Sunday, April 28, 2024

5వేల కోట్లైనా వెనుకాడం

- Advertisement -
- Advertisement -

 coronavirus

 

బాధ్యతను వందశాతం చిత్తశుద్ధితో నెరవేరుస్తాం

దేశానికి పట్టిన పెద్ద కరోనా కాంగ్రెస్సే

కేంద్రం, రాష్ట్రం కర్తవ్య స్పృహతో వ్యవహరిస్తున్నాయి
కేంద్ర ఆరోగ్యమంత్రితో మాట్లాడుతున్నాను
బయటి దేశాలనుంచి వచ్చిన వారికే కరోనా వస్తోంది
శంషాబాద్‌లో 200 మంది ఆరోగ్యసిబ్బంది పనిచేస్తున్నారు
వందేళ్లకు ఒక సారి ఇటువంటి వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది
135 కోట్ల మంది ఉన్న దేశంలో వైరస్ సోకింది 65మందికే
కెనడాలో ప్రధాని భార్యకు కూడా సోకింది
అసెంబ్లీ స్వల్పకాలిక చర్చలో ముఖ్యమంత్రి కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు అవసరమైతే రూ. 1000 నుంచి 5,000 కోట్లు ఖర్చు చేసేందుకు కూడా వెనుకాడబోమని అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చం ద్రశేఖర్‌రావు ప్రకటించారు. అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చలో భాగంగా శనివారం కో విడ్ – 19(కరోనా వైరస్)పై సిఎం కెసిఆర్ మాట్లాడుతూ… సభలు, సమావేశాలు ని ర్వహించవద్దని పిలుపునిచ్చారు. వైరస్‌పై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామ ని తెలిపారు. ఎయిర్‌పోర్టులో 200 మం ది ఆరోగ్యశాఖ సిబ్బంది పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. ఎక్కువగా ప్రబలకుం డా ముందస్తుగా మాస్కులను, శానిటైజర్లు, సూట్లు అందించేందుకు సిద్దంగా ఉన్నామని చెప్పారు. ప్రతిరోజు కరోనా వైరస్‌పై సమీక్షలు జరుపుతున్నామని.. దేశంలో 65 మందికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిందన్నారు.

విదేశాల నుంచి వచ్చిన 17 మందికి కరోనా ఉందని.. కరోనా వైరస్ వచ్చాక 10 మంది కోలుకున్నారని తెలిపారు. దేశంలో ఇప్పటి వరకు కరోనాతో ఇద్దరు మృతి చెందారని… ఇటలీ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని సీఎం తెలిపారు. మరో ఇద్దరి శాంపిళ్లను పుణె పంపించారని చెప్పారు. బయటిదేశం నుంచి వచ్చిన వాళ్లకే కరోనా వస్తోందని తెలిపారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎయిర్ ట్రాఫిక్ పెరిగిందని.. ఇతర దేశాల నుంచి హైదరాబాద్‌కు డైరెక్ట్ విమానాలు లేవన్నారు. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల నుంచి భారత్‌కు ఎవరొచ్చినా.. వాళ్లను 14 రోజులు అబ్జర్వేషన్‌లో పెడుతున్నట్టు తెలిపారు. గతంలో కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తి కోలుకున్నాడని.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్టు తెలిపారు. తెలంగాణలో రెండో కరోనా పాజిటివ్ కేసు నమోదైందని వెల్లడించారు.

దేశానికి పట్టిన పెద్ద కరోనా కాంగ్రెస్సే..
దేశానికి పట్టిన పెద్ద కరోనా… కాంగ్రెస్సేనని ముఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. కరోనా వైరస్‌పై శాసన సభలో జరుగుతున్న చర్చ సందర్భంగా ప్రతిపక్ష నాయకుడు భట్టి విక్రమార్క మాట్లాడుతూ కేంద్ర రాష్ట్రాలు చర్యలేమి తీసుకోవడంలేదన్నారు. ఎండి సిద్దిఖీ అనే వ్యక్తి బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చి తలాప్‌కట్టలో 15 రోజులున్నాడని, 2 హాస్పిటల్స్ తిరిగారని, సమాచారం సేకరించాలని చెప్పగానే.. సిఎం కెసిఆర్ స్పందిస్తూ… కరోనా వంటి సున్నితమైన అంశాలను రాజకీయం చేయొద్దని, శవాలపై పేలాలు ఏరుకునే పద్దతి వద్దని, దురుద్దేశ్యం ఉంటే మానుకోవాలి. ప్రజలను భయాందోళలనకు గురిచేయొద్దని చెప్పుతూనే పై విధంగా కాంగ్రెస్సే పెద్ద కరోనా అని సిఎం వ్యాఖ్యానించారు. నోరుంది కదా అని ప్రతిపక్ష నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రజలకు ధైర్యం చెప్పాలని.. కన్‌ఫ్యూజ్ చేయరాదని చెప్పారు. పాతబస్తీని ఎందుకు బద్నాం చేస్తారని.. చిల్లర టీవీ వాళ్లు ప్రచారం చేస్తారు.. అవి నమ్ముతారా అని ఘాటుగా ప్రశ్నించారు.

కరోనా వైరస్ నియంత్రణకు కేంద్రం, రాష్ట్రం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నాయని, కేంద్రం అనేక ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుందని, నేనే కేంద్ర ఆరోగ్య మంత్రితో మాట్లాడుతున్నట్టు తెలిపారు. బాధ్యతను వంద శాతం చిత్తశుద్ధితో నిర్వహిస్తామని సిఎం స్పష్టం చేశారు. ఈ వైరస్ నియంత్రణకు అన్ని ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా పనిచేస్తున్నాయని, ప్రజలకు ధైర్యం చెప్పేందుకే తగిన ఉష్ణోగ్రత దగ్గర వైరస్ బతకదని చెప్పానని.. పారాసిట్‌మాల్ వేసుకుంటే జ్వరం తగ్గుతుందని ఒక సైంటిస్ట్ తనతో చెప్పారని సిఎం వివరించారు. 135 కోట్ల మంది జనాభాగా ఉన్న మన దేశంలో ఇప్పటి వరకు వైరస్ సోకింది కేవలం 65 మందికేనని.. కేంద్రం మాత్రమే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వ రాష్ట్రాల్లో కూడా అప్రమత్తంగా ఉన్నారని చెప్పారు.

కెనడాలో ప్రధాని భార్యకు కూడా కరోనా వచ్చిందన్న కేసీఆర్.. ప్రజలు కంగారు పడతారని నాలుగైదు రోజుల తర్వాత వెల్లడించారన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిపై రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి హైలెవల్ కమిటీ చర్చిస్తోందని శాసన సభలో సిఎం తెలిపారు. కరోనా కోసం సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేశామని, డిసిపి ప్రకాశ్‌రెడ్డి అధ్యక్షతన కమిటీని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సూచనలను ప్రజలు బాధ్యతాయుతంగా పాటించాలని సిఎం చెప్పారు. సాయంత్రం సమావేశానంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జిల్లాల కలెక్టర్లు చేసే సూచనలు తప్పని సరిగా అనుసరించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రతి ఒక్కరు పరిశుభ్రతకు ప్రాధాన్యతనివ్వాలన్నారు.

వందేళ్ళకొకమారు..
ప్రతి వందేళ్ళకు ఒక మారు ఇలాంటి వైరస్ ప్రపంచాన్ని గడగడలాదిస్తుందని, దాదాపు వందేళ్ళ క్రితం ఈ వైరస్ సోకి కోటి 4 లక్షల మంది చనిపోయారని సిఎం కెసిఆర్ గుర్తు చేశారు. గతంలోనూ దేశంలో గత్తర, కలరా వంటి వ్యాధులు వచ్చేవి. అయితే, ఒక గ్రామంలో ఈ గత్తరను తగ్గించేందుకు పెద్దలు తమకు తెలిసన ఓ భూత వైద్యుడిని పిలుచుకుని గ్రామానికి వస్తుండగా… ఈ భూతవైద్యుడు వస్తున్నట్టు తెలుసుకుని గత్తర వెళ్ళిపోతుంటుంది. ఊరి పొలిమేరలో గత్తర, భూతవైద్యుడు ఎదురుపడగా ఏమి గత్తర ఇంత మందిని పొట్టబెట్టుకుంటివేంటి..? అని అడుగుతాడు. దానికి బదులిస్తూ… వచ్చింది నలుగురికే… అది వస్తుందని తెలిసి 10 మంది చనిపోయారని గత్తర తెలుపుతుంది. ఇలా జరుగుతుంటాయి. అన్నీ అవేనని అనుకోలేమన్నారు.

ఎయిర్‌పోర్టులో రద్దీ పెరిగింది..
కరోనా వ్యాప్తి నేపథ్యంలో జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులను గమనిస్తున్నామని, వైరస్ నియంత్రణ చర్యలో భాగంగా పలు రాష్ట్రాల్లో సినిమాహాల్స్, స్కూల్స్ బంద్ చేశారని తెలిపారు. దేశంలో 6 మెట్రో నగరాల్లో హైదరాబాద్ ఒకటి. శంషాబాద్ ఎయిర్ పోర్టులో రద్దీ బాగా పెరిగిందని, 2013 _14లో 23 వేల మంది ప్రయాణికులు వస్తే ఇప్పుడు 57 వేల మంది వస్తున్నారని తెలిపారు. నాడు 200లకు పైగా విమానాలు వచ్చేవి. ఇప్పుడవి 500లకు పెరిగాయని, అంతర్జాతీయ కనెక్టివిటీ పెరిగిందని చెప్పారు. చైనా, సౌత్ కొరియా, ఇరాన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, స్పేయిన్ దేశాల్లో ఈ వ్యాధి అధికంగా ప్రబలిందని, ఈ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను మన దేశంలోకి అనుమతించవద్దని కేంద్రం వీసాలు రద్దు చేసిందని సిఎం తెలిపారు.

 

Actions To control the coronavirus
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News