Tuesday, April 30, 2024

ఇషాన్ కిషన్ విధ్వంసం.. 94 బంతుల్లోనే 173 పరుగులు..

- Advertisement -
- Advertisement -

Vijay Hazare Trophy: Ishan Kishan hits 173 runs vs MP

ఇండోర్: కిందటి ఐపిఎల్ సీజన్‌లో అసాధారణ బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన ముంబై ఇండియన్స్ ఆటగాడు ఇషాన్ కిషన్ ఈసారి విజయ్ హజారే వన్డే టోర్నమెంట్ తొలి మ్యాచ్‌లోనే కళ్లు చెదిరే శతకంతో చెలరేగి పోయాడు. జార్ఖండ్ డైనమైట్‌గా పేరు తెచ్చుకున్న ఇషాన్ కిషన్ విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా మధ్యప్రదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో శివమెత్తాడు. విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెలరేగి పోయిన కేవలం 94 బంతుల్లోనే ఏకంగా 19 ఫోర్లు, మరో 11 భారీ సిక్సర్లతో 173 పరుగులు బాదేశాడు. ఆరంభంలో కాస్త సమన్వయంతో ఆడిన ఇషాన్ అర్ధ సెంచరీ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 42 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించిన ఇషాన్ సెంచీరి మార్క్‌ను 74 బంతుల్లోనే చేరుకోవడం విశేషం. ఇక మరో 12 బంతుల్లోనే 150 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. దీన్ని బట్టి ఇషాన్ కిషన్ విధ్వంసం ఏ స్థాయిలో సాగిందో ఊహించుకోవచ్చు.

మరోవైపు విరాట్ సింగ్ (68), అనుకుల్ రాయ్ 39 బంతుల్లో ఏడు సిక్సర్లు, మరో మూడు ఫోర్లతో 72 పరుగులు సాధించడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన జార్ఖండ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 422 పరుగుల రికార్డు స్కోరును సాధించింది. తర్వాత భారీ లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన మధ్యప్రదేశ్ వరుణ్ అరోన్ (6/37) ధాటికి తట్టుకోలేక 98 పరుగులకే కుప్పకూలింది. దీంతో జార్ఖండ్ 324 పరుగుల భారీ తేడాతో రికార్డు విజయం సాధించింది. కరోనా వల్ల ఈసారి రంజీ ట్రోఫీని నిర్వహించడం లేదు. దానికి బదులు వన్డే ఫార్మాట్‌లో విజయ్ హజారే ట్రోఫీని నిర్వహిస్తున్నారు. ఈ టోర్నీకి శనివారం తెరలేచింది. ఇక మొదటి మ్యాచ్‌లోనే సంచలన ఫలితం రావడం విశేషం.

Vijay Hazare Trophy: Ishan Kishan hits 173 runs vs MP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News