Tuesday, May 14, 2024

ప్రధాని జనం మధ్యకు రావాలి

- Advertisement -
- Advertisement -

Prime Minister should come among the people

 

పక్షం రోజులకు పైగా తీవ్రమైన చలితో, ఒక వంక కరోనా మహమ్మారి భయం వెంటాడుతున్న సమయంలో వేల సంఖ్యలో దేశ రాజధానికి సమీపంలో రైతులు భైఠాయించి ఉంటె వారిని ఉద్దేశించి ఒక మాట కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇప్పటి వరకు చెప్పకపోవడం విచారం కలిగిస్తుంది. ప్రజాస్వామ్యంలో వివిధ వర్గాల ప్రజలు తమ సమయాలపై, అపోహలపై ఆందోళనలు వ్యక్తం చేస్తూ ఉండడం సహజం. వారికి నచ్చచెప్పి, భరోసా కలిగించి వారిని ఉపశమింప చేసే బాధ్యత ప్రభుత్వానిదే.

కానీ ఒక వంక కేంద్ర మంత్రులు వారితో చర్చలు జరుపుతున్నారు. మరోవంక ప్రధాన మంత్రి వారణాసి పర్యటనలో, పలు ఇతర వీడియో సమావేశాలలో రైతులను ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయని అంటూ నిందలు మోపుతున్నారు. వ్యవసాయాన్ని ఇప్పటి వరకు దేశాన్ని పాలించిన వారు విధ్వంసం చేస్తూ ఉంటె, తాము ఉద్ధరించడానికి చట్టాలు తీసుకు వచ్చామని అంటూ వెనుకడుగు వేసే ప్రశ్న లేదని చెబుతున్నారు.

ఒక వంక రైతుల డిమాండ్ల మేరకు చట్టాలలో సవరణలు తీసుకు రావడానికి ప్రభుత్వం సిద్ధం అంటూ వారితో చర్చలు జరుపుతున్న కేంద్ర మంత్రులు చెబుతున్నారు. మరోవంక చట్టాలలో మార్పుల ప్రసక్తి లేదని అంటూ బిజెపి, ఆ పార్టీ మద్దతుదారులు సోషల్ మీడియాలో విస్తృతమైన ప్రచారం చేస్తున్నారు. పైగా అక్కడున్నది రైతులు కాదని, రైతుల పేరుతో దేశ విద్రోహులు అంటూ కొందరు బిజెపి నేతలే బహిరంగంగా ఆరోపణలు చేస్తున్నారు. వ్యవసాయం గురించి అక్కడ భైఠాయించిన వారెవరికీ తెలుసనే ధోరణిలో అవహేళన చేస్తున్నారు. ఒక కేంద్ర మంత్రి అయితే చైనా, పాకిస్థాన్ వారిని రెచ్చగొట్టి ఆందోళనకు ప్రోత్సహిస్తున్నట్లు ప్రకటన ఇచ్చారు.

ప్రజాస్వామ్యంలో ఈ విధమైన ధోరణులు హర్షణీయం కాబోవు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ ఎవరు ఉద్యమాలు చేసినా, వారికి మద్దతు ఇవ్వడం ద్వారా తమ రాజకీయ ప్రాబల్యం పెంచుకొనే ప్రయత్నం ప్రతిపక్షాలు చేస్తుండడం సహజమే. అసలు సమస్యను పరిశీలించకుండా, రైతులకు మద్దతు ఇస్తున్నవారిపై మాటలతో దాడులు చేయడం మొత్తం సమస్యను రాజకీయం చేయడమే కాగలదు. ఇప్పటి వరకు రైతులు లేవనెత్తుతున్న అంశాలపై కేంద్ర మంత్రులు ఎవ్వరు భిన్నాభిప్రాయం వ్యక్తం చేయడం లేదు. అయితే ఆయా అంశాలను వ్యవసాయ చట్టాలలో ఏ మేరకు చేర్చాలో అనే అంశంపైననే భిన్నాభిప్రాయం వ్యక్తం అవుతున్నది.

అటువంటిదే కనీస మద్దతు ధర. వాస్తవానికి కనీస మద్దతు ధర గురించి ఏ చట్టంలో లేదు. రైతులను ప్రోత్సహించడానికి ఎప్పటికప్పుడు జిఒల ద్వారా ప్రభుత్వం 1960వ దశకం మధ్య నుండి చేస్తున్న ఏర్పాటు మాత్రమే. ప్రభుత్వం తీసుకు వచ్చిన చట్టాలు ప్రాథమికంగా వ్యవసాయ మార్కెట్ వ్యవస్థకు సంబంధించినవి. ఈ చట్టాల పరిధిలోలేని అంశాలను రైతులు ప్రస్తావిస్తున్నట్లు ప్రభుత్వం భావిస్తున్నది.

అదే విధంగా వ్యవసాయ మార్కెట్ కమిటీలకు సంబంధించిన సమస్య. ఆ అంశం రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనిది. శరద్ పవర్ కేంద్ర వ్యవసాయ మంత్రిగా ఉన్న సమయంలోనే మాదిరి మార్కెట్ కమిటీ చట్టం రూపొందించి అన్ని రాష్ట్రాలు పంపినా వ్యవసాయ సంస్కరణల పట్ల ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆసక్తి చూపడం లేదు. ఇప్పుడు ఈ విషయమై కేంద్రాన్ని రైతులు భరోసా అడిగితే పరిష్కారం లభిస్తుందని ఆశింపలేము. ఏ ప్రజాస్వామ్య ప్రభుత్వమైనా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు సంబంధిత వర్గాలు, ప్రతిపక్షాలను సంప్రదించి, వారి ఆలోచనలను కూడా పరిగణనలోకి తీసుకోవడం అవసరం.

కేవలం జిఎస్‌టి విషయంలోనే పలు పర్యాయాలు ప్రతిపక్షాలతో సంప్రదింపులు జరిపారు. మరే విషయంలో కూడా అటువంటి సంప్రదింపులు జరపనే లేదు. నోట్ల రద్దు దగ్గర నుండి ఆర్టికల్ 370 రద్దు, వ్యవసాయ చట్టాల వరకు ప్రతిపక్షాలతో ఎట్లాగూ ఉంచితే, కనీసం సొంత పార్టీలో, కేంద్ర మంత్రి వర్గంలో లోతయిన చర్యలు జరిపిన దాఖలాలు లేవు. ప్రధాని మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా లను అన్నింటికీ అతీతంగా చూపుతూ, వారీ ఈ దేశాన్ని అభివృద్ధిలోకి నడిపించే వారన్నట్లు ప్రచారం చేస్తున్నారు. ఒక విధంగా ప్రజాస్వామ్యంలో ఇదొక్క ప్రమాదకరమైన ధోరణి కాగలదు. చివరకు పార్టీలకు అతీతంగా ఉండవలసిన విదేశాంగ విధానంను సహితం పార్టీ విధానంగా మార్చివేస్తున్నారు.

ఈ మధ్యనే మాజీ విదేశాంగ మంత్రి, మాజీ జాతీయ భద్రతా సలహాదారుడు శివశంకర్ మీనన్ ఒక వెబినార్‌లో మాట్లాడుతూ ఈ అంశంపై హెచ్చరిక చేశారు. గతంలో విదేశాంగ విధానంలో కీలక నిర్ణయాలు తీసుకొనే ముందు ప్రతిపక్ష నేతలతో మాట్లాడమని తమను పివి నరసింహారావు, వాజపేయి, మన్మోహన్ సింగ్ పంపేవారని తెలిపారు. కానీ ఇప్పుడు ప్రభుత్వంలో కూడా సవివర చర్చలు జరగడం లేదని వాపోయారు. వాస్తవానికి వ్యవసాయ సంస్కరణలతో ఇప్పటికే మనం చాలా ఆలస్యం చేసాము. ఎప్పుడో చేపట్టవలసి ఉంది. అయితే ఈ సంస్కరణలు చేపట్టే ముందు రైతు ప్రతినిధులతో, ప్రతిపక్షాలతో సమాలోచనలు జరిపి ఉంటె మరింత సమగ్రంగా చట్టాలను తీసుకు వచ్చే అవకాశం ఉండెడిది. కనీసం పార్లమెంట్ స్థాయి సంఘం పరిశీలనకు పంపినా సమగ్రమైన ఆలోచనలను చేర్చే అవకాశం ఉండెడిది.

అటువంటి ప్రయత్నం చేయకుండా కరోనా మహమ్మారి సమయంలో ముందుగా ఆర్డినెన్సు రూపంలో, తర్వాత చట్టాలుగా అర్ధాంతరంగా తీసుకు రావడంతోనే సహజంగా కొందరు పారిశ్రామిక వేత్తలకు ప్రయోజనం చేకూర్చడం కోసమే తీసుకు వచ్చారనే అనుమానాలు కలుగుతున్నాయి. తాను అనుకున్న అంశాలను ప్రజల మనస్సులో చొప్పింప చేయడంలో అసాధారణమైన సమాచార సామర్ధ్యం ప్రధాని మోడీలో ఉన్నాయి. అయితే ఆయన సమాచార వ్యవస్థ అంతా ఏకపక్షంగా ఉంటుంది. ఆయన బహిరంగ సభలలోనే, టివి ప్రసంగంలోని, వీడియో కాన్ఫరెన్స్ లోనే ప్రసంగాలు చేయడం ద్వారా సమాచారం అందించడం మినహా, విభిన్న వర్గాలను స్వయంగా కలుసుకొనే ప్రయత్నం చేయడం లేదు.

కరోనా సమయంలో దాదాపు అధికార నివాసానికి పరిమితమైనా ఉంటూ మంత్రువర్గ సహచరులతో కూడా లోతయిన సమాలోచనలు ప్రధాని చేయడం లేదు. దేశాన్ని స్తంభింప చేస్తున్న రైతుల సమస్యపై ఆయన కేవలం ఒక్కసారి మాత్రమే సీనియర్ మంత్రులతో సమాలోచనలు జరిపారు. రైతులతో నేరుగా మాట్లాడి, వారి అనుమానాలు తీర్చడానికి సిద్ధంగా ఉన్నానని రక్షణ మంత్రి రాజనాధ్ సింగ్ ప్రకటించినా ఆయనను రంగంలోకి దించడం లేదు. అంతా హోమ్ మంత్రి అమిత్ షా పర్యవేక్షణలో రైతుల సమస్యలను పరిశీలించే ప్రయత్నం జరుగుతున్నట్లు సంకేతాలు ఇస్తున్నారు.

అంటే వారి ఆందోళనను శాంతి, భద్రతల సమస్యగా చూస్తున్నారు గాని వారి ఆవేదనను అర్ధం చేసుకొనే ప్రయత్నం జరగడం లేదని భావించవలసి వస్తుంది. వ్యవసాయం గురించి ఈ ప్రభుత్వంలో తగు అవగాహన ఉన్నట్టు వారెవరూ లేరనే సంకేతాలు ఈ సందర్భంగా వెలువడుతున్నాయి. స్వదేశీ జాగరణ్ మంచ్, భారతీయ కిసాన్ సంఘ్ వంటి ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థలు ఈ చట్టాలపై చేసిన ప్రకటనలు సహితం ఇటువంటి అభిప్రాయం కలిగిస్తున్నాయి. సంప్రదింపులు మొక్కుబడిగా కాకుండా, సమస్యల స్వరూపం పట్ల అవగాహన చేసుకొని, పరిష్కారం అన్వేషించే దృష్టితో జరగాలి.

ఉదాహరణకు ప్రభుత్వం తీసుకు వచ్చిన కార్మిక చట్టాల సంస్కరణలకు సంబంధించి గత ఫిబ్రవరిలో దేశంలోని ప్రముఖ కార్మిక సంఘాల ప్రతినిధులతో ఢిల్లీలో సంప్రదింపులు జరిపారు. కానీ ఆ సమావేశంలో కార్మిక సంఘ ప్రతినిధులు చేసిన ఒక సూచనను కూడా చట్టాలలో చేర్చే ప్రయత్నం చేయలేదు. ప్రస్తుతం రాజకీయంగా నరేంద్ర మోడీని సవాల్ చేయగల పరిస్థితిలో ఏ నాయకుడు, రాజకీయ పక్షం దేశంలో లేవు. ప్రధాని స్వయంగా రైతుల భైఠాయింపు ప్రాంతానికి వెళ్లి, వారికి భరోసా కలిగించి, వారిని వెనుకకు వెళ్లే ప్రయత్నం చేస్తే ఆయన ప్రతిష్ఠ ఎంతగానో పెరిగి ఉండెడిది.

వ్యవసాయ చట్టాల విషయంలో ప్రభుత్వం ప్రతిష్ఠకు పోనవసరం లేదు. మోడీ అధికారంలోకి రాగానే హడావుడిగా భూసేకరణ సవరణ విషయంలో కూడా ముందుగా ఆర్డినెన్సు, తర్వాత చట్టం తీసుకు వచ్చారు. కానీ తర్వాత విరమించుకొనక తప్పలేదు. అదే విధంగా సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థపై కూడా వెనుకడుగు వేయవలసి వచ్చింది.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News