Monday, April 29, 2024

వరద వ్యథలకు చెల్లు

- Advertisement -
- Advertisement -

Permanent measures for flood prevention in Hyderabad:KTR

హైదరాబాద్‌లో ముంపు నివారణకు శాశ్వత చర్యలు

రూ.858కోట్ల వ్యయంతో 12కి.మీ. పొడవైన గోడ నిర్మాణానికి శ్రీకారం
కవాడిగూడ టు మూసీ వరకు రిటర్నింగ్ వాల్‌కు శంకుస్థాపన
గత పాలకులు నిర్మించింది 3 కి.మీ.గోడే, అందువల్లే వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు
మంత్రి కెటిఆర్

మన తెలంగాణ /హైదరాబాద్ : వరదల ముంపు నివారణకు శాశ్వత చర్యలు తీసుకుంటున్నామని, పురపాలక శాఖ మంత్రి కె.తారక రామరావు తెలిపారు. ఇందుకు వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమం (ఎస్‌ఎన్‌డిపి) ద్వారా తొలి దశ కింద రూ. 858 కోట్ల వ్యయంతో యుద్ధ్ద ప్రతిపాదికన పనులను చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. రూ. 68.40 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న హుస్సేన్ సాగర్ వరద నీటీ కాల్వ (సర్ ప్లస్ నాలా) పై కవాడిగూడ నుండి మూసీ నది వరకు చేపట్టిన రిటర్నింగ్ వాల్ పనులకు మంత్రి కెటిఆర్ గురువారం శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, జిహెచ్‌ఎంసి కమిషనర్ డి. ఎస్. లోకేష్ కుమార్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, సిఈలు వసంత, జియా ఉద్దీన్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కె.టి.ఆర్ మాట్లాడుతూ గత ఏడాది అక్టోబర్‌లో కురిసిన అతిభారీ వర్షాల కారణంగా హుస్సేన్ సాగర్ వరదనీటి కాల్వ పొంగిపొర్లడంతో నల్లకుంట, అంబర్‌పేట్, అశోక్‌నగర్, ముషీరాబాద్ ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు.

ఈ ప్రాంతాలవాసుల సమస్యకు శాశ్వత పరిష్కారంగా చర్యల్లో భాగంగా హుస్సేన్ సాగర్ నుండి మూసీనది వరకు ఇరువైపులా 12 కిలోమీటర్ల రిటైనింగ్ వాల్ పనులకు శ్రీకారం చుట్టినట్లు మంత్రి వెల్లడించారు. గత ప్రభుత్వాల హయాంలో ఈ నాలాకు మూడు కిలోమీటర్లు మాత్రమే రిటర్నింగ్ వాల్ నిర్మించడంతో తరచు ఇలాంటి సమస్యలను ఏర్పడిందని ఇక మీదట ఈ సమస్య ఉండబోదన్నారు. గత పాలకులు 70 ఏళ్లలో నుండి ఎలాంటి నాలా అభివృద్ధి చేయలేదని దీనిని కారణంగా చిన్నపాటి వర్షాలకు సైతం నగర ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. అందుకే ఎస్‌ఆర్‌డిపి ద్వారా రోడ్ల అభివృద్ధికి చేపట్టినట్లుగానే నాలాల అభివృద్ధికి ఎన్‌ఎస్‌డిపిని ఏర్పాటు చేశామన్నారు. నగరంలో అకాల వర్షాలకు అధికంగా వరద ప్రభావానికి గురువుతున్న ప్రాంతాలను మొదటి దశ కింద రూ. 858 కోట్ల వ్యయంతో చేపట్టేందుకు చర్యలు తీసుకున్నామని, వీటిని నిర్ధేశించి సమయంలో పూర్తి చేయనున్నట్లు చెప్పారు. ఈ మొదటి దశలో జిహెచ్‌ఎంసి పరిధిలో కాకుండా చుట్టూ ప్రక్కల ప్రాంతాల పట్టణ ప్రాంతంలో కూడా నాలాల అభివృద్ధి చేస్తున్నామన్నారు.

ఇందులో భాగంగా జిహెచ్‌ఎంసి పరిధిలో రూ.633 కోట్లతో 30 పనులు ఓ.అర్.ఆర్ పరిధిలో లోపల ఉన్న మునిసిపాలిటీలలో 22 పనులు రూ.225 .12 కోట్ల వ్యయంతో చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. హుస్సేన్ సాగర్ సర్ ప్లస్ నాలా పనులు రూ. 68.40 కోట్ల వ్యయంతో హుస్సేన్ సాగర్ నుండి మూసీ నది వరకు 9 కిలోమీటర్ల నాలా రిటైనింగ్ వాల్ చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ నాలా రిటైనింగ్ వాల్ నిర్మాణం వలన 400 ఆస్తులు కోల్పోతుండగా ప్రజల ఇబ్బందులను గమనించి 20 ఆస్తులకు కుదించడం జరిగిందని తెలిపారు. వారికి న్యాయం చేయడం జరుగుతుందన్నారు. గతంలో తలెత్తిన సమస్య పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం అవుతుంది. అందుకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని శాసన సభ్యులు, కార్పొరేటర్లు ఈ పనులలను ఎప్పటి కప్పుడు సమీక్షించి వేగవంతంగా పూర్తి చేసేందుకు కృషి చేయాలన్నారు. మొత్తం నాలా 3.64 కిలో మీటర్ల నుండి 9.125కిలో మీటర్ల పొడవు గతంలో 3.68కిలో మీటర్లు రిటైనింగ్ వాల్ నిర్మించారని అన్నారు.

హుస్సేన్ సాగర్ సర్ ప్లస్ నాలా వైస్రాయ్ హోటల్ నుండి కవాడిగూడ, గాంధీనగర్, అశోక్ నగర్, చిక్కడపల్లి, బాగ్ లింగంపల్లి, గోల్నాక మూసినది వరకు చేపడుతున్నారు. ఈ ప్యాకేజీ పనులు రెండు ప్యాకేజీలలో చేపట్టి పూర్తి చేయనున్నారు. మొత్తం రూ. 858.32 కోట్ల వ్యయంతో చేపట్టే నాలా అభివృద్ధి పను లలో జిహెచ్‌ఎంసి పరిధిలో రూ.633 కోట్ల తో జోన్ వారీగా చేపట్టనున్నారు. సికింద్రాబాద్ జోన్ లో రూ.163 కోట్ల తో చేపట్టనున్నారు. అదేవిధంగా కూకట్ పల్లి జోన్ లో రూ. 112.80 కోట్లు, ఎల్ బినగర్ జోన్ లో రూ.113.59 కోట్లు, ఖైరతాబాద్ జోన్ లో రూ. 100.26 కోట్లు , చార్మినార్ జోన్ లో రూ. 85.61 కోట్లు, శేరిలింగంపల్లి జోన్ లో రూ. 57.74 కోట్లతో చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇతర మున్సిపాలిటీలో రూ. 225.32 కోట్ల వ్యయంతో చేపట్టనున్నారు.మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో రూ. 45.62 కోట్ల తో నాలా పనులు చేపట్టనున్నారు.

బడంగ్ పేట్ మున్సిపాలిటీలో రూ. 23.94 కోట్లు, జల్ పల్లి మున్సిపాలిటీ లో రూ. 24.85 కోట్లు, పెద్దఅంబర్ పేట్ లో రూ. 32.42, కోట్లు, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో రూ. 84.63కోట్లు, కొంపల్లి మున్సిపాలిటీ లో రూ. 13.86 కోట్లతో చేపట్టనున్నట్లు తెలిపారు. హుస్సేన్ సాగర్ సర్ ప్లస్ నాలా పనులు మొదటి ప్యాకేజీ ద్వారా రూ. 33.15 కోట్ల వ్యయంతో 3 పనులు చేపట్టనున్నారు. కవాడిగూడ బ్రిడ్జి నుండి గాంధీ నగర్ బ్రిడ్జి వరకు గాంధీ నగర్ బ్రిడ్జి నుండి అశోక్ నగర్ (అరవింద్ నగర్ ) బ్రిడ్జి వ రకు, అశోక్‌నగర్ (అరవింద్ నగర్) బ్రిడ్జి నుండి (అశోక్ నగర్ ) హిమాయత్ నగర్ బ్రిడ్జి వరకు రెండో ప్యాకేజీ ద్వారా 5 పనులు రూ. 35.25 కోట్ల వ్యయంతో చేపడతారు.

హిమాయత్ నగర్ (అశోక్ నగర్)బ్రిడ్జి నుండి చిక్కడపల్లి బ్రిడ్జి వరకు, చిక్కడపల్లి బ్రిడ్జి నుండి బాగ్ లింగంపల్లి బ్రిడ్జి వరకు, బాగ్ లింగంపల్లి బ్రిడ్జి నుండి నల్లకుంట బ్రిడ్జి, నల్లకుంట బ్రిడ్జి నుండి గోల్నాక బ్రిడ్జి, గోల్నాక బ్రిడ్జి నుండి మూసి నది సంగమం వరకు పనులు చేపడుతున్నారు. అదేవిధంగా రెండో దశలో సమస్యాత్మకంగా ఉన్న ప్రాంతాల్లోని నాలాలను అభివృద్ది చేపట్టనున్నట్లు మంత్రి కెటిఆర్ వివరించారు. ఈ సమావేశంలో పర్యవేక్షణ ఇంజనీర్ భాస్కర్ రెడ్డి, కార్పొరేటర్లు విజయ్ కుమార్ గౌడ్, లావణ్య, రచన, పావని, మహాలక్ష్మి రమణ గౌడ్, అమృత, ఉమ రాణి, ఎస్.ఎన్.డి.పి ఇంజనీర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News