Friday, April 26, 2024

కరోనాతో ఇక సహజీవనమే

- Advertisement -
- Advertisement -

World Health Organization is concerned with Omicron cases

కేసుల సునామితో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన
వారంలో దేశంలోనూ విజృంభణ

జెనీవా : డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్ల కేసులు ఏకకాలంలో వ్యాపించి కరోనా కేసుల నునామీని సృష్టిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్యసంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ ఆందోళన వెలిబుచ్చారు. బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రికార్డు స్థాయిలో కేసులు పెరగడానికి డెల్టా, ఒమిక్రాన్ జంట ముప్పులే బాధితులు ఆస్పత్రుల పాలు కాడానికి, మృత్యువాత పడడానికి దోహదం చేస్తున్నాయని ఆయన అన్నారు. వేగంగా వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్‌తోపాటు అదే సమయంలో డెల్టా వేరియంట్ కూడా వ్యాపిస్తోందని ఈ రెండూ కలిసి కేసుల సునామీని సృష్టిస్తున్నాయని పేర్కొన్నారు. ధనిక దేశాలు బూస్టర్ డోసులు వినియోగిస్తుండడం , పేద దేశాలకు టీకాలు అందకుండా చేస్తున్నాయని హెచ్చరించారు. అన్ని దేశాలకు టీకాల పంపిణీలో సమానత సాధించేలా ధనిక దేశాలు చొరవ చూపించాలని ఆయన సూచించారు.

సగం కన్నా ఎక్కువ కేసులు ఐరోపా దేశాల్లోనే

ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ 19 కేసులు అంతకు ముందు వారంతో పోల్చుకుంటే గత వారం 11 శాతం వరకు రికార్డు స్థాయిలో పెరిగాయని ప్రపంచ ఆరోగ్యసంస్థ వెల్లడించింది. ముఖ్యంగా అమెరికాలో భారీ సంఖ్యలో కేసులు పెరిగాయని పేర్కొంది. గత అక్టోబర్ నుంచి ఈ పెరుగుదల కనిపిస్తోందని వివరించింది. మంగళవారం రాత్రి బాగా పొద్దుపోయాక విడుదలైన వారాంతపు సమీక్ష నివేదికలో డిసెంబర్ 2026 నుంచి ప్రపంచం మొత్తం మీద 4.99 మిలియన్ కొత్త కేసులు నమోదయ్యాయని డబ్లుహెచ్‌ఒ వెల్లడించింది. ఈ కేసుల్లో సగం కన్నా ఎక్కువ 2.84 మిలియన్ కేసులు ఐరోపా దేశాల నుంచే ఉన్నాయని, ఇది అంతకు ముందు వారం కన్నా 3 శాతమే ఎక్కువైనా ఇన్‌ఫెక్షన్ రేటు చాలా అధికంగా ఉందని, 1,00,000 మందికి 304.6 వంతున కొత్త కేసులు నమోదయ్యాయని వివరించింది.

అదే అమెరికాలో 1,00,000 మందికి 144.4 వంతున ఇన్‌ఫెక్షన్ రేటు కనిపిస్తోందని, దీంతో అమెరికాలో 39 శాతం వరకు అంటే 1.18 మిలియన్ కన్నా ఎక్కువగా కొత్త కేసులు పెరిగాయని తెలియచేసింది. దీంతోపాటు ఒమిక్రాన్ రిస్కు చాలా ఎక్కువగా ఉందని పేర్కొంది. దక్షిణాఫ్రికాలో మాత్రం ఇదివరకటి కన్నా కేసులు తగ్గాయని, బ్రిటన్, డెన్మార్క్ దేశాల్లో ఒమిక్రాన్‌తో ఆస్పత్రిలో చేరే పరిస్థితి తగ్గిందని వివరించింది. ఆక్సిజన్ వినియోగం, వెంటిలేషన్, మరణాలు, వాక్సినేషన్ ప్రభావం గురించి మరింత డేటా అందవలసి ఉందని తెలియచేసింది. గత వారం ప్రపంచ వ్యాప్తంగా కొత్తగా మరణాలు 4 శాతం వరకు అంటే 44,680 వరకు తగ్గాయని, పేర్కొంది.

భారత్‌లో కొన్ని రోజుల్లోనే ఉధృతం

భారత్‌లో మరికొన్ని రోజుల్లోనే కొవిడ్19 కేసులు ఉధృతస్థాయికి చేరుతాయని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పరిశోధకుల బృందం తెలిపింది. రోజువారీ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతాయని అంచనా వేసింది. ఈ వారంలోనే కేసుల సంఖ్య అధికమవుతుందని.. అయితే, సంఖ్యను కచ్చితంగా అంచనా వేయడం అంత సులభం కాదని జడ్జి బిజినెస్ స్కూల్ ప్రొఫెసర్ పాల్‌కట్టుమన్ తెలిపారు. ఈయన ఆధ్వర్యంలోనే భారత్‌లో కొవిడ్19 ప్రభావాన్ని అంచనా వేసే ట్రాకర్‌ను రూపొందించారు. డిసెంబర్ 24న 6 రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరగడాన్ని ఈ బృందం గుర్తు చేసింది. ఈ రాష్ట్రాల్లో కొత్త కేసుల పెరుగుదల రేట్ 5 శాతానికిపైగా నమోదైందని తెలిపింది. డిసెంబర్ 26వరకల్లా కేసుల పెరుగుదల 11 రాష్ట్రాల్లో నమోదైందన్నారు. అయితే, కేసుల ఉధృతి స్వల్పకాలమే ఉంటుందని కూడా వారు అంచనా వేశారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కట్టడి చర్యలను రాష్ట్రాలకు సూచించడం, వ్యాక్సినేషన్‌ను పెంచడంలాంటివాటిని పరిశోధక బృందాలు పరిగణనలోకి తీసుకుంటాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News