Wednesday, May 1, 2024

నగరం కిటకిట

- Advertisement -
- Advertisement -

Vehicles

 సాధారణ రద్దీవలే రోడ్లపైకి వచ్చిన వాహనాలు
ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద భారీగా ఆగిన వాహనాలు
తనిఖీ చేస్తూ జరిమానాలు విధించిన ట్రాఫిక్ పోలీసులు

హైదరాబాద్: జిహెచ్‌ఎంసి పరిధిలో వాహనాలు సోమవారం యథేచ్ఛగా తిరిగాయి. లాక్‌డౌన్ విధించడానికి ముందు ఉన్న పరిస్థితి వలే వాహనాలు రోడ్లపైకి వచ్చాయి. అత్యవసర వాహనాలకు మాత్రమే రోడ్లపైకి వచ్చేందుకు అనుమతి ఉందని పోలీసులు స్పష్టం చేసినా ఎవరూ పట్టించుకోలేదు. పోలీసులు అక్కడక్కడ తనిఖీలు చేసినా కూడా వాహనదారులు కుంటిసాకులు చెబుతున్నారు తప్ప బయటికి రాకుండా ఉండడం లేదు. దీంతో నగర రోడ్లన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి. పంజాగుట్ట, ఎర్రగడ్డ, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు తదితర ప్రాంతాల్లో వాహనాలు జామయ్యాయి.

ట్రాఫిక్ సిగ్నిల్స్‌ను ప్రారంభించడంతో వాహనదారులు సిగ్నల్స్ వద్ద బారులు తీరారు. మూడు కమిషనరేట్ల పరిధిలోని అన్ని ప్రాంతాల్లో వాహనదారులు విచ్చలవిడిగా రోడ్లపైకి వచ్చారు. వారిని పోలీసులు ఆపుతున్నా కుంటిసాకులు చెబుతున్నారు. ఆస్పత్రికి వెళ్లేందుకు వచ్చామని, నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేందుకు వచ్చామని చెబుతున్నారు. కొందరు పనిలేకున్నా బయటికి వచ్చి వాహనాలపై తిరుగుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు వారిని ఆపి జరిమానాలు విధిస్తున్నారు.

కొందరు బైక్‌లపై హెల్మెట్ లేకుండా వెళితే సాధారణ సమయంలో మాదిరిగా జరిమానాలు విధిస్తున్నారు. అవసరం లేకున్నా బయటికి వచ్చిన కారులపై పోలీసులు రూ.1,000 జరిమానా విధిస్తున్నారు. జరిమానాలు విధిస్తున్నా కూడా వాహనదారులు రోడ్లపైకి రావడం మానడంలేదు. రోడ్లపైకి వచ్చి విచ్చలవిడిగా తిరుగుతూనే ఉన్నారు. ఐటి కంపెనీలకు 33శాతం ఉద్యోగులు పనిచేసుకునేందుకు అనుమతి ఇచ్చినా కూడా చాలా మంది సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కంపెనీలకు రాలేదు. లాక్‌డౌన్ విధించిన తర్వాత ఇంటి నుంచే పనిచేస్తున్నట్లుగానే విధులు నిర్వర్తిస్తున్నారు.

ఈ పరిధిలో ట్రాఫిక్ కొంచెం తక్కువగానే ఉంది. కూకట్‌పల్లి, ఆర్‌సిపురం తదితర ప్రాంతాల్లో మాత్రం వాహనాల రద్దీ ఉదయం పూట ఎక్కువగా ఉంది. ఎర్రగడ్డ సిగ్నల్ వద్ద ఉదయం సమయంలో భారీగా వాహనాలు ఆగిపోయాయి. ఇక్కడ పోలీసులు తనిఖీలు చేయడంతో భారీ ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.

వాహనాల సీజ్ లేదు…

గతంలో లాక్‌డౌన్ నిబంధనులు ఉల్లంఘించిన వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి సీజ్ చేసేవారు. ఇప్పుడు లాక్‌డౌన్ నిబంధనలు పాక్షికంగా సడలించడంతో వాహనదారులు విచ్చలవిడిగా రోడ్లపైకి వచ్చారు. పోలీసులు గతంలో మాదిరిగా నాన్ కాంటాక్ట్ చలాన్లు విధిస్తుండడంతో విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఇలా తిరుగుతున్న వారిని గుర్తించి పోలీసులు జరిమానాలు వేస్తున్నారు. ఇలా వందలాది వాహనాలపై ట్రాఫిక్ చలాన్లు వేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News