Monday, April 29, 2024

గొర్రెలు, చేపల పంపిణీపై విజిలెన్స్ విచారణ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : గొర్రెలు, చేపల పంపిణీ పథకాల్లో జరిగిన అవినీతి అక్రమాల లావాదేవీలపై సమగ్రంగా విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ పథకాలు ప్రారంభించినప్పటి నుంచీ ఇప్పటివరకు లబ్ధిదారుల ఎంపిక మొదలు గొర్రెల కొనుగోలు, పంపిణీ జరిగిన తీరుపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని చెప్పారు. విజిలెన్స్ ఇచ్చే ప్రాథమిక నివేదికలో ఏమైనా అవినీతి, అవకతవకలను గుర్తిస్తే వెంటనే ఈ వివరాలను ఏసీబీకి అప్పగించాలని సీఎం అధికారులకు సూచించారు. మంగళవారం సచివాలయంలో పశు సంవర్ధక శాఖ, పాడి అభివృద్ధి, మత్స్య శాఖ అధికారులతో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అవకతవకలు, ఇటీవల ఈ పథకంలో జరిగిన భారీ అవినీతిని కాగ్ తమ నివేదికలో వేలెత్తి చూపిన విషయాన్నిఈ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ఇటీవల గొర్రెల పంపిణీకి సంబంధించిన నిధులను బినామీ పేర్లతో కొందరు ఉద్యోగులు సొంత ఖాతాలకు మళ్లించుకున్న కేసులో ఏసీబీ దర్యాప్తు గుర్తు చేస్తూ.. అదులో శాఖాపరంగా వివరాలేమీ సేకరించలేదా.. అని ఆరా తీశారు. 2017లో ప్రారంభించిన గొర్రెల పంపిణీ పథకంలో మొదటి విడతకు రూ. 3955 కోట్ల రుణం ఇచ్చిన చేసిన నేషనల్ కో ఆపరేటివ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ రెండో విడతకు ఎందుకు రుణం ఇవ్వటం నిలిపి వేసిందని ముఖ్యమంత్రి అధికారులను ప్రశ్నించారు. అప్పటికే ఈ పథకంపై కాగ్ వివిధ అభ్యంతరాలు లేవనెత్తడం, అవకతవకలను గుర్తించిందని, తదితర కారణాలతో ఎన్సీడీసీ రుణం ఇవ్వలేదని అధికారులు సమాధానమిచ్చారు. ఇప్పటికే తమ వాటా కింద 25 శాతం డీడీలు చెల్లించిన అందజేసిన లబ్ధిదారులకు ఎందుకు గొర్రెలను పంపిణీ చేయలేదని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. రెండో విడతలో 85488 మంది ఇప్పటికే తమ వాటా కింద 25 శాతం డబ్బు చెల్లించారని, దాదాపు రూ. 430 కోట్లు జిల్లా కలెక్టర్ల ఖాతాల్లోనే ఉన్నాయని అధికారులు తెలిపారు. మరో 2,20,792 మంది లబ్ధిదారులు ఇంకా డబ్బులు కట్టలేదని చెప్పారు. ఈ పథకం అమలు జరిగిన తీరుపై రకరకాల అనుమానాలున్నాయని, దీంతో పాటు చేపల పెంపకానికి సంబంధించి ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. ఈ వ్యవహారంపై సమగ్రంగా విచారణకు ఆదేశాలు జారీ చేశారు.
పాడిరైతుకు బకాయిలు చెల్లింపు
విజయ డెయిరీకి పాలు పోసినందుకు పాడి రైతులకు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహాలక బకాయిలను వచ్చేనెల్లో చెల్లించాలని సిఎం అధికారులకు ఆదేశాలిచ్చారు. పాడిరైతులు తాము పొసే పాలకు ఒక్కో లీటర్‌కు ఇచ్చే రూ.4 ప్రోత్సాహకం మూడేండ్లుగా ఇవ్వటం లేదని అధికారులు సీఎం దృష్టికి తీసుకు వచ్చారు. దాదాపు రూ.203 కోట్ల బకాయిలు పేరుకుపోయాయని చెప్పారు. స్పందించిన ముఖ్యమంత్రి ఏప్రిల్ నుంచి పాడి రైతులకు ఇవ్వాల్సిన ప్రోత్సాహాకాన్ని క్రమం తప్పకుండా విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి నెలా గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లింపులు జరిగేలా చూడాలని చెప్పారు.
మండలానికొక వెటర్నరీ హాస్పిటల్
ప్రతి మండలంలో వెటర్నరీ హాస్పిటల్ తప్పకుండా ఉండాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 91 కొత్త మండలాల్లోనూ ఆస్పత్రులను ప్రారంభించేందకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. మొబైల్ వెటర్నరీ క్లినిక్ సేవలను కొనసాగించాలని, అందుకు అవసరమైన టెండర్లను వెంటనే పిలవాలని చెప్పారు. వివిధ పథకాల్లో కేంద్రం నుంచి వచ్చే నిధులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. టీఎస్పీఎస్సీ చేపట్టిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల నియామకాల్లో ఈ విబాగంలో ఏళ్లకేళ్లుగా పని చేస్తున్న వారికి వెయిటేజీ ఇవ్వాలనే ప్రతిపాదనను పరిశీలించాలని, వైద్యారోగ్య శాఖలో అమలైన వెయిటేజీ విధానాన్నిఈ విభాగంలోనూ వర్తించేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు.ఈ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సిఎం ముఖ్యకార్యదర్శి శేషాద్రి,పశుసంవర్ధక శాఖ ముఖ్యకార్యదర్శి అధర్ సిన్హా, డెయిరీ డైరెక్టర్ లక్ష్మి, ఫిషరీస్ డైరెక్టర్ గోపి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News