Saturday, April 27, 2024

సరోగసీ ప్రెగ్నెన్సీపై ‘యశోద’.. (ట్రైలర్)

- Advertisement -
- Advertisement -

'Yashoda' Movie Trailer Out

సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా ‘యశోద’. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి హరి, హరీష్ దర్శకత్వం వహించారు. నవంబర్ 11న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. గురువారం సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ‘యశోద’ ట్రైలర్‌ను తెలుగులో విజయ్ దేవరకొండ, తమిళంలో సూర్య, హిందీలో వరుణ్ ధావన్, కన్నడలో రక్షిత్ శెట్టి, మలయాళంలో దుల్కర్ సల్మాన్ విడుదల చేశారు. ‘యశోద’ టీజర్‌లో సమంత గర్భవతి అని చూపించారు. ట్రైలర్‌లో డబ్బు కోసం గర్భాన్ని అద్దెకు ఇచ్చిన మహిళ అని స్పష్టం చేశారు. అంటే ‘యశోద’ది సరోగసీ ప్రెగ్నెన్సీ అన్నమాట! అక్కడితో కథ అయిపోలేదు. సరోగసీ కోసం తమ గర్భాన్ని అద్దెకు ఇచ్చిన మహిళలను ఒక్కచోట చేర్చడం… ఆ తర్వాత అక్కడ ఏదో జరుగుతుందనే ఆసక్తిని కలిగించారు. సరోగసీ కోసం తీసుకొచ్చిన మహిళలకు ఏం జరుగుతోంది? ప్రపంచం నలుమూలల నుంచి వస్తున్న 122 మంది సంపన్న మహిళలు పేర్లు బయటకు రావడానికి, సరోగసీ ప్రెగ్నెన్సీ ధరించిన మహిళలకు సంబంధం ఏమిటి? ప్లాన్ ప్రకారం ఎవరి హత్య జరిగింది? అని ప్రేక్షకులు ఆలోచించేలా ట్రైలర్ కట్ చేశారు. ’యశోద’లో ప్రేమ ఉంది.

’నీకు ఎప్పుడైనా రెండు గుండె చప్పుళ్లు వినిపించాయా? బిడ్డను కడుపులో మోస్తున్న తల్లికి మాత్రమే అది వినిపిస్తుంది’ అని సమంత చెప్పే మాటలో బిడ్డపై తల్లి ప్రేమ వినబడుతుంది. సమంతకు, డాక్టర్ రోల్ చేసిన ఉన్ని ముకుందన్ మధ్య లవ్ ట్రాక్ ఉందని హింట్ కూడా ఇచ్చారు. అంతే కాదు… ’యశోద’లో క్రైమ్ ఉంది, రాజకీయం ఉంది, అన్నిటి కంటే ముఖ్యంగా మహిళ చేసే పోరాటం ఉంది. న్యూ ఏజ్ కాన్సెప్ట్‌తో సినిమా రూపొందిందని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ’యశోద’ ట్రైలర్‌లో మణిశర్మ అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాలకు ప్రాణం పోసింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ “అన్ని భాషల ప్రేక్షకుల నుంచి థియేట్రికల్ ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. సమంత నటన, కాన్సెప్ట్, మణిశర్మ నేపథ్య సంగీతం గురించి అందరూ మాట్లాడుతున్నారు. ఇదొక సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌” అని అన్నారు.

‘Yashoda’ Movie Trailer Out

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News