Sunday, April 28, 2024

వాజ్‌పేయి కపట వైఖరులు

- Advertisement -
- Advertisement -

Vajpayee's Hypocritical Attitudes

 

నెహ్రూ తనను ప్రథమ సేవకునిగా ప్రకటించుకున్నారు. మోడీ తాను ప్రధాన సేవకున్నన్నారు. వాజపేయి సంఘ్ ప్రధానిగా పని చేశారు. ప్రధానిని కాకు న్నా ఆజన్మ సంఘీయున్నని ప్రకటించారు. ఆయన ప్రధానిగా తక్కువ సంఘ్ సభ్యునిగా ఎక్కువ.
ప్రధాని వాజపేయి వారసత్వాల్లో ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ ప్రధానమైంది. పెట్టుబడుల ఉపసంహరణ శాఖ (అమ్మకాల) మంత్రిగా అరుణ్ శౌరిని నియమించి ప్రైవేటీకరణను చట్టబద్ధం చేశారు. ఉపసంహరణలు నష్టాల ప్రభుత్వ సంస్థల ఉద్ధరణకు కాదు. కల్పవృక్షాలను ప్రైవేట్లకివ్వటానికి. ప్రైవేటీకరణను సంకీర్ణ భాగస్వామ్య పక్షాలు, ప్రతిపక్షాలు ప్రతిఘటించాయి. అయినా 1999- 2004 మధ్య విదేశ్ సంచార్ నిగమ్ లిమిటెడ్, హిందుస్తాన్ జింక్, బాల్కొ, ఐపిసిఎల్, బిపిసిఎల్, ఐటిడిసి హోటళ్ళు, మాడ్రన్ ఫుడ్ మొదలగు విలువైన సంస్థలను అగ్గువగా అమ్మి కేవలం రూ.6,344 కోట్లు సాధించారు. మారుతి ఉద్యోగ్ లిమిటెడ్‌ను వదిలేశారు.

1998- 2004 మధ్య అనేక సంస్థలనమ్మి రూ.37,000 కోట్లు సంపాదించారు. శౌరిపై అవినీతి ఆరోపణలు వచ్చినా ప్రభుత్వ ఆస్తుల అమ్మకాల కళంకాన్ని పవిత్రీకరించారు. ప్రత్యేక ఆర్థిక మండళ్ళు మరో కార్పొరేట్ల అనుకూల్ విధానం. పారిశ్రామిక, కార్మిక చట్టాలు బేఖాతరు చేసి పారిశ్రామిక వర్గాలకు ఒకే చోట సకల సౌకర్యాలు కల్పించారు. వేల ఎకరాల భూమి, మౌలికవసతులు, పన్నులు లేని పరికరాలు, విడిభాగాలు, ముడిపదార్థాలు, కార్మికసంఘాలు, హక్కులులేని చవక కార్మికులను అప్పజెప్పటం ఈ మండళ్ళ ప్రత్యేకత. ఎలెక్ట్రానిక్ పరికరాలపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించారు. స్వదేశీ, విదేశీ పెట్టుబళ్ళను సరళీకరించారు. ఆదాయ పన్ను రాయితీలిచ్చారు. పరిశ్రమల స్వాధీన, యాజమాన్య బదిలీల పరిమితులు ఎత్తేశారు. పలు కంపెనీలు కాగితాల్లో ఉండిపోయాయి. మండళ్ళలో వనరులు వాణిజ్యవేత్తల పాలయ్యాయి. వాళ్ళు అపరిమిత లాభం పొందారు. టెలికం రంగాన్ని ప్రైవేట్లకప్పజెప్పారు.

డబ్బులు చెల్లించని కాంట్రాక్టులు రద్దు చేయకుండా కాంట్రాక్టు మొత్తాన్ని భారీగా తగ్గించి ఖజానాకు భారీ నష్టం కలిగించారు. సెల్ కమ్యూనికేషన్లలో ప్రైవేట్లకే ప్రవేశం కల్పించారు. సెల్ ఫోన్ల తయారీ ప్రభుత్వ సంస్థ్ ఐటిఐ కివ్వలేదు. ప్రభుత్వరంగ సంస్థ బి.ఎస్.ఎన్.ఎల్.కు చట్టబద్ధ నిధులివ్వలేదు. రాయితీలు రద్దు చేశారు. మొబైల్ పరికరాల కొనుగోళ్ళకు మోకాలడ్డారు. స్పెక్ట్రం కుంభకోణ మూలాలు ఈయన పాలనలోనే ఉన్నాయి. టెలికం విధానాల్లో ప్రైవేట్లకు పెద్ద పీట వేశారు. వాజపేయి పెంపుడు కూతురు నమిత్ భర్త రంజన్ భట్టాచార్య ప్రధాని కార్యాలయ ప్రత్యేక అధికారి అయ్యారు. పెట్రోల్‌పంపుల అక్రమ కేటాయింపులు పొందారు. మలేసియా కంపెనీకి లక్షల కోట్ల జాతీయ రహదారుల కాంట్రాక్ట్ ఇప్పించారు. 20 వేల కోట్ల రిలయన్స్ హిర్మా పవర్ ప్రాజెక్ట్ కేటాయింపులు, యుటిఐ, టెలికాం కుంభకోణాల్లో ఇరుక్కున్నారు.

బాబ్రీ మసీదు కూల్చటానికి ముందురోజు సంఘ్ కరసేవకులనుద్దేశించి మాట్లాడుతూ, వాజపేయి, భూమిని చదును చేయండని రెచ్చగొట్టారు. కరసేవకులు మసీదును కూల్చారు. ఆ ఒరవడిలో అధికారం పొందిన వాజపేయి, సమాజాన్ని, ఆర్థిక వ్యవస్థను, రాజకీయాలను సంఘ్ తాత్వికతకు మళ్ళించారు. దేశ లౌకిక స్వభావానికి, శాస్త్రీయ దృక్పథానికి తూట్లు పొడిచారు. బహుళ జాతి సంస్థలకు ఎర్ర తివాచీ పరిచారు. మానవ వనరుల మంత్రి మురళి మనోహర్ జోషి విద్యారంగంలో అశాస్త్రీయ అంశాలను ప్రవేశపెట్టారు. ఆ కోర్సులు బోధిస్తున్న ప్రైవేటు విద్యా సంస్థలకు అపరిమిత ఆర్థిక సాయం చేశారు.

18.05.1974న ప్రధాని ఇందిరా గాంధీ ‘నవ్వుతున్న బుద్ధుడు’ అన్న సంకేత నామంతో మొదటి పోఖ్రాన్ అణు పరీక్ష జరిపారు. ఈ విషయాన్ని నేడు సంఘ్ ప్రస్తావించదు. పాఠ్యాంశాల్లో దీని ప్రస్తావనే లేదు. వాజపేయి హయాంలో 1998 మే లో రెండవ పోఖ్రాన్ పరీక్ష చేశారు. ఈ వినాశకాన్ని వాజపేయి ఘనకార్యంగా సంఘ్ ప్రచారం చేస్తున్నది. పాఠ్యాంశాల్లో దీన్ని గొప్పగా వర్ణించారు. ఈ పరీక్షతో అలిగిన అమెరికా మామ క్లింటన్‌కు పరీక్ష నిర్వహణ కారణాలు వివరిస్తూ వాజపేయి ఉత్తరం రాశారు. అలీన విధానాన్ని వదిలేస్తామని, అమెరికాకు వ్యూహాత్మక మిత్రహస్తాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. రహస్యంగా ఈ నీచకృత్యానికి పాల్పడి, బహిరంగంగా అణుపరీక్ష అతిశయ విజయ ప్రకటన చేసుకున్నారు. ఇది సంఘ్, భాజపాల హైందవ అత్యాచారాల నుండి ప్రజల దృష్టిని మరల్చటానికి వాజపేయి పన్నాగమని విశ్లేషకుల అభిప్రాయం.

భారత విమానాన్ని ఐదుగురు పాకిస్తాన్ ఉగ్రవాదులు కాందహార్‌కు మళ్ళించారు. వాజపేయి వాళ్ళు కోరిన ముగ్గురు ఉగ్రవాదులను అప్పజెప్పి విమానాన్ని విడిపించారు. తర్వాతి కాలంలో ఈ ఉగ్రవాదులు అమెరికా వాణిజ్య కేంద్రాన్ని పేల్చారు. వాల్ స్ట్రీట్ పత్రిక పాత్రికేయుడు డేనియల్ పీర్ల్ ను చంపారు. 2006 ముంబయి దాడులు చేశారు. భారత చరిత్రలో ఇది పెద్ద కళంకం. కార్గిల్‌లో పాకిస్తాన్ సైనికుల చొరబాట్లను మురళి జోషి జ్యోతిశాస్త్రం పసిగట్టలేకపోయింది. గొర్రెల కాపర్లు చెప్పే దాకా ఆ సంగతి తెలియలేదు. సైనికుల బలిదానాలతో పెద్ద విపత్తు తప్పింది. సైన్యం సాధించిన కార్గిల్ విజయం వాజపేయికి ఎన్నికల విజయాన్ని తెచ్చిపెట్టింది.

ఒడిశాలో కుష్టు రోగుల చికిత్స చేసి అలిసి జీపులోనే ఇద్దరు కొడుకులతో నిద్రిస్తున్న ఆస్ట్రేలియా వైద్యులు గ్రహం స్టేన్స్‌ను హిందుత్వ ఉగ్రవాద సంస్థ బజరంగ్ దళ్ మతవాదులు 23.01.99 కాల్చి చంపారు. వాజపేయి ఈ అమానవీయ హత్యలను ఖండించ లేదు. పైగా మత మార్పిళ్ళపై చర్చ జరగాలన్నారు. ఈ స్వభావమే మోడీని 2002లో గోధ్రానంతర నరమేధానికి ఉసిగొల్పింది. ప్రపంచ ముఖస్తుతికి రాజధర్మం పాటించాలని మోడీకి ‘ఉద్బోధించారు’ వాజపేయి. 12.04.2002న గోవాలో సంఘ్ నాయకత్వానికి, ఆడ్వాని, అరుణ్ జైట్లీలకు తలొగ్గి నిశ్శబ్దం వహించారు. గోధ్రా నరమేధాన్ని సమర్థించారు. ‘ముస్లింలు, క్రైస్తవులు దేశానికి రాకముందు లౌకికత్వం రాజ్యమేలింది. వాళ్ళను మతం మార్చుకోమనలేదు. అది మన మత సంస్కృతి కాదు.’ అని ప్రధానిగా హైందవ మతోపదేశం చేశారు. ముస్లింలు హిందువులను చంపకుంటే గోధ్రా ఘటన జరిగేది కాదని న్యూటన్ మూడవ సూత్రం చెప్పారు. ముస్లింలు సహజీవనం ఇష్టపడరని సంఘ్ సిద్ధాంతం వల్లించారు.

ముస్లిం ఓట్లు లేకున్నా యుపి ఎన్నికల్లో బిజెపి విజయం సాధిస్తుందని 19.02.2002న వాజపేయి అన్నారు. వాజపేయి సంస్కృతితో ఉద్దీపన పొందిన మోడీ 2017లో దీన్ని అమలుచేశారు. మోడీ గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశాలలో పాత చర్చీలు పడగొట్టారు. కడుతున్న వాటిని ఆపారు. బైబిళ్ళను కాల్చారు. క్రైస్తవ సన్యాసినుల్ మానభంగం చేశారు. జిహాద్ దాడులు జరిపారు. 24 పార్టీల సంకీర్ణ ప్రభుత్వంలోనే ఇంత జరిగింది. మోడీ ఏకపక్ష ఏకవ్యక్తి నిరంకుశ పాలనలో ఫాసిజానికి నాంది పలికింది.

2003లో అమెరికా ఇరాక్‌పై దాడి చేసింది. దీన్ని కఠినంగా ఖండించాలని ప్రతిపక్షాలు కోరాయి. బహిరంగ ప్రకటన కంటే నిశ్శబ్ద దౌత్యం సమర్థవంతమైందన్నారు వాజపేయి. ‘సైనిక చర్యకు సమర్థన లేదు.’ అన్న బిజెపి జాతీయ కార్యవర్గం తీర్మానాన్ని ప్రభుత్వ తీర్మానంగా అమెరికాకు అర్థంకాని హిందీలో పంపారు. ఈ తీర్మానంలో ఇరాక్, అమెరికాల ప్రస్తావన లేదు. అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం దెబ్బతినకూడదని వాజపేయి ఉద్దేశం. ఎమర్జెన్సీలో తనను జైలు నుంచి వదలమని ఇందిరకు అనేక ఉత్తరాలు రాశారు వాజపేయి. ఫలితంగా ఎక్కువగా పెరోల్ పైనే ఉన్నారు. ఇదీ వాజపేయి ధైర్యం! సావర్కర్ భీరత్వం. మృత్యు సందేశాల్లో చెడు చెప్పరు. మంచిని అతిశయిస్తారు. మోడీతో పోల్చి వాజపేయిని పొగడరాదు. నిజాలు చెప్పకపోతే భావితరాలు తప్పుడు భావజాలంలో కూరుకుపోతాయి. అంచనాలు వక్రీకరించబడి దేశం వినాశకుల పాలనలో ఇరుక్కుపోతుంది. నేటి నిరంకుశత్వానికి పొగరెక్కుతుంది. మా వారసత్వం మంచిదని గర్విస్తుంది. రేపు మోడీ, షాలనూ శభాష్ అంటారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News