Saturday, April 27, 2024

తెలుగు నేలంతా తిరిగిన ‘సాహిత్య సందర్భం’

- Advertisement -
- Advertisement -

About Dr. Ammangi Venugopal Rachanalu

 

డా॥ అమ్మంగి వేణుగోపాల్ గారు నాకన్న తొమ్మిది నెలలు పెద్దవారు వయసులో. మేము సమకాలీనులం. నేను ప్రధానంగా సాహిత్య విమర్శకే ఉపరిమితమై కొంచెం కవిత్వం కూడా గిలికినాను. అమ్మంగి నవల తప్ప తక్కిన ప్రక్రియలన్నింటిలోకీ ప్రవేశించారు. ఆయన 1962లోనే 15 ఏళ్ళకే రచనారంగంలోకి అడుగుపెట్టారు. నేను 1975 తర్వాతనే సాహిత్య రచనకు ఉపక్రమించాను.అమ్మంగి నాకు వ్యక్తిగతంగా పరిచయం కాకముందే “నవలా రచయితగా గోపీచంద్‌” అనే సిద్ధాంత గ్రంథం ద్వారా పరిచయం అయ్యారు. ఆయన ఇప్పటిదాకా ‘అవినాభావం’ (1990) నవలా రచయితగా గోపీచంద్, గోపీచంద్ జీవిత సాహిత్యాలు (2010), సాహిత్య సందర్భం (2012), వట్టికోట అళ్వారుస్వామి రచనలు ఒక పరిశీలన అనే అయిదు పరిశోధన విమర్శ గ్రంథాలు ప్రచురించారు. ఇంకా అనేక వ్యాసాలు పుస్తక రూపంలో రావలసి ఉంది.

వీటిలో “సాహిత్య సందర్భం సమకాలన స్పందన’ అనే 2012 నాటి విమర్శ గ్రంథం విశ్లేషణ చేయడం నా పని. ఇది 89 వ్యాసాల సంపుటి. ఇవన్నీ 2007-2010 మధ్య వచ్చిన వ్యాసాలే. రెండు మూడు తప్ప తక్కినవన్నీ 2007 నబంబర్ 12 నుండి 2008 సెప్టెంబర్ 1 మధ్య ‘సూర్య దినపత్రిక’లో అమ్మంగి వారం వారం రాసిన ఫీచర్‌గా రాసిన వ్యాసాలు. ‘చేరా’ గారి ‘చేరాతల’ తర్వాత ఇటీవలి కాలంలో అమ్మంగి ‘సూర్య దినపత్రిక’లో దస్తురి పేరుతో రాసిన వ్యాసాలు పాఠకులను బాగా సమీపించాయి. ఇలా వారం వారం సాహిత్యం మీద వ్యాసాలు రాయడం కత్తిమీద సామే. ఉబుసుపోక రాస్తే పాఠకులు చదవరు. ఈ విషయ బలం, భావనాబలం, భాషా బలం వంటి అనేక శక్తులు ఒక్కసారిగా అవసరమౌతాయి. ఇవన్నీ అమ్మంగికి ఉన్నాయి గనకనే ఆయన ఈ కాలవ్‌ు రాయగలిగారు.

ఈ వ్యాసాలలో కవిత్వానికి పెద్దపీట వేశారు అమ్మంగి. ఆ తర్వాత ఆ స్థానం కథానిక కిచ్చారు. విమర్శ పరిశోధన పరామర్శకు సముచితస్థానం కల్పించారు. నవల, నాటకం, భాషా శాప్త్రం, స్వీయచరిత్రలు, సినిమా, సాహిత్య సదస్సులు, సామాజిక శాస్త్రాంశాలు వంటి వాటిపైన కూడా అమ్మంగి దృష్టి సారించారు.

ఒకవైపు ప్రపంచీకరణ మన సమాజం మీద ఘోరమైన దాడి చేస్తున్న కాలం, మరోవైపు తెలంగాణ రాష్ట్రోద్యమం తెలుగు సమాజంలో ఉధృతంగా సాగుతున్న కాలం. ఈ నేపథ్యంలో అమ్మంగి చాలా నిలకడగా ఈ వ్యాసాలు రాశారు. తెలంగాణ వైపు తెలంగాణ సాహిత్యం వైపు ఆ సమయంలో మొగ్గడం అనివార్యమే. పైగా తప్పు కాదు. అమ్మంగి తెలంగాణ వాదిగా ఆ పార్శ్వాన్ని బాగా ప్రచారం చేస్తూనే సాహిత్యంలో ఇతర ప్రాంతాల సాహిత్యాన్ని ఆయన మిస్మరించలేదు. బహుశా ఆయన సంయమనమే ఇందుకు కారణం.

అమ్మంగి తన వ్యాసాలకు పెట్టిన పేర్లలో కొన్ని మనల్ని బాగా ఆకర్షిస్తాయి. ఆలోచింపజేస్తాయి. “నీడను విడిచి వెళ్ళిన చెట్టు కాళోజి”, “భావితరాల సమకాలికుడు గురజాడ”, “ఆయుధం ఒక్కటి యుద్ధాలు అనేకం”, మరణమొక అసందర్భం” వంటివి అలాంటి శీర్షికలు.

ఏ వ్యాసం రాసినా రచయితల వ్యక్తిత్వంలోని ఔన్నత్యం చాటారు. లేదా విషయంలోని బలాన్ని ఎత్తి చూపారు. ఎవరో ‘కాళోజీ ఒక కాలేజీ’ అని కవిత రాశారట. కాళోజీ “వ్యక్తి పూజ మంచిది కాద”ని తీవ్రంగా మందలించారట. ఇవాళ మన రాజకీయరంగంలో ఎక్కడ చూసిన వ్యక్తిపూజ, వ్యక్తి సంకీర్తన హద్దులు దాటిపోయి, అసహ్యం గొల్పుతున్నది. కాళోజీ వంటి నాయకులు ఇవాళ లేకపోవడం దురదృష్టం. గురజాడను కోస్తా ప్రాంతపు బ్రహ్మాణుడుగా తీసిపారేయకుండా, ఆయన ‘కన్యాశుల్కం’ మరో వందేళ్ళదాకా మనల్ని ఆలోచింపజేస్తుందని అమ్మంగి అభిప్రాయపడడం ఆయన సత్యసంధతకు తార్కాణం. రెండవ కన్యాశుల్కం వచ్చి నూరేళ్ళయిన సందర్భంగా ఒకవైపు మనువాదులు గురజాడ మీద మురికినీళ్ళు చల్లే ప్రయత్నంచేశారు.

మరోవైపు ప్రగతిశీలవాదులే కొందరు ఆయనను కులదృష్టితో, ప్రాంత దృష్టితో తీసిపారేసే ప్రయత్నం చేశారు. అమ్మంగి తాను తెలంగాణవాదిగా ఉంటూనే, సాహిత్య విధేయుడుగా గురజాడను వివేచించారు. సురవరం ప్రతాపరెడ్డి గారిని ఇష్టపడని తెలుగువారు ఉండరు. అమ్మంగి ఆయన కథల్ని విశ్లేషిస్తూ మానవ స్వభావం లోని నీతిని లేదా దుర్నీతినీ వాస్తవంగా చిత్రించి ఒక్కోసారి పక్కపక్కన నిలపి చూపించడం ఆయన పద్ధతి అని నిర్ణయించారు. కవి విమర్శ రాస్తే విమర్శ కవితాత్మకంగా ఉంటుంది. “చార్మినార్ ఔన్నత్యం, దాశరథి కవిత్వం ఈ రెండూ తెలంగాణను చారిత్రాత్మకం చేశాయి” అనడం ఆయనలోని కవిని పట్టిస్తుంది. అమ్మంగి కవి గనకనే “ఒక కవిత శీర్షిక ఎప్పుడూ కవితలో భాగమే” అనగలిగారు శ్రీశ్రీని గురించి.

“సృజనాత్మకశక్తి అన్నది బ్రహ్మపదార్థం కాదు. సామాజిక కవిమిత్రులకు అతీతమైన ప్రతిభ ఉండదు” అనే శాస్త్రీయమైన అవగాహన లేదా అభిప్రాయం సాహిత్యానికీ, సమాజానికీ సంబంధించిన సమస్త మౌఢ్యాలను తిరస్కరిస్తున్నది. ఆధునిక చైతన్యమేయ అమ్మంగితో ఈ పలుకు పలికించింది. “ప్రాచీన సంస్కృతి ఆధునిక నాగరికతకు ఊపిరి పోస్తుంది” వంటి మాటలు ఆయన చారిత్రక జ్ఞానానికి నిదర్శనాలు. సాహిత్య విమర్శకులు రచయితల పట్ల ఇష్టం కలిగుంటూనే, వాళ్ళలోని మేలిమి గుణాలను చాటుతూ, వాళ్ళ పరిమితులను ఎత్తి చూపగల ధైర్యమూ ఉండాలి. అంతతేకాదు, వాళ్ళలతో విభేదించే అంశాలనూ ఎత్తిచూపే నిజాయితీ ఉండాలి. ‘మో’ ను గురించి రాసిన వ్యాసంలో ఆయన సాహిత్యశక్తిని విశ్లేషించిన అమ్మం గి, ‘మో’ రాసిన “రాష్ర్ట కీడుడు” కవితను సమర్థించలేదు. అది తెలంగాణ వాదాన్ని ఖండిస్తుండిన కవిత అని స్పష్టంగా పేర్కొన్నారు. అంటే ‘మో’లోని తెలంగాణ వాద వ్యతిరేకతను తక్కువచేసి చూపించే సీతారాం ముందుమాట ప్రయత్నాన్ని కూడా అమ్మంగి ఉపేక్షించలేదు. అది ‘కుదరదు’ అన్నాడు.

అమ్మంగి విస్తృతమైన అధ్యయనం చేయడమే గాక, అధ్యయనంలోంచి ఏర్పరచుకున్న అభిప్రాయాలను అందంగా నిర్మిస్తారు. అంతే కాదు స్పష్టంగానూ సూత్రీకరిస్తారు. తెలుగులో అమ్మానాన్నల మీద కవిత్వం సంకలనాల కొద్దీ వచ్చింది. జన్మనిచ్చిన తల్లిదండ్రుల మీద కవుల అభిప్రాయాలు సృజనాత్మకంగా, భావుకతారమ్యంగా కవిత్వానికీ, నాన్న మీది కవిత్వానికీ గల తేడాను గుర్తించారు. తల్లిని గూర్చిన కవిత్వంతో భావుకతకు, తండ్రిని గూర్చిన కవిత్వంలో వాస్తవికతకు చోటెక్కువ” అన్నారు. ఇది మంచి పరిశోధనకు ఉపకరించే సూత్రీకరణ.

కవులు అనేకాంశాలమీద అనేక సందర్భాలలో కవితలు రాస్తారు. విమర్శకులు ఆ వైవిధ్యాన్ని విశ్లేషిస్తారు. ఇది సహజం అయితే ఇక్కడితో ఆగరాదు. విమర్శకులు కవులలోని విశిష్ట గుణాలను గుర్తించగలగాలి. అమ్మంగి ఈ పని బాగా చేస్తారు. విద్యార్థి అనే కవితలో ఒక ఉదాత్త ప్రేమికుడన్నారు.

కల్పనాసాహిత్యంలో కథాసారం చెప్పి విమర్శగా చెలామణి చెయ్యడం చాలామందికి అలవాటు. అయితే కల్పనా సాహిత్య విమర్శ ఈ పదపాదానికి తర్వాత ఉంటుంది. ఈ వాస్తవం అమ్మంగిని బాగా తెలుసు. చాలామంది కథకుల మీద రాసిన వ్యాసాలలో అమ్మంగి వాళ్ళ కథలు ఏయే భౌగోళిక ప్రాంతాలలో సంచరిస్తాయో చెబుతారు. ఆర్.ఎం. చిదరంబరం కథలు చాలావరకు పట్టణ, నగర వాతావరణానికి సంబంధించినవి అని గుర్తించాడు. అలాగే కవుల ఏయే నేపథ్యాలతో రచిస్తారో అమ్మంగి పసిగట్టారు. కందుకూరి శ్రీరాములు కవిత్వం చాలావరకు పల్లె తల్లి కొంగు పట్టుకుని తిరుగాడుతుంది అని అన్నారు.
కవుల ప్రాముఖ్యాన్ని నిర్వచించడం విమర్శలో ఒక భాగం. పదిమంది కవులుంటే, వాళ్ళు ఒకే భావజాలం కలిగిన వాళ్ళయి ఉంటే, వాళ్ళతో ఒకరి విశిష్టతను నిర్ణయించడం కష్టమే. అమ్మంగి గద్దర్‌ను గురించి రాస్తూ “ఎందరు పాటలు రాసిన మరెందరు పాడినా, సర్కస్ డేరాకు మధ్యన ఉన్న ఆధారస్తంభం లాంటివాడు గద్దర్‌” అని నిర్వచించారు.

తెలంగాణ రాష్ట్రోద్యమం తీవ్రతరమౌతున్న కొలదీ తెలంగాణ సాహిత్య సృష్టి కూడా ఎక్కువగా జరిగింది. విభిన్నవాదాల రచయితలను ఆదర్శమూ తనవైపు తిప్పుకున్నది. అమ్మంగి అలా వచ్చిన సాహిత్యం మీద చాలా వ్యాసాలు రాశారు. ఈ క్రమంలో విమర్శకుడుగా ఆయన కొన్ని విలువైన అభిప్రాయాలను నిర్మించారు. “దళిత, స్త్రీవాద, మైనారిటీ, అభ్యుదయ, విప్లవవాదాల కన్నింటికీ ఈక్షణంలో తెలంగాణ ఉద్యమమే కేంద్రబిందువు”. “అస్తిత్వ ఉద్యమం ఇచ్చే సమిష్టి వ్యక్తిత్వమీ ‘మునుం’.

సామాన్య జీవితం గడిపే రచయితలకే ప్రజా జీవితపరిజ్ఞానం పుష్కలంగా ఉంటుందన్న అవగాహనతో అమ్మంగి సాహిత్యవిమర్శ సాగింది. శీలా వీర్రాజు మొదలైన వారి మీద రాసిన వ్యాసాలలో ఈ అంశం తెలుస్తుంది. ఒక ప్రాంతం వాళ్ళు మరో ప్రాంతభాషతో రచనలు చేయడం అభినందనీయమేగానీ, అది ఆ ప్రాంత భాషా ప్రవాహగుణాన్ని సాధించదు అని అమ్మంగి పి. దక్షిణామూర్తి మీద రాసిన వ్యాసంలో నిష్కర్షగా చెప్పారు. విస్తృతుడైన మంచి రచయితను వెలికితీసినప్పుడు విమర్శకులు ఎలా తన్మయులై మాట్లాడతారో ఎం.వి. తిరుపతయ్య మీద రాసిన వ్యాసం రుజువుచేస్తుంది.

కల్పనాసాహిత్యంలో పాత్రలు ఎలా ప్రవర్తిస్తాయి అనేది ఒక ప్రశ్న. కొందరు రచయితలు తమ పాటలను నడిపిస్తారు. మరికొందరు పాత్రలను వాటంతట అవి నడిచేటట్లు చేస్తారు. సామాజిక పరిస్థితులే పాత్రలను నడిపిస్తాయి అనే అవగాహన రెండోరకం రచయితలది. అయితే అమ్మంగి గూడూరి సీతారాం గురించి రాస్తూ ఆయన కథానికల్లో మనసు చెప్పినట్లు నడుచుకొనే పాత్రలు ఎక్కువ అన్నారు. దీనిని వవరించారు కూడా.

కాలమ్ రాయవలసి రావడంవల్లనే కాదు, అమ్మంగిలో సమస్త సాహిత్య ప్రక్రియాపఠనాసక్తి అత్యంత సహజంగానే ఉందనిపిస్తుంది. నా వరకు నేను కవిత్వం, కథానిక, సాహిత్య విమర్శల వరకు ఎక్కువ కృషి చేశాను. నవలల మీద నా కృషి పరిమితం. నాటకాల మీద అత్యల్పం నా విమర్శ. ఇక సృజనేతర ప్రక్రియల జోలికి తాను వెళ్ళలేదు. అమ్మంగి ఆల్‌రౌండర్. అందుకే అమ్మంగి విమర్శ పుస్తకాలు చదివితే ప్రపంచం తిరిగి వచ్చినట్లుంటుంది. సాహిత్యాన్ని చదివించడమే సాహిత్య విమర్శ ప్రయోజనం అన్నారు. సర్దేశాయి తిరుమలరావు. మంచి విమర్శ మంచి సాహిత్యాన్ని చదివించాలని అనుకుందాం. అమ్మంగి రాసిన విమర్శ పాఠకులను సాహిత్య పఠనం వైపు మళ్ళిస్తుంది. ఈయన రచనను రుచి చూసి పాఠకులకు రుచి చూపించి వదులుతారు. ఆయన అందించిన రుచిని అందుకొని ఆయన పరామార్శించిన గ్రంథాలను అధ్యయనం చేయడం పాఠకుల వంతు.

పఠనీయమైన శైలి, అందమైన వ్యాసాలు, ఆలోచనాత్మకమైన అభిప్రాయాలు, ముక్కుసూటిదనం, విస్తృతాధ్యయనానుభవం వంటి లక్షణాలసారం ఈ “సాహిత్య సందర్భం సమకాలీన స్పందన”.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News