Monday, April 29, 2024

థ్యాంక్యూ హరీశ్

- Advertisement -
- Advertisement -

Sekhar kammula thanked Minister Harish Rao

మీ సమయానుకూల స్పందన ఒక ప్రాణాన్ని కాపాడింది : ఫేస్‌బుక్‌లో ప్రముఖ దర్శకుడు
శేఖర్ కమ్మల అరుదైన క్రోహ్న్ వ్యాధితో బాధపడుతున్న వరంగల్‌కు చెందిన హర్షవర్థన్ వైద్యానికి
మంత్రి హరీశ్‌రావు భరోసా సిఎం సహయా నిధి నుంచి రూ.7లక్షలు అందజేత హర్షవర్దన్‌కు చికిత్స
అందిస్తున్న నిమ్స్ వైద్యులకు మంత్రి ధన్యవాదాలు సోషల్ మీడియా వేదికగా మంత్రికి ప్రశంసలు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. క్రోహ్న్ అనే అరుదైన ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న వరంగల్‌కు చెందిన హర్షవర్ధన్‌కు అవసరమైన చికిత్స అందిస్తామని మంత్రి హరీశ్‌రావు భరోసా ఇచ్చారని ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ట్విట్టర్, ఫేస్‌బుక్ వేదికగా వెల్లడించారు. గత మూడు సంవత్సరాలుగా అరుదైన వ్యాధితో బాధపడుతున్న హర్షవర్ధన్ కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేసి,నిస్సహాయంగా ఉండి చేయిదాటిపోయిన పరిస్థితుల్లో మంత్రి హరీశ్‌రావు రూపంలో భరోసా కనిపించిందని పేర్కొన్నారు. హర్షవర్ధన్‌కు వైద్య సహాయం కోసం ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు సంప్రదించగా, వెంటనే మంత్రి చొరవ తీసుకుని నిమ్స్‌లో అవసరమైన వైద్యం అందించేలా ఏర్పాటు చేశారని శేఖర్ కమ్ముల పేర్కొన్నారు.

ప్రస్తుతం హర్షవర్ధన్ ప్రస్తుతం క్షేమంగా ఉన్నారని తెలిపారు. మంత్రి హరీష్ రావు సమయానుకూలంగా, ఎంతో శ్రద్ధతో కూడిన స్పందన ఒక ప్రాణాన్ని కాపాడిందని పేర్కొన్నారు. మంత్రి స్పందన తమకు ఎంతో ఆశను కల్పించిందని అన్నారు. మంత్రి హరీశ్‌రావు స్పందించిన తీరు వ్యవస్థపై నమ్మకాన్ని కలిగించిందని వ్యాఖ్యానించారు. హరీశ్‌రావు ప్రజల మంత్రి అన్న విషయాన్ని నిజం చేశారని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావుకు దర్శకుడు శేఖర్ కమ్మల ధన్యవాదాలు తెలిపారు. హర్షవర్ధన్ ఆరోగ్య పరిస్థితిపై మంత్రి హరీశ్‌రావు నిమ్స్ వైద్యులతో ఫోన్ మాట్లాడి తెలుసుకున్నారు.ఆయన అవసరమైన వైద్య సహాయం అందించాలని మంత్రి వైద్యులకు తెలిపారు. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న హర్షవర్ధన్ తల్లిదండ్రులు మంత్రి హరీశ్‌రావును కలువగా, వారి పరిస్థితి తెలుసుకున్న మంత్రి ప్రత్యేకంగా చొరవ తీసుకుని హర్షవర్ధన్ చికిత్స నిమిత్తం సిఎం సహాయ నిధి నుంచి రూ.7 లక్షలు ఆర్థిక సాయం అందించారు. ప్రస్తుతం నిమ్స్‌లో హర్షవర్ధన్‌కు చికిత్స జరుగుతోంది.

నిమ్స్ వైద్యులకు ధన్యవాదాలు : ట్విట్టర్‌లో హరీశ్‌రావు

హర్షవర్ధన్ క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారని పేర్కొంటూ రాష్ట్ర వైద్యారోగ శాఖ మంత్రి హరీశ్‌రావు ట్విట్టర్ వేదికగా సంతోషం వ్యక్తం చేశారు. హర్షవర్ధన్‌కు వైద్య సేవలందిస్తున్న నిమ్స్ వైద్య బృందానికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు. సిఎం కెసిఆర్ నేతృత్వంలోని తమ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తుందని మంత్రి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న హర్షవర్ధన్‌కు నిమ్స్‌లో మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పందించిన తీరు పట్ల సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్మల ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో ఈ విషయాన్ని పోస్టు చేయగా, నెటిజన్లు మంత్రికి ధన్యవాదాలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు.“హరీశ్‌రావు.. మనిషి రూపంలో ఉన్న భగవంతుడు” అని, “గొప్ప మనసున్న మంత్రి” అని,“మంత్రి గొప్ప మానవత్వాన్ని చాటుకున్నారని”, “హరీశ్‌రావు తెలంగాణ పెద్దన్న” అని,“దటీజ్ హరీశ్‌రావు” అని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా మంత్రి హరీశ్‌రావుకు ప్రశంసలు కురిపించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News