Wednesday, May 1, 2024

108 ఉద్యోగులు మానవత్వంతో పనిచేస్తున్నారు

- Advertisement -
- Advertisement -

108 Employees are working with Humanity

 

త్వరలో అన్ని సమస్యలను పరిష్కరిస్తా
ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడి

మన తెలంగాణ/హైదరాబాద్ : వైద్యశాఖలోని 108 ఉద్యోగులు జీతం కోసం కాకుండా మానవత్వంతో ప్రాణాలు నిలబెట్టేవారని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రశంసించారు. అత్యవసర సమయంలో పనిచేస్తూ ప్రజల ప్రాణాలను కాపాడుతున్నారన్నారు. పైసలు కోసం కాకుండా ప్రజలు ప్రాణాలు కాపాడేందుకు ఎంతో శ్రవిస్తున్నారన్నారు. టిఆర్‌ఎస్ భవన్‌లో ఆదివారం జరిగిన తెలంగాణ 108 ఉద్యోగుల సంఘం రెండవ మహసభకు ఆయన ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ..కరోనా సమయంలో 108 ఉద్యోగులు ప్రాణాలు పణంగా పెట్టి పనిచేశారన్నారు. వైద్యారోగ్యశాఖలో వీరు అత్యంత కీలకమన్నారు. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో అనేక మందిని బ్రతికించారన్నారు. 108 ఉద్యోగులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం ఆనందంగా ఉంటుందని మంత్రి అభిప్రాయపడ్డారు. 12 గంటల పని విధానం, ఈఎస్‌ఐ, ఫిఎఫ్ లాంటి సమస్యలను అతి త్వరలోనే తీరుస్తానని మంత్రి హామీ ఇచ్చారు.

తెలంగాణ వచ్చిన తర్వాత కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు అనే తేడా లేకుండా అందరిని పర్మినెంట్ చేయాలని ప్రభుత్వం భావించిందని, కానీ చాలా మంది కేసులు వేసి దాన్ని అడ్డుకున్నారని మంత్రి తెలిపారు. అయినప్పటికీ రెండున్నర లక్షల మందికి జీతాలు పెంచుకొని కనీస వేతనం అందేలా చూస్తున్నామన్నారు. ఏ సమయంలో ఫోన్ వచ్చినా పరిగెత్తే జాబ్ 108 ఉద్యోగమన్నారు. మానవత్వం, ప్రజలు ప్రాణాలు కాపాడాలని అనే భావన ఉన్న మాత్రమే వైద్యారోగ్యశాఖలో పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ శాఖలో పనిచేసేవారు సేవ చేయాలని గొప్ప అంకిత భావంను కలిగి ఉండాలన్నారు. ఆరోగ్యశాఖ మీద ఆధారపడే పేదవారికి మెరుగైన వైద్యసేవలందించేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలన్నారు.

ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం…

రాబోయే రోజుల్లో ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలను సమకూర్చనున్నట్లు మంత్రి ఈటల వెల్లడించారు. ప్రజలు ప్రైవేట్‌కు వెళ్లకుండ అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఈక్రమంలోనే సిఎం సూచన మేరకు ఇటీవల మంత్రి వర్గ ఉపసంఘం భేటీ అయినట్లు మంత్రి గుర్తుచేశారు. అమ్మ ఒడి, కళ్యాణ లక్ష్మీ, కెసిఆర్ కిట్, మిషన్ భగీరథ, కంటివెలుగు లాంటి పథకాలు ప్రభుత్వ వైద్యం మీద ప్రజలకు నమ్మకాన్ని కలిగించడమే కాకుండా దేశంలో తెలంగాణకు మంచి గుర్తింపునిచ్చాయన్నారు. మాటలు చెప్తేనో, డబ్బులు ఇస్తేనో అవార్డ్ రావని, ఒళ్లు వంచి కష్టపడి పనిచేస్తేనే వస్తాయని మంత్రి గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం అతి తక్కువ కాలంలో ఎక్కువ ఫలితాలను సాధించిందన్నారు.

అయితే వైద్యారోగ్యశాఖను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఆరోగ్య తెలంగాణ లేకుండా బంగారు తెలంగాణ సాధ్యం కాదని ఇప్పటికే సిఎం పలుమార్లు సూచించినట్లు మంత్రి చెప్పారు. సిఎం ముందు చూపుతో ఇప్పటికే తెలంగాణ పచ్చని చీర కట్టగా, ఇక నుంచి ఆరోగ్య తెలంగాణ లక్షంగా పనిచేస్తామని మంత్రి అన్నారు. ప్రతి సంఘం వారి హక్కుల కోసం ఏర్పడుతోందని,ప్రభుత్వం కచ్చితంగా వాటిని గుర్తిస్తుందని మంత్రి పేర్కొన్నారు. కానీ అత్యవసర సేవల్లో మెడమీద కత్తి పెట్టినట్లు వ్యవహరించవద్దని మంత్రి ఈటల 108 ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News