Monday, April 29, 2024

శ్రీశైలం పవర్‌ప్లాంట్‌లో మంటలు.. 9మంది మృతి

- Advertisement -
- Advertisement -

శ్రీశైలం పవర్‌ప్లాంట్‌లో మంటలు

ప్రాణాలతో బయటపడ్డ 22 మంది ఉద్యోగులు

 పవర్ ప్యానల్‌లో చెలరేగిన మంటలు
 దట్టంగా కమ్ముకున్న పొగలు, క్షణాల్లో విద్యుత్ కేంద్రం అంతటా వ్యాప్తి
 మృతుల్లో డిఇ, నలుగురు ఎఇలు, ఇద్దరు ప్లాంట్ అటెండెంట్‌లు, మరో ఇద్దరు అమరన్ కంపెనీ సిబ్బంది
 మంటలను ఆర్పేందుకు తొలుత సిబ్బంది విశ్వప్రయత్నం, అదుపులోకి రాకపోవడంతో ప్రాణాలు కాపాడుకు
 నేందుకు ఉరుకులు, పరుగులు, ఊపిరాడక ప్రాణాలు వదిలిన విషాదం
 హుటాహుటిన ఘటనా స్థలికి మంత్రి జగదీశ్ రెడ్డి, జెన్‌కో సిఎండి ప్రభాకర్‌రావు
 సహాయక చర్యల పర్యవేక్షణ
 ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పలువురికి పరామర్శ

మన తెలంగాణ/నాగర్‌కర్నూల్/హైదరాబాద్ ప్రతినిధి: శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గురువారం రాత్రి జరిగిన సంఘటనలో 9 మంది మృతి చెందగా 22 మంది ప్రాణాలతో బయటపడ్డారు. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం పాతాళగంగ వద్ద ఉన్న తెలంగాణ రాష్ట్ర శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులో గురువారం రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో ప్యానెల్ బోర్డులలో ఏర్పడిన సాంకేతిక కారణంతో షార్ట్ సర్యూట్ చోటు చేసుకుంది. మంటలు క్రమంగా ట్రాన్స్‌ఫార్మర్ రియాక్టర్‌లకు వ్యాపించాయి. దీంతో టన్నెల్‌లో మంటలతో పాటు పొగ కమ్ముకుంది. డ్యూటీలో ఉన్న 31 మందిలో 22 మంది అధికారులు ప్రాణాలతో బయటపడగా మరో 9 మంది పొగ కమ్ముకోవడంలో బయటకి రాలేక ప్రాణాలు కోల్పోయారు. వీరిని శుక్ర వారం ఉదయం నుంచి కాపాడడానికి అగ్నిమాపక ఎన్‌డిఆర్‌ఎఫ్, సిఐఎస్‌ఎఫ్‌లకు చెందిన రెస్కూ టీం శ్రమించి ఒకొక్కటిగా మృతదేహాలను వెలికి తీశారు. మృతదేహాల వెలికితీతలో సాయంత్రం 6 గంటల వరకు కొన సాగింది. మృతుల్లో డిఈ శ్రీనివాస్ గౌడ్ (హైదరాబాద్), ఏఈ వెంకట్ రావు (పాల్వం చ), ఎఈ మోహన్‌కుమార్ (హైదరాబాద్), ఏఈ ఉజ్మ ఫాతిమా (హైదరా బాద్), ఏఈ సుందర్ (సూర్యాపేట), ప్లాంట్ అటెండర్ రాంబాబు (ఖమ్మం), జూనియర్ ప్లాంట్ అటెండెంట్ కిరణ్ (పాల్వంచ), హైదరాబాద్‌కు చెందిన అమరన్‌బ్యాటరీ కంపెని సిబ్బంది వినేష్ కుమార్, మహేష్‌కుమార్‌లు ఉన్నారు. ఈ ఘటనతో కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. సంఘటన సమయంలో భారీగా పేలుడు శబ్దాలు వచ్చాయి. పవర్‌హౌస్ మొత్తం మంటల తో పొగతో నిండిపోయింది. రాత్రి 10:30 గంటల సమయంలో ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో 6 జనరేటర్లు ఉన్నాయి. ఒకొక్కటి 150 మెగా వాట్ల సామార్థం కలిగిన యూనిట్లు మొత్తం రన్నింగ్‌లో ఉన్నాయి. ప్రమాద శాత్తు మొదటిగా నాలుగో యూనిట్ ప్యానల్ బోర్టులో షార్ట్ సర్కూట్ అయి భారీగా మంటలు చెలరేగాయి.

పవర్ హౌస్ మొత్తం పొగతో నిండుకు పోవడంతో డ్యూటీలో ఉన్న ఇంజనీర్లు, కింది సిబ్బంది భయాందోళనకు గురై లోపటి నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు ఉరుకులు పరుగులు పెట్టి కొందరు ప్రాణాలు కాపాడుకోగా మరో కొందరు ఇంజనీయర్లు కిందిస్థాయి సిబ్బంది 9 మంది లోపలనే చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి నాగర్‌కర్నూల్ కలెక్టర్, ఎస్‌పి, ఎమ్మెల్యేలు సంఘటన స్థలానికి చేరుకొని జరిగిన ప్రమాదానికి గల కారణాలు లోపల ఎంత మంది చిక్కుకున్నారు. ఎంత మంది బయటకు వచ్చారనే విషయాలను ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. లోపల ఇరుక్కుపోయిన ఇంజనీర్లను సిబ్బందిని కాపాడేందుకు ప్రత్యేక బృందాలతో ప్రయాత్నాలు కొనసాగాయి. లోపల 9 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించిన వారి పరిస్థితి ఆందోళన కరంగా ఉన్నట్లు కొందరు ఇంజనీర్ల సమాచారం లోపల ఉన్న సిబ్బంది ఇంజనీర్లను కాపాడే ప్రయత్నం చేసినా భారీ ప్రమాదం తొమ్మిది మందిని పొట్టన పెట్టుకుంది. ఇదిలా ఉండగా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విధులు నిర్వహించాల్సిన ఒక బృందం టెక్నికల్ కారణాల వల్ల రాత్రి పదిన్నర గంటల వరకు భూగర్భ పవర్ హౌస్‌లో ఉండాల్సి వచ్చింది ఇదే క్రమంలో హైదరాబాద్‌కు చెందిన అమెరాన్ బ్యాటరీ కంపెనీకి చెందిన సిబ్బంది వినయ్‌కుమార్, మహేష్‌కుమార్‌లు బ్యాటరీ బిగించే క్రమంలో వారు సైతం ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయారు.


సిఐఎస్‌ఎఫ్ కమాండెంట్ సిద్ధార్థ రెహ ఆధ్వర్యంలో
సిఐఎస్‌ఎఫ్ కమాండెంట్ సిద్ధార్థ రెహ ఆధ్వర్యంలో శుక్రవారం తెల్లవారుజాము నుంచే రెస్యూ ఆపరేషన్‌ను మొదలుపెట్టాయి. అధునాతన పరికరాలతో పవర్‌హౌస్‌లోకి వెళ్లిన 35 మంది సిఐఎస్‌ఎఫ్ సభ్యుల బృందం సహాయక చర్యలను చేపట్టింది. అదనపు డిజి సివి ఆనంద్ ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించగా, రాష్ట్ర డిజిపి విజ్ఞప్తి మేరకు సిఐఎస్‌ఎఫ్ ప్రత్యేక బృందాన్ని శ్రీశైలానికి పంపింది.
తొలుత సుందర్ మృతదేహం….
దట్టమైన పొగవల్ల 9 మంది ఉద్యోగులు మరణించారని జెన్‌కో అధికారులు ప్రకటించారు. ముందుగా సుందర్ మృతదేహాన్ని శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు, వెనువెంటనే మరో ఐదు మృతదేహాలను రెస్యూ టీంలు గుర్తించాయి. సాయంత్రానికి మిగిలిన మూడు మృతదేహాలను మూడోప్లోర్‌లో రెస్యూ టీం గుర్తించింది. మృతుల కుటుంబసభ్యులు తమ వారిని కడసారి చూసుకోవడానికి సుమారుగా 18 గంటల పాటు నిరీక్షించారు. తమ వాళ్లు ప్రాణాలతో తిరిగి రావాలని వేడుకున్నా, చివరకు ఆ తొమ్మిది మంది విగతజీవులుగా తిరిగి రావడంతో ఆ ప్రాంతమంతా మృతుల కుటుంబసభ్యుల రోధనలతో శోకసంద్రంగా మారింది. మృతిచెందిన వారంతా తమ ప్రాణాలను ఫణంగా పెట్టి మంటలను కంట్రోల్ చేయడానికి ప్రయత్నించి విగతజీవులుగా మారారు. మృతిచెందిన ఈ తొమ్మిది మంది సంస్థకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లకుండా చేసిన ప్రయత్నాన్ని ప్రతిఒక్కరూ ప్రశంసిస్తున్నారు.
కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నించాం
పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది లోపల చిక్కుకున్న వారిని కాపాడేందుకు మూడుసార్లు లోపలకు వెళ్లి పొగకారణంగా వెనక్కు వచ్చారని ఆయన తెలిపారు. ఆక్సిజన్ పెట్టుకున్నా గురువారం అర్ధరాత్రి సంఘటనాస్థలికి చేరలేకపోయారని, శుక్రవారం ఉదయం నుంచి పరిస్థితి కొంచెం అదుపులోకి రావడంతో రెస్యూ బృందాలు లోపలికి వెళ్లాయని మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. ఒక దశలో సింగరేణి సిబ్బంది సాయం కోరామని, లోపలున్న వారిని కాపాడేందుకు శాయశక్తులా కష్టపడ్డామన్నారు.
డిఈ శ్రీనివాస్‌గౌడ్ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం
ఈ ప్రమాదంలో మృతిచెందిన డిఈ శ్రీనివాస్‌గౌడ్ కుటుంబానికి రూ.50 లక్షలు, మిగతా వారికి ఒక్కొక్కరికీ రూ.25 లక్షల నష్ట పరిహారం చెల్లించేందుకు సిఎం అంగీకరించారని మంత్రి జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని ఆయన తెలిపారు. ప్లాంట్‌ను కాపాడే యత్నంలో ఉద్యోగుల చేసిన కృషి అభినందనీయమన్నారు. శాఖాపరంగా బాధిత కుటుంబాలను అండగా ఉంటామన్నారు. సిఐడికి విచారణకు సిఎం ఆదేశించారని మంత్రి తెలిపారు. ఈ సంఘటనలో మృతిచెందిన జెన్‌కో ఉద్యోగుల పార్థీవ దేహాలను మంత్రితో పాటు ఎంపి రాములు, సిఎండి ప్రభాకర్‌రావు, ఎమ్మెల్యే గువ్వల బాలరాజులు నివాళులు అర్పించారు.

పది అడుగుల దూరంలోని వస్తువులు కనిపించని పరిస్థితి

మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది చాలా శ్రమించారు. ప్రమాద స్థలంలో హై ఓల్టేజ్ టార్చ్‌లు వేసినప్పటికీ పొగ వల్ల పది అడుగుల దూరంలో ఉన్న వస్తువులు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. ఒకవైపు వైపు మంటలు ఆర్పుతుంటే మరోవైపు దట్టమైన పొగ అలుముకుంది. దీంతో పొగ ఎక్కడ నుంచి వస్తుందన్న విషయాన్ని ఫైర్ సిబ్బంది ఒక దశలో అంచనా వేయలేకపోయారు. ఈ సంఘటనలో చిక్కుకున్నవారిని కాపాడేందుకు అధికారులు, మంత్రి, ఎమ్మెల్యేలు చివరివరకు ప్రయత్నాలు కొనసాగించారు. అయితే లోపల దట్టమైన పొగ ఉండటంతో సహాయక చర్యలకు ఒక దశలో ఆటంకం ఏర్పడింది. చిక్కుకున్న వారిని కాపాడేందుకు అగ్నిమాపక సిబ్బందితో పాటు పోలీసులు లోపలకు వెళ్లినా దట్టంగా పొగ ఉండటంతో మూడుసార్లు లోపలికి వెళ్లిన వారు తిరిగి వెనక్కి వచ్చారు. ఆక్సిజన్ పెట్టుకున్నా లోపలికి వెళ్లలేని పరిస్థితి నెలకొనడంతో ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది ఒక దశలో సింగరేణి సిబ్బంది సాయాన్ని కోరారు.

ప్రమాదం జరగడం దురదృష్టకరం : మంత్రి జగదీశ్ రెడ్డి

శ్రీశైలం లెఫ్ట్ పవర్ హౌస్‌లో ప్రమాదం జరగడం దురదృష్టకరమని మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఈగలపెంటలోని జెన్‌కో ఆస్పత్రి వద్ద ఉద్యోగుల పార్థీవ దేహాలను నివాళ్లు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. గురువారం అర్థరాత్రే తాను సంఘటనా స్థలానికి బయలుదేరి వచ్చానని ఆయన తెలిపారు. అయినా ఉద్యోగుల ప్రాణాలను దక్కించుకోలేక పోయాయని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. తనతో పాటు రెస్కూ టీంలు ఉద్యోగులను కాపాడడానికి చేసిన ప్రయత్నం ఫలించక పోవడం తనను కలచివేసిందన్నారు. ఒక్కసారిగా జరిగిన అగ్నిప్రమాదంతో పొగలు దట్టంగా వ్యాపించడం, సొరంగ మార్గం గుండా లోపలికి పోవడం సాధ్యం కాలేదని ఆయన తెలిపారు. గురువారం రాత్రి 10.30 గంటలకు మొదటి యూనిట్లో ఫైర్ జరిగిందని, నాలుగు ప్యానెల్స్ దెబ్బతిన్నాయన్నారు. ప్రమాదంలో 10మంది బయటకు రాగా లోపల 9మంది చిక్కుకున్నారని ఆయన తెలిపారు. లోపల దట్టమైన పొగ అలుముకోవడంతో సహాయక చర్యలకు విఘాతం కలిగిందని ఆయన పేర్కొన్నారు.

ప్రమాదంలో మృతులు వీరే

డిఇ శ్రీనివాస్ గౌడ్ (హైదరాబాద్), ఎఇ వెంకట్రావు(పాల్వంచ), ఎఇ మోహన్ కుమార్ (హైదరాబాద్), ఎఇ ఉజ్మ ఫాతిమా (హైదరాబాద్), ఎఇ సుందర్ (సూర్యాపేట), జూనియర్ ప్లాంట్ ఆపరేటర్ రాంబాబు (ఖమ్మం), జూనియర్ ప్లాంట్ ఆపరేటర్ కిరణ్ (పాల్వంచ), వినేష్ కుమార్, మహేష్ కుమార్ (అమరన్ కంపెనీ టెక్నిషియన్లు)

కరోనాను జయించినా…

Nirbhaya case filed against 139 people in Panjagutta PS

శ్రీశైలం ప్రమాదంలో సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం జగనతండాకి చెందిన ఏఈ ధరావత్ సుందర్ (35) మృత్యువాత పడ్డారు. నెల రోజుల క్రితం సుందర్‌కు కరోనా పాజిటివ్ రావడంతో సొంత గ్రామానికి వచ్చాడు. 15 రోజుల పాటు హోమ్ క్వారంటైన్ లో ఉండి కరోనాను జయించాడు. తిరిగి గురువారమే విధుల్లో చేరారు. ఈ క్రమంలోనే విద్యుత్ కేంద్రంలో చోటు చేసు కున్న ప్రమాదంలో సుందర్ మృత్యువాతపడ్డాడు. ప్రమాదం జరిగిన సమయంలో సుందర్ తన భార్యకు ఫోన్ చేసి పిల్లలు, నీవు జాగ్రత్త అంటూ ప్రమాద తీవ్రతను వారికి వివరించినట్టుగా తెలిసింది.

‘ప్లాంట్‌లో ప్రమాదం జరిగింది. నన్ను మంటలు చుట్టుముట్టాయి. పదిహేను నిమిషాల్లోగా ఎవరన్నా కాపాడకపోతే మేం బతికే పరిస్థితి లేదు… పిల్లలను జాగ్రత్తగా చూసుకో’-మరణించడానికి ముందు భార్యతో ఫోన్‌లో ఎఇ సుందర్

9 dead after fire in srisailam power plant

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News