Monday, April 29, 2024

అనురాగ్ ఠాకూర్‌పై రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఆరోపణలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : చాలా కాలం పాటు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ఓ శక్తివంతమైన వ్యక్తికి వ్యతిరేకంగా నిలబడడం అత్యంత కష్టమని స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఆందోళన వెలిబుచ్చారు. కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌పై ఆరోపణలు చేశారు. లైంగిక వేధింపులకు పాల్పడిన భారత రెజ్లింగ్ ఫెడరేషన్ ఛైర్మన్ బ్రిజ్ భూషణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఢిల్లీలో టాప్ రెజ్లర్లు నిరసన దీక్షను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.

ఈ నిరసన దీక్షకు స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ నాయకత్వం వహించి ముందుకు నడిపిస్తున్నారు. నాలుగు నెలల క్రితం మొదటిసారి ఆందోళన చేపట్టడానికి ముందు ఓ అధికారిని కలిశాం. మహిళా అథ్లెట్లు ఏ విధంగా లైంగికంగా వేధింపులకు గురవుతున్నారో వివరించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అందుకే తాము ధర్నా చేస్తున్నాం. కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు కూడా వివరించాం. మంత్రితో మాట్లాడిన తరవాత నిరసన నిలిపివేశాం. అయితే ఆయన కమిటీని ఏర్పాటు చేసి , ఈ వ్యవహారాన్ని అణచివేసేందుకు ఆయన ప్రయత్నించారు. బ్రిజ్ భూషణ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఫొగాట్ ఆరోపించారు.

అనంతరం రెజ్లర్ బజరంగ్ పునియా మాట్లాడుతూ ఒలింపిక్స్ కోసం రూపొందించిన నిబంధనలకు వ్యతిరేకంగా తాము నిరసన తెలుపుతున్నట్టు బ్రిజ్ భూషణ్ చెబుతున్నారని, తాము నిరసన తెలుపుతున్నది ఒలింపిక్స్ కోసం కాదని, లైంగిక వేధింపులపైనని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా బ్రిజ్‌భూషణ్ సింగ్ మాత్రం తాను రాజీనామా చేస్తే ఆరోపణలను అంగీకరించినట్టు అవుతుందని వ్యాఖ్యానించారు. అందుకు స్పందించిన వినేష్ ఫొగాట్ తమకు కావలసింది న్యాయం అని స్పష్టం చేశారు. అదేగాదు.. మా మన్‌కీబాత్ వినండి మోడీ అని వినేష్ కన్నీటి పర్యంతం అయ్యారు. ఆఖరికి స్మృతి ఇరానీ కూడా తమ గోడు వినడం లేదని ఆవేదనగా చెప్పారు. కాగా, ఇప్పటికే ఈ విషయమై బ్రిజ్‌భూషణ్‌పై రెండు కేసులు నమోదయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News