Friday, May 10, 2024

ఐటి శాఖకు 200 ఫిర్యాదులు

- Advertisement -
- Advertisement -

‘ఫ్యాక్ట్ చెక్ వెబ్‌సైట్’ ప్రారంభించినా ఆగని తప్పుడు ప్రచారాలు
నిందితులను గుర్తించే పనిలో ప్రభుత్వం


మనతెలంగాణ/హైదరాబాద్: సోషల్‌మీడియా వేదికగా కరోనా వైరస్ గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఐటి శాఖకు 200 ఫిర్యాదులు అందాయి. ఈనేపథ్యంలో ఇప్పటికే 25 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మరికొంత మందిని గుర్తించడంతో పాటు వారిపై చర్యలు తీసుకోవాలని ఐటి శాఖ పోలీసులకు విజ్ఞప్తి చేసినట్టుగా తెలిసింది. కరోనా వైరస్‌పై వస్తున్న అసత్య ప్రచారాలు, తప్పుడు కథనాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ‘ఫ్యాక్ట్ చెక్ వెబ్‌సైట్’ను ప్రారంభించిన విషయం తెలిసిందే. కరోనాపై ఏదైనా అంశాన్ని వాట్సప్, సోషల్‌మీడియాలో షేర్ చేసే ముందు ‘ఫ్యాక్ట్ చెక్ వెబ్‌సైట్’ (https://factcheck.telangana.gov.in )లో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలని గతంలో ప్రభుత్వం సూచించింది. అయినా కొందరు కావాలనే సోషల్ మీడియా వేదికగా తప్పుడు వార్తలను షేర్ చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తుండడంతో వారిపై ప్రభుత్వం కేసులు నమోదు చేస్తోంది.

తప్పుడు వార్తలపై వారం రోజులుగా దాదాపు 200 ఫిర్యాదులు అందాయని, తప్పుడు సమాచారం చేరవేస్తున్న 25 మందిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసినట్లు ఐటి శాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు కనిపిస్తున్నాయి. పాత వీడియోలు, ఫొటోలను తమకు అనుకూలంగా ఎడిట్ చేసి, ప్రస్తుతం ఉన్న అంశా లను కొందరు జోడించి సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇవి నిజమని కొంతమంది ప్రజలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనాపై వస్తున్న తప్పుడు సమాచారం తప్పా ? కాదా ? అనేది విశ్లేషించడానికి తగిన ఏర్పాట్లు చేయాలని సుప్రీంకోర్టు ఇటీవలే ఆదేశించింది.

ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం 2005 డిజాస్టర్ మేనేజ్ మెంట్ చట్టంతో పాటు 1897 నాటి ఎపిడెమిక్ డిసిజెస్ చట్టానికి అనుబంధంగా తెలంగాణలో జరిగిన ఎపిడెమిక్ డిసీజెస్ (కొవిడ్- 19) చట్ట సవరణలను అనుసరించి, నిజానిజాలు తెలుసుకోకుండా, ధ్రువీకరించబడని వార్తలను సర్క్యు లేట్ చేయడం చట్టరీత్యా నేరమని ప్రభుత్వం సూచిస్తోంది. అందులో భాగంగానే తప్పుడు వార్తలతో ప్రజల్లో ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో వీటికి అడ్డుకట్ట వేయాలని రాష్ట్ర ప్రభుత్వం (https://factcheck.telangana.gov.in ) ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఈ వెబ్ సైట్ ను అందుబాటులోకి తెచ్చి ఫేక్ న్యూస్, తప్పుడు సమాచారం చేస్తున్న వారిని కట్టడి చేయడానికి తనవంతు కృషి చేస్తోంది.

 

200 complaints to IT for Social Media
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News