Saturday, April 27, 2024

ఒకే రోజు విదేశీ విరాళాల లైసెన్సు కోల్పోయిన 6 వేల ఎన్జీవోలు

- Advertisement -
- Advertisement -

6,000 NGOs who lost their foreign donation licenses in single day

 

న్యూఢిల్లీ : విదేశీ నిధులపై ఆధారపడే ఎన్జీవోల్లో దాదాపు 6 వేల ఎన్జీవోలు ఒకే రోజు విదేశీ విరాళాల లైసెన్సులను కోల్పోయాయి. ఏ ఎన్జీవో సంస్థ అయినా ఇతర దేశాలకు చెందిన వ్యక్తులు లేదా సంస్థల నుంచి విరాళాలు తీసుకోవాలంటే విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సిఆర్‌ఎ) కింద లైసెన్సు తీసుకోవాలి. ప్రస్తుతమున్న లైసెన్సు గడువు డిసెంబరు 31తో ముగిసింది. లైసెన్సు పునరుద్ధరణ కోసం ఆయా సంస్థలు కేంద్ర హోంశాఖకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని ఎన్జీవోలు దీనికోసం దరఖాస్తు పెట్టుకోగా , మరికొన్ని కారణాల వల్ల వాటిని అధికారులు తిరస్కరించారు. ఇక మరికొన్ని సంస్థలు గడువు ముగిసినా లైసెన్సు పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకోలేదు. ఈ విధంగా మొత్తం 5933 ఎన్జీవోలు శనివారం నాటికి విదేశీ విరాళాల లైసెన్సులను కోల్పోయినట్టు హోంశాఖ అధికారులు వెల్లడించారు. దేశంలో శనివారం నాటికి 22,762 ఎఫ్‌సిఆర్‌ఎ నమోదిత ఎన్జీవోలు ఉండగా, నేడు ఆ సంఖ్య16,829 కి తగ్గినట్టు పేర్కొంది.

లైసెన్సులను కోల్పోయిన వాటిల్లో ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్, లాల్ బహదూర్ శాస్త్రి మెమోరియల్ ఫౌండేషన్, ఆక్స్‌ఫామ్ ఇండియా, భారతీయ సంస్కృతి పరిషద్ , డీఎవీ కాలేజి ట్రస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ సొసైటీ, ట్యూబర్‌క్యులోసిస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఇండియా ఇస్లామిక్ కల్చరల్ సెంటర్‌లతోపాటు ఐఐటీ ఢిల్లీ, జమియా మిలియా ఇస్లామియా, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ , నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ, దేశం మొత్తం మీద 12 ఆస్పత్రులను నిర్వహిస్తున్న ఇమాన్యుయల్ హాస్పిటల్ అసోసియేషన్, విశ్వధర్మయత్న్, మహర్షి ఆయుర్వేద ప్రతిష్ఠాన్, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిషర్‌మెన్స్ కో ఆపరేటివ్స్, హమ్‌డార్డ్ ఎడ్యుకేషన్ సొసైటీ, గోడ్రేజ్ మెమోరియల్ ట్రస్ట్ , జెఎన్‌యు న్యూక్లియర్ సొసైటీ, లేడీ శ్రీరామ్ కాలేజీ, ఇండియా హేబిటేట్ సెంటర్ ఆల్ ఇండియా మార్వారీ యువ మార్చ్ వంటి ప్రముఖ ఎన్జీవొలు కూడా ఉన్నాయి. వీటిలో కొన్ని లైసెన్సు పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకోక పోగా, మరికొన్ని సంస్థలు చేసిన దరఖాస్తులను కేంద్ర హోం శాఖ తిరస్కరించిందని, అధికారులు శనివారం వెల్లడించారు. ఇటీవల మదర్ ధెరిస్సాకు మిషనరీస్ ఆఫ్ చారిటీస్ సంస్థ… బ్యాంకు ఖాతాలను కేంద్రం స్థంభింప చేసిందంటూ వచ్చిన వార్తలు పెద్ద ఎత్తున చర్చకు, రాజకీయ విమర్శలకు దారి తీసిన విషయం తెలిసిందే. అయితే ఆ సంస్థ ఖాతాలను స్తంభింప చేయలేదని, ఎఫ్‌సిఆర్‌ఎ లైసెన్సు పునరుద్ధరణ కోసం చేసుకున్న దరఖాస్తును మాత్రం తిరస్కరించామని కేంద్రం వివరించింది. సంస్థకు సంబంధించి కొంత ప్రతికూల సమాచారాన్ని గుర్తించినందువల్లే ఈ చర్య తీసుకున్నట్టు పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News