Wednesday, May 15, 2024

గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలు

- Advertisement -
- Advertisement -
  • విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి

చేవెళ్ల: గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి తెలిపారు. సొంత ఊరికి నేను సైతమంటూ.. గ్రామాభివృద్ధికి బాటలు వేస్తూ… ప్రత్యేక ప్రణాళికలతో ప్రభుత్వ, ప్రైవేటు, సొంత నిధులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి కౌకుంట్ల గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి పనులకుగాను గ్రామస్తులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మూడున్నర కోట్ల రూపాయలతో గ్రామంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను బుధవారం రాత్రి మంత్రి పరిశీలించారు. కౌకుంట్ల గ్రామంలో పాదయాద్ర చేస్తూ అందరిని పేరు పేరున పలకరిస్తూ … క్షేమా సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. పెన్షన్ అందుతుందా అంటూ వృద్దులను ఆప్యాయంగా పలకరించారు. సుమారు మూడు గంటల పాటు గ్రామంలోని వీధులన్నింటిలో తిరిగి గ్రామస్తులతో కలివిడిగా మాట్లాడారు.

గ్రామంలో వేస్తున్న సీసీ రోడ్డు పనులను పరిశీలించి సంబంధిత అధికారులకు మంత్రి పలు సూచనలను చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబిత మాట్లాడుతూ.. తాను ఎక్కడ ఉన్న… ఏ పదవిలో ఉన్నా కౌకుంట్ల గ్రామ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతానన్నారు. ఎన్‌సిసి సంస్థ సహకారంతో చేపడుతున్న సీసీ రోడ్లతో గ్రామానికి కొత్త కళ వస్తుందని తెలిపారు. ఇప్పటికే అరబిందో కంపెనీ సహకారంతో సిఎస్‌ఆర్ నిధులు దాదాపు కోటి రూపాయలతో ప్రభుత్వ పాఠశాలలో అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, ఫర్నిచర్‌తో పాటు పలు రకాల సౌకర్యాలను కల్పించారని గుర్తుచేశారు.

అదేవిధంగా విద్యాశాఖ తరపున ప్రత్యేక లైబ్రరీ, రీడింగ్ రూమ్‌ను ఏర్పాటు చేయించామన్నారు. ఇలా కౌకుంట్ల గ్రామ అభివృద్ధిలో భాగం కావడం ఎంతో తృప్తిగా ఉందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఇప్పటికే గ్రామంలో పల్లె ప్రకృతి వనం, చిన్న పిల్లలు ఆడుకోవడానికి క్రీడా పరికరాలతో చిల్డ్రన్ పార్క్, ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేశామన్నారు. గ్రామంలో పెద్ద గుంతను పూడ్చడానికి రూ. 20 లక్షలు ఖర్చు చేయించి గుంత మూసివేయించామని తెలిపారు. దీంతో పాటు మన ఊరుమన బడి కింద రూ. 26 లక్షల నిధులతో అదనపు తరగతి గదులు నిర్మించమన్నారు.

ఇలా గ్రామంలో అన్ని రకాలుగా పనులు చేయిస్తూ, గ్రామ ప్రజలకు సౌకర్యాలను కల్పిస్తూ కౌకుంట్లను ఉత్తమ గ్రామంగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి వివరించారు. గ్రామంలోని పలువురు గృహలక్ష్మీ పథకం కింద ఇల్లు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించి అర్హులైన వారందరికీ గృహలక్ష్మీ పథకం ద్వారా ఇల్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటానని మంత్రి గ్రామస్తులకు హామీ ఇచ్చారు. మంత్రి వెంట సర్పంచ్, బిఆర్‌ఎస్ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News