శన్ జర్దోష్, గుజరాత్ బిజెపి అధ్యక్షుడు సిఆర్ పాటిల్ డిమాండ్ చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ .. ‘చేనేతపై జిఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని ఆ ఇద్దరు నేతలు డిమాండ్ చేశారు. మమ్మల్ని పట్టించుకోకపోయినా.. కనీసం గుజరాత్‌ను అయినా పట్టించుకోవాల’ని కేంద్ర మంత్రికి కెటిఆర్ సూచించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News