Friday, April 26, 2024

నిరుద్యోగంలోకి యువత!

- Advertisement -
- Advertisement -

sampadakiyam telugu  అధిక శాతం జనాభా దారిద్య్రరేఖకు దిగువన, కిందిమధ్యతరగతి వర్గంగానూ ఉన్న భారతదేశంలో దాదాపు మూడు మాసాల పాటు పనులు, పాట్లు లేని లాక్‌డౌన్ వల్ల పేదరికం మరెంతగా పేరుకుపోయి వుంటుందో, ఇంకెంతమంది ఉద్యోగాలు కోల్పోయి నిరాధారులైపోయి ఉంటారో ఊహించడం కష్టం కాదు. అంతవరకు పొదుపు చేసుకున్న అరకొర విత్తం ఈ లాక్‌డౌన్ కాలంలో పూర్తిగా ఖర్చు అయిపోయి చేతిలో చిల్లిగవ్వ లేని దుస్థితి ఒకవైపు, పని స్థలాలు మూతపడిపోయి ఉద్యోగాలు నష్టపోయిన దుర్గతి మరోవైపు చుట్టుముట్టి బతుకు దుర్బరంగా మారినవారి గురించి తలచుకుంటే గుండె తరుక్కుపోతుంది. లాక్‌డౌన్ వల్ల దేశంలో 6 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారని జాతీయ ఆర్థిక పర్యవేక్షణ కేంద్రం (సిఎంఐఇ) తాజా సర్వేలో తేలిన కఠోర వాస్తవం కంటతడిపెట్టించక మానదు.

మరీ ముఖ్యంగా అప్పుడే కొత్తగా కొలువుల్లో చేరిన 2029 సంవత్సరాల వయసులోని 2.7కోట్ల మంది యువత ఒక్క ఏప్రిల్ నెలలోనే నిరుద్యోగులు అయిపోవడం హృదయవిదారకమైన పరిణామం. లాక్‌డౌన్‌కు ముందు దేశంలో 8.8శాతంగా ఉన్న నిరుద్యోగం అమాంతం 15శాతం పెరిగిపోయి ఇప్పుడు 23.8శాతానికి చేరడం గమనించవలసిన విషాదకర పరిణామం. లాక్‌డౌన్ వల్ల దాపురించిన నిరుద్యోగం సగటున గ్రామాల్లో (22.8%) ఒకింత తక్కువగాను, పట్టణాల్లో (28%) ఎక్కువగాను నమోదైనట్టు సిఎంఐఇ సర్వే స్పష్టం చేసింది. గ్రామాల్లో జీవన వ్యయభారం పరిమితం కావడం, ఉపాధి హామీ వంటి పథకాల ద్వారా అంతోఇంతో పనులు లభించడం వంటి కారణాలు అక్కడ నిరుద్యోగం పెరుగుదల రేటు తక్కువ ఉండడానికి కారణాలై ఉండాలి. నికరాదాయ ఉద్యోగాలు కోల్పోయిన కుటుంబాలకు ఆకస్మాత్తుగా ఎదురయ్యే కష్టనష్టాలు అనేకం. ఇంటి అద్దె, నెలవారీ వాయిదాలు వంటివి చెల్లించలేకపోవడం వల్ల వారు చెప్పనలవి కాని అవమానకర పరిస్థితి ఎదుర్కొంటారు.

కిస్తు చెల్లింపు షరతుపై కొనుక్కున్న వస్తువులు ఉన్న పళంగా జప్తుకు గురికావడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఉన్నట్టుండి పరపతి పతనం అయిపోయి కొత్తగా అప్పు దొరకని గడ్డు పరిస్థితి ఎదురవుతుంది. గత ఏప్రిల్ నెలలో చిన్న వ్యాపారులు, దిన కూలీలు 9 కోట్ల ఉద్యోగాలు కోల్పోయారని సర్వే తేల్చి చెప్పింది. నెలవారీ జీతాలు అందుకుంటూ వచ్చిన ఉద్యోగులు అసంఖ్యాకంగా నిరుద్యోగులయ్యారు. లాక్‌డౌన్ వల్ల ఆదాయాలు తీవ్రంగా నష్టపోయిన చిన్న వ్యాపారులు, శ్రమజీవులు తిరిగి ఎంతో కొంత పుంజుకునే అవకాశం ఉంది. కానీ, ఉద్యోగాలు కోల్పోయిన వారికి వెంటనే అవి మళ్లీ లభించడం కష్టం. ఆదాయాలు, ఉపాధులు కోల్పోయిన వారిలో మూడొంతుల మంది చిన్న వ్యాపారులు, రోజువారీ కూలీలేనని సర్వే స్పష్టం చేసింది. వీరిలో అత్యధిక శాతం తమిళనాడులో ఉన్నట్టు తేలింది.

గత ఆర్థిక సంవత్సరంలో దేశంలో 40 కోట్ల 40లక్షల మంది ఉద్యోగులుండగా, ఈ ఏడాది మార్చికి వారి సంఖ్య 39 కోట్ల 60లక్షలకు పడిపోయింది. ఏప్రిల్‌లో అది 28 కోట్ల 20లక్షలకు దిగజారిపోయింది. లాక్‌డౌన్ కాలంలో 2-024 సంవత్సరాల వయసులోని కోటి 30లక్షల మంది యువత ఉద్యోగాలు కోల్పోయారని, అలాగే 2529 సంవత్సరాల వయసులోని కోటి 40లక్షల మంది నిరుద్యోగులయ్యారని సిఎంఐఇ సర్వే వెల్లడించింది. ఉద్యోగాలు కోల్పోయిన వారిలో 86శాతం మంది పురుషులు. వాస్తవానికి దేశంలోని పనిచేసే వయసులోని వారంతా ఉద్యోగాలు చేయడం లేదు. 15 ఏళ్ల పైబడిన వారిలో సగం మంది పనిపాటు లేకుండా ఉన్నారని నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీసు (ఎన్‌ఎస్‌ఎస్‌ఒ) ఉద్యోగాలపై జరిపిన సర్వే వెల్లడి చేసింది.

2017-18లో దేశంలో నమోదైన నిరుద్యోగ పెరుగుదల రేటు గత 45 ఏళ్లలో ఎన్నాడూ లేనంత ఎక్కువని మరో సర్వే వెల్లడించింది. 201112, 20172018 మధ్య ఉద్యోగాలు, ఉపాధి కార్యక్రమాలలోని మహిళల సంఖ్య బాగా తగ్గిపోయిందని వెల్లడైంది. 201112లో పనిపాట్లలోని మహిళలు 23.3శాతంగా నమోదు కాగా, 201718 నాటికి వారి సంఖ్య 8శాతం తగ్గిపోయింది. దేశంలోని మొత్తం మహిళల్లో నాల్గో వంతు మాత్రమే ఉద్యోగస్తులుగానో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నవారిగానో ఉన్నారని తేలింది.

దేశంలో గల సంప్రదాయ పరిస్థితులు చదువుకున్న మహిళ కూడా ఉద్యోగం చేయలేని వాతావరణాన్ని కొనసాగిస్తున్నాయి. ఉద్యోగాలు కరువై శ్రమకు తగిన ప్రతిఫలం లేక చాలామంది పురుషులు కూడా నిరుద్యోగులుగాను, చిరుద్యోగులుగాను బతుకులు గడుపుతున్నారు. ఈ దుస్థితికి కరోనా లాక్‌డౌన్ రూపంలో విరుచుకుపడిన అదనపు నిరుద్యోగం అగ్గికి ఆజ్యంలా తోడైంది. ఈ నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యూహకర్తలు పనిచేసే వయసులోని యువతకు చేతి నిండా పని కల్పించడానికి, ఆధునిక పరిశ్రమల్లో ఉద్యోగాలు పొందగల విద్య, నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి తగిన ప్రణాళికలు తక్షణమే రూపొందించి అమల్లో పెట్టాలి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News