Saturday, April 27, 2024

మాజీ మంత్రి ఫరీదుద్దీన్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి కెసిఆర్ సంతాపం
నేడు స్వగ్రామంలో అంత్యక్రియలు

మన తెలంగాణ/ హైదరాబాద్, జహీరాబాద్ : మాజీ మంత్రి, టిఆర్‌ఎస్ పార్టీ నేత మొహమ్మద్ ఫరీదుద్దీన్(64) బుధవారం గుండెపోటుతో కన్నుమూశారు. అనారోగ్యానికి గురైన ఆయన హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారం కిందటనే కాలేయ శస్త్ర చికిత్స జరిగింది. ఈ క్రమంలో గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ఫరీదుద్దీన్ జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎంఎల్‌ఎగా ఎన్నికయ్యారు. ఉమ్మడి ఎపిలో 2004లోని కాంగ్రెస్ ప్రభుత్వంలోమైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా సేవలందించారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన.. సొంతగ్రామం హోతి (బి) గ్రామ సర్పంచ్‌గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1990లో జరిగిన ఆంధ్రపదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి జహీరాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎంఎల్‌ఎగా విజయం సాధించారు.

ఆయన 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి రెండవసారి ఎంఎల్‌ఎగా గెలిచి మైనారిటీ సంక్షేమ శాఖ, సహకార శాఖ మంత్రిగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వంలో పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఆయన టిఆర్‌ఎస్‌లో చేరారు. ఆ తర్వాత 2016లో టిఆర్‌ఎస్ తరపున ఎంఎల్‌ఎగా ఎన్నికయ్యారు. ఫరీదుద్దీన్ మృతిపై సిఎం కెసిఆర్ సంతాపం ప్రకటించారు. ఫరీదుద్దీన్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎఐజి ఆస్పత్రిలో ఫరీదుద్దీన్ పార్థివదేహానికి మంత్రులు మహమూద్ అలీ, హరీష్‌రావులు నివాళులర్పించారు. అనంతరం హైదరాబాద్‌లోని మసాబ్ ట్యాంక్‌లోని ఫరీదుద్దీన్ నివాసానికి వెళ్లి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

నేడు స్వగ్రామంలో అంత్యక్రియలు

మాజీ మంత్రి ఫరీదుద్దీన్ పార్థివదేహం గురువారం ఉదయం 10 గంటలకు జహీరాబాద్ పట్టణంలోని బాగారెడ్డి స్టేడియం వద్దకు చేరుకుంటుంది. అభిమానులు, కార్యకర్తల సందర్శనార్థం సాయంత్రం 3 గంటల తర్వాత జహీరాబాద్ ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనల అనంతరం 4 గంటలకు వారి స్వగ్రామం హోతిలోని వారి వ్యవసాయక్షేత్రం వద్ద అంత్యక్రియలు నిర్వహిస్తారు అని వారి కుటుంబసభ్యులు తెలియజేశారు.

మంత్రుల సంతాపం

మాజీ మంత్రి ఫరీదుద్దీన్ మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్‌రావు, ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్, షెడ్యూల్ కులాల అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాల శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మంత్రి జగదీష్‌రెడ్డి, సత్యవతి రాథోడ్ ఎంఎల్‌సిలు కల్వకుంట్ల కవిత, శేరి సుభాష్‌రెడ్డిలు సంతాపం వ్యక్తం చేశారు. మాజీ మంత్రిగాను, ఎంఎల్‌ఎగాను పనిచేసిన ఆయన ప్రజలలో మంచి పేరు తెచ్చుకున్నారని వివరించారు. మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా సేవలందించి మైనార్టీల సంక్షేమం కోసం కృషి చేశారని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నామని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News