Home కలం బతుకుల్ని దృశ్యమానం చేసిన కథలు అక్కన్నపేట రైల్వేస్టేషన్

బతుకుల్ని దృశ్యమానం చేసిన కథలు అక్కన్నపేట రైల్వేస్టేషన్

 

సృజనాత్మకత విభిన్న కళా రూపాల్లో బహిర్గతమవుతూ ఉంటది. ఆ కళారూపాల్లో కథా ప్రక్రియ ఒకటి. కథారచన బహుషా అన్ని కళారూపాల్లోకి అత్యంత సంతృప్తినిచ్చే అవుట్లెట్. అట్లా సామాజిక జీవనాన్ని ‘కథ’నంలో మారుమూలలు శోధించి దృశ్యమానం చేసిన డా.ఎయం. అయోధ్యారెడ్డి కొత్త కథల సమాహారమే అక్కన్నపేట రైల్వేస్టేషన్.

ఈ సంపుటంలోని కథలన్నీ దినవారి జనజీవనానికి సంబంధించినవి. ఇటు జీవించడాన్ని, అటు కోల్పోవడాన్ని చిత్రించినవి. ఒకపక్క ప్రశ్నించడాన్ని.. ఎదిరించడాన్ని, మరోపక్క అంగీకరించడాన్ని..సర్దుకోవడాన్ని తెలిసినవి. ఈ కథలు ప్రధానంగా మనిషి నిత్య జీవిత పోరాటాలను, బతుకు సంఘర్షణలను చిత్రించినవి. సమాజాన్ని ప్రశ్నించేవి కొన్నయితే, సంఘర్శించేవి కొన్ని. కొన్ని సందర్భాల్లో రాజీపడేవి ఇంకొన్ని. ఈ కథలు మానవ సంబంధాలను, భావోద్వేగాల తీవ్రతని తెలుపుతాయి. ఇవి మనుషుల అనుబంధాలను తరిచి, రాగద్వేష ఘర్షణలకు లోనై, సామాజిక.. ఆర్థికపరమైన సంశయాలు రేకెత్తించినవి. ఈ పుస్తకంలోని కథలు దైనందిన బతుకు వెతల నుంచి వచ్చిన నివాసిత అనుభవాలను వెల్లడిస్తాయి. ఇవి కొన్నిచోట్ల మనుషులుగా వొదిగి నడిచే మన ప్రయాణాలకు అడ్డం పడతాయి. మనిషిగా జీవన అనుభవాలను, అందుకోవలసిన ప్రమాణాలను ప్రతిబింబిస్తాయి. కథల్లో పాత్రలన్నీ ప్రధానంగా బడుగులు, బాధితులు, మధ్య తరగతి జీవులు. సంఘర్షణల మధ్య, సాధకబాధకాల నడుమ ప్రభావితం అవుతున్నవాళ్ళు. వారి జీవన గమన సూత్రీకరణలే.

సంపుటిలోని కథలు చదివితే ఇవి తమకు తాముగా పుట్టినవిగా తెలుస్తుంది. రచయిత రాయకుండా ఉండలేనితనాన్ని మనకు గ్రహింపుకు తెస్తాయి. కథల్లో వేదన వుంది. సంతోషం వుంది. ఆశావాదం వుంది. స్పష్టమైన, నిక్కచ్చి అయిన అభిప్రాయాలున్నాయి. మానవ బంధాల నిర్మాణంలో ఏర్పడే సుఖ దుఃఖాల ఇంద్రధనుస్సులున్నాయి. ఇవన్నీ వైవిధ్యంతో కూడిన కథలు. ‘అక్కన్నపేట రైల్వే స్టేషన్’ కథల్లో పేదల బతుకులున్నాయి. శ్రమజీవుల వెతలున్నాయి. ఆక్రందనలున్నాయి. కథల్లో మోసపోయిన స్త్రీలు కనిపిస్తారు. అణచివేతకు గురైన గృహిణులు, ఆత్మగౌరవంతో సాధికారత చాటుకున్న మహిళలున్నారు. ఆకలి పేగులు, అనాధ బతుకులు, అధోజగత్ జీవులు ఉన్నారు. సంపుటిలో మొదటికథ ‘చావువాసన’ ఒక కఠిన సామాజిక వాస్తవాన్ని మన కళ్ళముందు ఉంచుతుంది. నిరాదరణతో చెత్తకుప్పలు, ఫుట్ పాత్ ల పాలవుతున్న వృద్ధాప్యం ఎంత దయనీయమో చెపుతుంది. జ్వరం వచ్చిన తల్లితండ్రులు ఇంట్లో వుంటే ‘చావు వాసన’ వస్తుందని కొడుకు ముసలి తల్లిదండ్రులను నగరంలో దూర ప్రాంతంలో వదిలేసిపోతాడు.

ముసలామె జ్వరంతో వుండగా ముసలాయన మొహమాటంతో బిచ్చమెత్తుకోవడం కథను చెపుతున్న రచయిత గమనిస్తాడు. రచయిత ఆ ముసలాయన్ని చేరదీయడం, అతని కళ్ళముందే ముసలామె చనిపోవడం జరుగుతుంది.మనుషులకు ఆకలి కం టే ప్రేమరాహిత్యం భయంకరమైనవని రచయిత గ్రహిస్తాడు. తల్లిని కోల్పోయిన పన్నెండేళ్ళ పిల్లాడు తాగుబోతైన తండ్రి పెట్టే బాధలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునేందుకు అక్కన్నపేట రైల్వే స్టేషన్ కు వస్తాడు. అది గమనించిన ఒక మహిళ అతడ్ని ప్రేమగా పలుకరించి, స్వాంతన చేకూర్చి ఆత్మహత్యా ప్రయత్నాన్ని అడ్డుకుంటుంది. ఆమెకి తన కష్టాలు చెప్పుకొని ఊరట పొందుతాడు. తండ్రి మీద అతనికున్న ద్వేషభావాన్ని ఆమె పోగొడుతుంది. అతన్ని తిరిగి ఇంటికి పంపించివేస్తుంది. ఆ పిల్లోడు రెండురోజుల తర్వాత స్టేషనుకు వస్తే ఆమె కనిపించదు. తాను మరో అమ్మగా భావించిన ఆ స్త్రీమూర్తి మళ్ళీ కనిపిస్తుందేమోనన్న ఆశతో అతడు ఎదురుచూస్తూ ఉంటాడు.

దొరల దౌర్జన్యానికి, దోపిడికి బడుగువాళ్ళ జీవితాలు వాళ్ళ ప్రమేయం లేకుండానే యెట్లా అణగారి అంతరించిపోతాయన్నది కొమురయ్య బతుకు ద్వారా ‘గాలివాన’ కథ చెబుతుంది. అలాగే తనను ఎదిరించిన వాళ్ళ బతుకు బుగ్గిపాలు కావాల్సిందేనని గారడి వృత్తితో పొట్టపోసుకునే ఒక పేద, బడుగు జీవి ప్రాణాలు బలిగొన్న క్రూరుడైన మరో దొర కథ ‘పాముల నడుమ చీమ.’ ఈ ప్రపంచంలో ఆకలిని మించింది లేదన్న తత్వాన్ని చెప్పే కుర్రవాడు యాదగిరి తిండికోసం పడిన యాతన, పొందిన అవమానాలు ‘ఇడ్లీపొట్లం’ కథలో అందర్నీ అలోచింపజేస్తాయి. కడుపు నింపుకునే తాహతులేనివాళ్ళు, ఏపూటకు ఆ పూట బతుకు వెళ్లదీసేవాళ్లకు చిన్న చిన్న కోరికలు కూడా చాలాసార్లు విపరీత పరిణామాలకు దారితీస్తాయని ‘కొత్త బస్టాండు’ కథలో ఎంతో హృద్యంగా చెప్పబడింది. ప్రేమ పేరుతో మాయలు చేసి, కులం పేరుతో తప్పుకునిపోయే అభినవ దుష్యంతున్ని, అట్లాగే ప్రేమ అనే కల్లబొల్లి మాటలతో నమ్మించి ద్రోహానికి పాల్పడే వంచకున్ని పరిచయం చేసినవి ‘ఏన్ అనాధరైజ్డ్ లవ్ స్టోరీ’ , ‘ వెంటాడిన రాత్రి’ కథలు.

‘శిధిల కథ కధనం పరంగా, శిల్పపరంగా ఉత్తమస్థాయిలో సాగింది. కథలో అభిరాం, ప్రియాంక చాలా రోజులు ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటారు. అయిదేళ్ళ ఆనంద జీవితం తర్వాత అతని టెంపర్ మెంట్ కారణంగా, ఒక ఆవేశపూరిత తప్పిదం కారణంగా ఇద్దరూ విడిపోతారు. రెండేళ్ళ తర్వాత మనం మళ్ళా కలిసుందాం అని అభిరాం ప్రతిపాదిస్తాడు. తానుగా స్వతంత్రంగా బ్రతుకుతున్న ప్రియాంక వెనుదిరిగి అతని జీవితంలోకి వెళ్ళడమా.. ? అతన్ని దాటుకొని వెళ్ళడమా అనే డైలమాలో పడి చివరకు రెండోదారినే ఎంచుకుంటుంది. ఫెమినిస్టు దృక్పథంతో వచ్చిన ఈ కథలో నాయికకు తన జీవితం పట్ల, తన నిర్ణయం పట్ల స్పష్టమైన అవగాహన వుండి తగిన నిర్ణయం తీసుకుంటుంది.

‘ ఒక రచయిత మరణం’ లో గొప్ప కళాఖండం అనదగ్గ కథ రాసి సంచలనం సృష్టించాలనుకున్న ఒక వర్ధమాన రచయిత ఎంతో శ్రమించి, పరిశోధన చేసి రాసి పంపిన కథను ఒక పత్రికవారు రిజెక్టు చేయడంతో కృంగిపోతాడు. అతనిలో ఒక ఉదాసీనత, విరక్తి ఏర్పడుతుంది. అతని లక్ష్యం దెబ్బతిని ,అతని సంకల్పం కుప్పకూలిపోతుంది. అతనిలో సృజనకారుడు కనుమరుగవుతాడు. ఫలితంగా ఒక రచయిత మరణిస్తాడు. సరికొత్త వస్తువును ఎంచుకొని ఎంతో వైవిధ్యంతో రాసిన కథ ఇది. ‘రెప్పచాటు కన్నీరు’ కథలో పురుషాధిక్యత, గృహహింస, మెట్టినింట్లో భర్త మంచితనం అనే ముసుగులో కట్టుకున్న భార్యను అంతం చేసిన దయనీయ వాస్తవాన్ని రచయిత కళ్ళకు కట్టి హృదయాన్ని ద్రవీభూతం చేస్తాడు.

ఈ కథల సంపుటంలో మొత్తం పధ్నాలుగు కథలున్నాయి. అన్ని కథలూ వేటికవే కొత్త పంథాలో సాగినవి. కొన్ని ఇతివృత్తాల్లో వస్తువు ఇదివరలో వచ్చినట్లు కనిపించినా రచయిత వాటిని కొత్త కోణంలో బిగువైన కధనంలో నడిపి ఆకట్టుకుంటాడు. చాలా కథల్లో రచయిత పాత్రోచిత మాండలికాన్ని వాడి నేటివిటీకి పెద్దపీట వేశారు. పాటకులను తమలోకి లాక్కుని చెరగని ముద్ర వేయగల గొప్ప రీడబిలిటీ ఈ కథలకున్న ప్రధాన ప్లస్ పాయింట్. కథలో ఇతివృత్తాన్ని చెప్పుకుంటూ పోవడం కాకుండా దృశ్యమానం చేయడం రచయిత కలిగివున్న చేయితిరిగిన ప్రతిభను చాటుతుంది. కథనంలో అడుగడుగునా కవి త్వం వొలుకుతుంది. పోలికలు చెప్పినప్పుడు, వర్ణనలు చేసినప్పుడు చూపిన నేర్పు పాఠకుణ్ణి వెంటాడుతుంది. ‘పైన సూర్యుడు మంటల్లో కాలుతూ సజీవ దహనమవుతున్నాడు’, ‘ఆమె మూటగట్టిన నిశ్శబ్దంలా పడివున్నది’, ‘వృద్ధాప్యం ఒక అనివార్యమైన జబ్బు. ఏ వైద్యమూ నయం చెయ్యలేనిది’ ‘నిరాదరణతో.. ఒంటరితనంతో వృద్ధాప్యం ఒక జమానతులేని అనాధ’, ‘రోడ్డుమీద జనం బాక్టీరియాలా కదులుతున్నా రు’, ‘అప్పుడు టైము మధ్యా హ్నం రెండు గంటలే అయి నా అతడు సాయంత్రం ఐదు గంటలప్పటి నీడ మాదిరి కదులుతున్నాడు’ లాంటి పోలికలు, వర్ణనలు కవిత్వ పోకడలతో కొత్తగా వుండి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మొత్తంమీద చక్కటి శైలితో, బిగువైన కథనంతో సాగిన మంచి కథలు అక్కన్నపేట రైల్వే స్టేషన్.

 

కందుకూరి శ్రీరాములు
9440119245