Monday, April 29, 2024

జీవనదాతల జీవన రేఖలు!

- Advertisement -
- Advertisement -

శరీరే జర్జరీ భూతే వ్యాధి గ్రస్తే కళేబరే ఔషధం జాన్హవీత్యోహం వైద్యో నారాయణో హరి:
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదికల ప్రకారం ఒక దేశ పురోగతిని అంచనా వేయడానికి ఆ దేశంలో లభిస్తున్న వైద్య సౌకర్యాలను (Medical Facilities) ఆరోగ్య స్థితిగతులనే (Health Conditions) సూచికగా గమనిస్తారు. అంటే ఒక జాతి నిర్మాణంలో వైద్య, ఆరోగ్య వసతుల కల్పన ఒక ప్రధానాంశం అనేది మనకు తేటతెల్లం అవుతున్నది.మహాత్మాగాంధీ, సుభాష్ చంద్రబోస్, వివేకానంద లాంటి మహనీయుల ప్రకారం ఆరోగ్యవంతమైన ప్రజలే ,ఆలోచనాత్మకమైన జనులే దేశ భవితను నిర్ణయిస్తారనేది నిజం. అలాంటి ఆరోగ్యవంతమైన, ఆలోచనాత్మకమైన, ఆదర్శవంతమైన ప్రజల నిర్మాణానికి ఖచ్చితంగా కావలసింది సరైన మానవ వనరులే అని అంతర్జాతీయ సంస్థలన్నీ కోడై కూస్తున్నాయి. మానవాభివృద్ధి (Human Development Index) సూచికలో మానవ వనరులకు సంబంధించి ప్రతిష్టాత్మకంగానూ, ప్రత్యేకంగానూ ప్రస్తావించే అంశాలలో ఆరోగ్యం కూడా ఒకటి.

అందుకే International Fund for Population Activities (UNFPA )వంటి సంస్థలు ఉత్పాదకత తో కూడిన వయో వర్గానికి సంబంధించిన ప్రజల ద్వారా జాతీయోత్పత్తిని పెంచవచ్చని నిర్ధారించారు. మరొకవైపున United Nations Environment Program (UNEP) నిపుణులు బలమైన సమాజ నిర్మాణానికి కేవలం ప్రజలు ఉంటే సరిపోదు. బలమైన ఆరోగ్య కరమైన ప్రజలు కూడా ఉండాలి అని, దాని కోసం అవసరమైన వాతావరణం, భౌతిక, సామాజిక పరిసరాలు, పర్యావరణ పరమైన నిర్మాణాల ఏర్పాటు అవసరమని ఉద్ఘాటించారు. అలాగే, ప్రజాసమూహమైన ఊరికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? అన్నదానికి సుమతి శతకకారుడు ఇలా చెప్పాడు:- ‘అప్పిచ్చువాడు వైద్యుడు/ ఎప్పుడు నెడతెగక పారు నేరును, ద్విజుడున్/ చొప్పడిన యూరనుండుము/ చొప్పడకున్నట్టి యూర జొరకుము సుమతీ అని రుణదాత, వైద్యుడు, ఏరు, బ్రాహ్మణుడు ఉండేదే నిజమైన ఊరు, నిండైన ఊరు అని ఆ పద్యంలో చెప్పారు. అలా వైద్యానికి, ఆరోగ్యానికి వారు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో దీన్నిబట్టి మనకు తెలుస్తోంది!

నిజానికి ఆదిమ మానవుడి కాలంలో ప్రకృతితో మమేకమైన జీవన స్థితిగతులు కొనసాగిన కాలంలో వైద్యుడు, వైద్యశాస్త్రము, ఆరోగ్యానికి సంబంధించిన విశేషాలు పెద్దగా ప్రాధాన్యత సంతరించుకున్న దాఖలాలు లేవు. కానీ ఎప్పుడైతే మానవుడు తన జాతి తోటి మానవులలో శత్రువుల నుంచి, క్రూర మృగాల నుంచి తనను తాను కాపాడుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తూ తన మేధతో మిగతా ప్రపంచం పైన ఆధిపత్యాన్ని చెలాయించే స్థితికి చేరుకొని, ప్రకృతిని తన అవసరాలకు తన ఆలోచనలకు అనుకూలంగా మలచుకునే స్థితికి ఎదగడం ప్రారంభించాడో, ఆనాటినుంచి వైద్యం యొక్క పురోగతి, ఆవశ్యకత ఎంతో పెరిగింది యుద్ధాలు, ఆధిపత్య భావజాలం, జీవనేచ్ఛ, అధికారలాలస, జరా మరణాలపట్ల ధిక్కార వైఖరి,

ఆరోగ్యం పాత్రను, వైద్యం ప్రభావాన్ని మరింత పెంచాయి. ఆ క్రమంలోనే మనిషి ఆరోగ్యాన్ని నిరంతరం కాపాడే దిశగా ప్రత్యేక అధ్యయనాలు శాస్త్రీయ పద్ధతిలో ప్రారంభమయ్యాయి. ఆ క్రమంలో భారతీయ గడ్డ మీద ఆయుర్వేదం గా, ప్రకృతి వైద్యం గా, మూలికా వైద్యంగా, యోగ వైద్యంగా, ఇతర వైద్య రీతులుగా మొదలవగా, హిమాలయ ప్రాంతంలో టిబెటన్ వైద్య విధానం, చైనా లాంటి దేశాలలో ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెజర్ విధానాలు, మధ్య ప్రాచ్య అరబ్ దేశాలలో యునానీ వైద్యం, జర్మనీ ప్రాంతంలో హోమియోపతి, ఇతర పాశ్చాత్త్య దేశాలలో అల్లోపతి లాంటి ఎన్నో రకాల ప్రాచీన, ఆధునిక ప్రత్యామ్నాయ వైద్య విధానాలు అమలులోకి వచ్చాయి. పాశ్యాత్య వైద్య శాస్త్రానికి Hippocrates, ‘హోమియో వైద్యానికి Samuel Hahnemann (1755-1843) వంటి వారు పితామహులుగా పేరుగాంచారు.

ఇక పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్టు ‘వైద్యులందు పుణ్య వైద్యులు వేరయా అని చెప్పుకొవలసిన పరిస్థితి ప్రస్తుతం ఉంది. సేవా హృదయంతో, నిస్వార్థ భావంతో, త్యాగనిరతి తో ప్రజలకు సేవ చేస్తూ తమ వైద్యవృత్తిని దైవిక చర్యగా భావిస్తున్న నిజమైన జీవన దాతలు ఇప్పుడు కూడా ఉన్నారు. అలా ప్రాణ దాతలుగా, ధన్వంతరి వారసులుగా కొనసాగుతున్న డాక్టర్లలో మేలిమి ముత్యాల వంటి డాక్టర్లను గురించి , వారు చేస్తున్న సేవల గురించి , వారి జీవన ప్రస్థానాన్ని, వారి జీవన గమనాన్ని, వారిని నడిపిస్తున్న తాత్వికత గురించి తెల్సుకోవడం ఎంతో ఆసక్తి కరంగానే కాకుండా, ఉత్తేజ పూరితంగా, ప్రోత్సాహవంతంగా కూడా ఉంటుంది. అలాంటి సామాజిక ప్రయోజనాత్మక బాధ్యతను ప్రఖ్యాత కవయిత్రి, ‘అక్షరయాన్’ తెలుగు రచయిత్రుల వేదిక సంస్థాపకురాలు, తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళ పురస్కార స్వీకర్త శ్రీమతి అయినంపూడి శ్రీ లక్ష్మి గారు ఈ ‘డాక్టర్ ఫైల్స్ ‘ ద్వారా నిర్వర్తించారు.

ఇది డాక్టర్లకి అక్షర నీరాజనంగా భావించవచ్చు. ఇందులో 12 మంది డాక్టర్లు ఉన్నారు. ఒక్కొక్కరూ వైద్యరంగంలోని ఆయా శాఖలలో మాత్రమే కాకుండా సహృదయత, మానవతలలో కూడా శిఖరాలకు ఎదిగిన వారే కావడం విశేషం. మానవ దేహంలోని వివిధ రకాల రోగాలని, వ్యాధులని చికిత్స చేయడంలో వీరందరూ కేవలం వైద్యులుగా మాత్రమే కాకుండా, మానవీయ స్పర్శ తో సేవలు చేసే సౌజన్య మూర్తులుగా ఉండటం ఈ వ్యాస పరిచయ సంకలనం డాక్టర్ ఫైల్స్ ద్వారా వెల్లడపుతున్న సత్యం.
ఈ సంకలనం కేవలం ఆయా డాక్టర్ల జీవన ప్రస్థానాన్ని చెప్పడమే కాకుండా, వృత్తి ధర్మంలో, విధి నిర్వహణలో వారు ఎదుర్కొన్న సమస్యలను, సవాళ్లను, మరిచిపోలేని అనుభవాలను ఒక్క చోట క్రోడీకరించి చెప్పడం విశేషం! దీనివల్ల ఇతర డాక్టర్లకు ఈ గ్రంధం ఒక స్ఫూర్తినివ్వడమే గాక , సాధారణ ప్రజలకు, పాఠకులకు, ప్రేక్షకులకు వైద్య వృత్తిలో ఉన్న వారి పట్ల మరింత అభిమానాన్ని, గౌరవాన్ని పెంచుతుంది

అనడంలో ఎలాంటి సందేహం లేదు. వైద్యులు వాణిజ్య అంశాలకు కాకుండా, సౌజన్య విలువలను పాటించే మానవులుగా, సేవకులుగా ఉండటం వల్ల లోకం ఎంత చల్లగా ఉంటుందో, కుటుంబాలలో ఎన్ని వేనవేల చిరునవ్వులు విరబూస్తాయో, అనుబంధాలు ఎంతగా వెల్లివిరుస్తాయో ఈ వ్యాసాలు చదివితే మనకు తెలుస్తుంది. మరణం అంచుల దాకా వెళ్ళిన మనిషికి చికిత్స ద్వారా జీవితాన్ని కొనసాగించేలా చేయడం అనేది, ఆ మనిషికి మాత్రమే పరిమితం కాకుండా దాని ప్రయోజనాలు, ఫలాలు మొత్తం కుటుంబానికి లభిస్తాయని, భావించవచ్చు. అలా లక్షలాది కుటుంబాలకు ఆశాకిరణంగా నిలుస్తున్న డాక్టర్లు అందరికీ, అక్షరాల సుమహారాలుగా ఈ వ్యాసాలని భావిస్తూ ఈ నేల మీద నడుస్తున్న దేవదూతలుగా ఆ వైద్యులకు వినమ్రంగా నమస్కరిస్తున్నాను.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News