Tuesday, April 30, 2024

ప్రవేశ పరీక్షలన్నీ వాయిదా

- Advertisement -
- Advertisement -

 

All Common Entrance Tests 2020 Postponed in Telangana

 

 హైకోర్టుకు రాష్ట్ర
ప్రభుత్వం సమాచారం
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రెండోసారి
వాయిదా పడ్డ ఎంట్రెన్స్‌లు
9వ తేదీలోగా డిగ్రీ,
పిజి పరీక్షలపై స్పష్టతకు న్యాయస్థానం ఆదేశం

మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా కారణంగా రాష్ట్రంలో ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో బుధవారం(జూలై 1) నుంచి జరగాల్సిన ప్రవేశ పరీక్షలన్నింటినీ వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. దాంతో ఎంసెట్, పాలిసెట్,ఐసెట్, ఇసెట్, పిజిఇసెట్, లాసెట్, పిజిఎల్‌సెట్, ఎడ్‌సెట్, పిఇసెట్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జులై 6 నుంచి 9 వరకు ఎంసెట్, జులై 4న ఇసెట్, జులై 10న లాసెట్, జులై 1 నుంచి 3 వరకు పిజిఇసెట్, జులై 1న పాలిసెట్, 13న ఐసెట్, 15న ఎడ్‌సెట్ పరీక్షలు జరగాల్సి ఉంది. లాక్‌డౌన్ నేపథ్యంలో మే నెలలో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడగా, ఇప్పుడు మరోసారి వాయిదా పడ్డాయి.

రాష్ట్రంలో ప్రవేశ పరీక్షలను వాయిదా వేయాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. హైదరాబాద్‌లో లాక్‌డౌన్ విధిస్తే, పరీక్షలు ఎలా నిర్వహిస్తారనే దానిపై హైకోర్టును ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. లాక్‌డౌన్ స్పష్టత ఇచ్చాకే పిటిషన్‌పై విచారణ జరపాల్సి ఉంటుందని తెలిపింది. అయితే లాక్‌డౌన్ నిర్ణయంపై ఆధారపడి ఉందని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో కేబినెట్ సమావేశం ఉంటుందని ఈ సందర్భంగా ఎజి కోర్టుకు తెలిపారు. ప్రవేశ పరీక్ష పరీక్షల వాయిదాపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చర్చించి మద్యాహ్నం నిర్ణయం చెబుతామని ఎజి కోరడంతో న్యాయస్థానం విచారణను మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది. ఆ తర్వాత ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం కోర్టుకు వెల్లడించింది. పరీక్షల తేదీలను తర్వాత వెల్లడిస్తామని తెలిపింది.

9న డిగ్రీ, పిజి పరీక్షల నిర్ణయం

రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ, పిజి పరీక్షలపై జూలై 9వ తేదీలోగా స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. ఇప్పటికే డిగ్రీ, పిజి కోర్సులు చదువుతున్న ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఏడు సెమిస్టర్లు పూర్తయ్యాయని, ఎనిమిదవ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించకుండా గ్రేడ్లు కేటాయిస్తామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. చివరి సంవత్సరం విద్యార్థులకు అంతకుముందు సెమిస్టర్ల మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇస్తామని పేర్కొంది. ఉస్మానియా, జెఎన్‌టియుహెచ్‌తో పాటు మిగతా వర్సిటీల డిగ్రీ, పిజి పరీక్షల నిర్వహణపై పూర్తి నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 9కి వాయిదా వేసింది.

పాలిసెట్, ఎల్‌పిసెట్ వాయిదా

రాష్ట్రంలో బుధవారం(జూలై 1) జరగాల్సిన పాలిసెట్ పరీక్షను, జూలై 5న జరగాల్సిన ఎల్‌పిసెట్‌లతో జూలై 4,11,12 తేదీలలో జరగాల్సిన టైప్ రైటింగ్ పరీక్షలను కూడా వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ బోర్డు వెల్లడించింది. అలాగే జూలై 2 నుంచి 31 వరకు జరగాల్సిన డిప్లొమా రెడ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు బోర్డు కార్యదర్శి యువిఎస్‌ఎన్ మూర్తి తెలిపారు. వాయిదా పడిన పరీక్షలను షెడ్యూల్‌ను తర్వాత ప్రకటిస్తామని పేర్కొన్నారు.

 

All Common Entrance Tests 2020 Postponed in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News