Saturday, April 27, 2024

ఇద్దరు నక్సల్స్‌ను కొట్టి చంపిన సొంత దళం

- Advertisement -
- Advertisement -

2 Maoists killed in Chhattisgarh's Dantewada

రాయ్‌పూర్ : ఇద్దరు నక్సలైట్లను తోటి నక్సలైట్లు తీవ్రంగా కొట్టి, గొంతుకోసి చంపేశారు. ఈ సంఘటన చత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాలో జరిగిందని పోలీసులు గురువారం తెలిపారు. దాడికి గురయిన నక్సలైట్లను రక్షించబోయిన గ్రామస్తులను కూడా నక్సలైట్లు కొట్టారు. దీనితో ముగ్గురు గ్రామస్తులు గాయపడ్డారు. బుధవారం రాత్రి చాలా పొద్దుపోయిన తర్వాత అరన్పూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని పోటాలి గ్రామంలో జరిగింది. ఈ ఘటన గురించి దంతేవాడ జిల్లా పోలీసు అధికారి అభిషేక్ పల్లవ వార్తాసంస్థలకు వివరించారు. ఈ ప్రాంతంలో ఇటీవలి కాలంలో అధికారులు అభివృద్ధి పనులు చేపడుతూ ఉండటం, దీనికి గ్రామస్తులు సహకరించడంతో నక్సలైట్లు తమ ఉనికికి ఇబ్బంది ఏర్పడుతుందని స్థానికులపై దాడులకు దిగుతున్నారు.

ఇదే క్రమంలో అరన్‌పూర్ నుంచి పొటాలి వరకూ రాదారి నిర్మాణ పనులు చేపట్టడంపై మావోయిస్టులు ఆగ్రహంతో ఉన్నారని ఎస్‌పి తెలిపారు. పొటాలి గ్రామంలో బుధవారం రాత్రి ఇద్దరు నక్సల్స్ దళనేతలు గ్రామసభ ఏర్పాటు చేశారు. రోడ్డు ఎందుకు వేయనిచ్చారని, వేసిన రోడ్డును ధ్వంసం చేయాలని తాము చెప్పినా ఎందుకు ఊరుకున్నారని గ్రామస్తులను నిలదీశారు. ఈ దశలో ఈ గ్రామానికే చెందిన ఇద్దరు నక్సలైట్లు బజ్‌రంగ్ వెట్టి, టిడో మండవీలను వెంటనే రోడ్డును ధ్వంసం చేయాలని దళ నేతలు ఆదేశించారు. అయితే వారు ఈ రోడ్డుతో తమ గ్రామానికి మంచి జరిగిందని, వారికి రవాణా సౌకర్యం ఏర్పడిందని వారు తెలిపారు. రోడ్డును తవ్విపారేసే ప్రసక్తే లేదన్నారు. ఎవరైనా జబ్బున పడితే ఆసుపత్రులకు తీసుకువెళ్లేందుకు ఈ దారి ఉపయోగపడుతోందని తెలిపారు.

అయితే తాము ఇచ్చిన ఆదేశాలను పాటించలేదనే కోసం ఇతర నక్సలైట్లు వీరిపై పడి తీవ్రంగా కొట్టారు. తరువాత కత్తితో గొంతులు కోశారని, దీనితో వారు ప్రాణాలు వదిలారని ఎస్‌పి పల్లవ తెలిపారు. తమ ఊరికి చెందిన ఈ మావోయిస్టులను రక్షించేందుకు మధ్యలోకి వెళ్లిన గ్రామస్తులు కూడా నక్సల్స్ దాడిలో గాయపడ్డారు. ఘటన తరువాత మావోయిస్టు దళ నేతలు తమ దళంతో పాటు సమీప అడవులలోకి పారిపొయ్యారని , వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపడుతున్నామని పోలీసు అధికారి తెలిపారు. దంతేవాడ జిల్లాలో ఇటీవలి కాలంలో ఇతర చోట్ల కూడా అధికార యంత్రాంగం గ్రామాలకు వెళ్లుతూ స్థానికులతో ప్రగతి పనులపై సమీక్ష జరపడం, దీనిని తెలుసుకున్న తరువాత నక్సల్స్ వచ్చి అధికారులకు ఎందుకు సహకరిస్తున్నారని దాడులకు దిగడం జరుగుతోందని, ఈ మధ్యనే నక్సల్స్ దాడిలో జిల్లాలో ఓ గ్రామంలో స్థానికులు గాయపడ్డారని ఎస్‌పి తెలిపారు.

2 Maoists killed in Chhattisgarh’s Dantewada

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News