Thursday, May 16, 2024

అంగన్ వాడీ యూనియన్ల సమస్యలను పరిష్కరిస్తాం: మంత్రి సత్యవతి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం అండగా నిలిచిందని రాష్ట్ర గిరిజన, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించే ప్రక్రియను సమర్ధవంతంగా అమలు చేస్తున్నామని ఆమె స్పష్టం చేశారు.దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోని అంగన్ వాడీ టీచర్లు, ఆయాల వేతనాలను పెంచామని అన్నారు. ఇక పై ప్రతి నెలా అంగన్‌వాడీ టీచర్లకు 14వ తేదీన జీతాలు వచ్చేలా అందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని మ ంత్రి తెలిపారు. శుక్రవారం సచివాలయంలో అంగన్ వాడీ యూనియన్లతో మంత్రి సమావేశం అయ్యారు. ఈసందర్భంగా తెలంగాణ అంగన్ వాడీ టీటర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, టీఎన్జీవో, మినీ అంగన్ వాడీ, సిఐటీయూ, ఏఐటీయుసి యూనియన్లతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

ప్రధానంగా రిటైర్ మెంట్ ప్రయోజనాలు, ఇన్సూరెన్స్, పీఆర్‌సీ, కారుణ్య నియామకాలు, మినీ అంగన్ వాడీ సెంటర్లను ప్రధాన అంగన్ వాడీ సెంటర్లుగా మార్చడం, అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్లకు పదోన్నతుల్లో సర్వీసు నిబంధనలు సడలించాలని , టీఏ,డీఏలను చెల్లించాలని, సూపర్ వైజర్ల నియామకాలను పరీక్షల ద్వారా కాకుండా సీనియార్టీ ప్రకారం అవకాశం కల్పించాలని పెండింగ్ బిల్లులు త్వరగా చెల్లించాలని యూనియన్ నాయకులు మంత్రిని కోరారు. సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆయా సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకు వెళ్లి త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలోని అంగన్వాడీల్లో చేపడుతున్న కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని, యూనిసెఫ్ అంతర్జాతీయ సంస్థ ప్రతినిధులు కొనియాడిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. అంగన్ వాడీ కేంద్రాల బలోపేతానికి ఎంతగానో కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీౠర్ వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News