Wednesday, May 1, 2024

ఎపిలో కరోనా ఉధృతి: 20వేల కేసులు.. 82మంది మృతి

- Advertisement -
- Advertisement -

ఎపిలో 20వేల కరోనా కేసులు.. 82మంది మృతి
నేటి నుంచి పాక్షిక కర్ఫూ అమలు

మనతెలంగాణ/హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 20,034 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 82 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎపిలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్యకు 11,81,133 పెరిగింది. మరణాలు 8,289కి చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నాడు లక్షకుపైగా శాంపిళ్లను పరీక్షించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాష్ట్రంలో కరోనా అంతకంతకు విస్తరిస్తుండటంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది.ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ మహమ్మారి విజృంభన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని జూలాజికల్ పార్కులను బంద్ చేస్తున్నట్లు అటవీశాఖ ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు వెలువరించింది. జూ పార్కులతో పాటు, ఎకో టూరిజం సెంటర్లు, టెంపుల్ ఎకో పార్కులను కూడా మూసివేస్తున్నట్లు తెలిపింది. జంతువుల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించింది.
కర్ఫ్యూ నేపథ్యంలో ఆంక్షలు:
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతుండడంతో బుధవారం నుంచి రెండు వారాల పాటు విధించిన కర్ఫూ నేపథ్యంలో ప్రజారవాణా పై ఆంక్షలు విధించారు. రాకపోకల నియంత్రణకు బుధవారం నుంచి పాక్షిక కర్ఫ్యూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కర్ఫ్యూలో భాగంగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే షాపులు తెరిచేందుకు అనుమతిస్తామని ప్రకటించింది. దీంతో పాటు ప్రజా రవాణాపైనా ఆంక్షలు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే ప్రజా రవాణాను కూడా అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం నుంచి మొదలయ్యే ఈ ఆంక్షలు రెండు వారాల పాటు కొనసాగుతాయని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత రోడ్లపైకి వచ్చే ఆటోలను సీజ్ చేయాలని అధికారులు ఆదేశాలిచ్చారు. వీటితో పాటు సిటీ బస్సుల రాకపోకలను కూడా నియంత్రించేందుకు వీలుగా ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి. నిర్ణీత సమయాలను మించి రాకపోకల్ని నియంత్రించడం ద్వారా కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

20034 New Corona Cases Reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News