Friday, May 3, 2024

450 పడకల హాస్పిటల్‌ను 20 రోజుల్లో ప్రారంభిస్తాం: ఈటల

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా రోగుల చికిత్స కొరకు హైదరాబాద్ నాచారంలో నూతనంగా నిర్మిస్తున్న ఇఎస్‌ఐ ఆసుపత్రిని ప్రత్యమ్నయంగా వాడుకుంటామని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం కోవిడ్ నోడల్ సెంటర్లుగా ఉన్న గాంధీ, టిమ్స్ ఆసుపత్రుల్లో రోగులు పూర్తిస్థాయిలో నిండితే, ఈ ఆసుపత్రిలోనూ కరోనా రోగులకు వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితి వచ్చే అవకాశం లేదని మంత్రి అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ప్రభుత్వం ఆధ్వర్యంలో కరోనా నియంత్రణ కోసం అన్ని ఏర్పాట్లు చేశామని, రాబోయే రోజుల్లో కరోనా కేసులు ఖచ్చితంగా తగ్గుతాయని ఆయన అన్నారు. తెలంగాణ కార్మిక విభాగం ఆధ్వర్యంలో నాచారంలో నిర్మిస్తున్న నూతన ఇఎస్‌ఐ హాస్పిటల్‌ను శనివారం మంత్రులు ఈటల, మల్లారెడ్డిలు సందర్శించారు.

ఈసందర్బంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ…రాష్ట్రంలో కరోనా కంట్రోల్‌లో ఉందని, ప్రజలెవ్వరూ భయాందోళనకు గురికావొద్దని తెలిపారు. కేవలం కొన్ని కుంటుంబాల లింక్ నుంచే కేసులు పెరిగాయని, వారి ఇళ్లను కంటైన్‌మెంట్ చేసి పకడ్బందీగా వైద్యం అందిస్తున్నామన్నారు. కరోనా వైరస్ వైద్యం కోసం అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అసవరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. నూతనంగా నిర్మించే ఈ ఆసుపత్రిని కేవలం 20 రోజుల్లో ప్రారంభిస్తామని తెలిపారు. దీనిలో అత్యాధునిక వైద్యపరికరాలతో పాటు ఇతర అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశామని తెలిపారు. కరోనా పూర్తిస్థాయిలో తగ్గిన తర్వాత ఈ ఆసుపత్రిని కార్మికులకు పూర్తిగా అంకితమిస్తామని పేర్కొన్నారు. ఇక్కడ అనుభవం ఉన్న వైద్యులు ఉన్నారని, కరోనా మహమ్మారి నుంచి ప్రజలు ప్రాణాలు కాపాడేందుకు వీరిని కూడా భాగస్వామ్యం చేస్తామని తెలిపారు. మంత్రి మాల్లారెడ్డి ప్రత్యేక చొరవతో ఇఎస్‌ఐ ఆసుపత్రి అద్బుతంగా రూపుదిద్దుకుందని కొనియాడారు. ప్రతి రోజూ కరోనాపై ముఖ్యమంత్రి ప్రత్యేక రివ్యూ నిర్వహిస్తూ, తమకు సూచనలు సలహాలు ఇస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఉప్పల్ శాసనసభ్యులు భేతిసుభాష్‌రెడ్డి, కార్పొరేటర్‌లు పాల్గొన్నారు.

Minister Etela inaugurated ESI Hospital in Nacharam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News