Saturday, April 27, 2024

రైతుల వ్యతిరేక బడ్జెట్!

- Advertisement -
- Advertisement -

మోడీ నాయకత్వాన ఉన్న ఎన్‌డిఎ ప్రభుత్వం 2023 -24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను 1 -ఫిబ్రవరి 23న పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన మొత్తం బడ్జెట్ రూ. 45,03,097 కోట్లు. అప్పులు రూ. 17,86,816 కోట్లు కాగా, ద్రవ్యలోటు రూ. 17,86,816 కోట్లు. రెవిన్యూ లోటు రూ. 8,69, 855 కోట్లు. బడ్జెట్ ప్రారంభిస్తూ అమృత కాలంలో ప్రవేశపెడుతున్న బడ్జెట్‌గా మంత్రి అభివర్ణించారు. కాని అమృతం అనే పదం కన్నా పేదల, రైతుల జీవితాల్లో కటిక చేదును నింపే కాల మంటే బాగుంటుంది. మనది ఇప్పటికీ వ్యవసాయ దేశం. 68% ప్రజలు ప్రత్యక్షం, పరోక్షంగా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఇప్పటికీ వ్యవసాయ రంగమే పునాది. అలాంటి రంగానికి బడ్జెట్ కేటాయింపులు చూస్తే మోడీ ప్రభుత్వానికి వ్యవసాయం అన్నా, రైతాంగం అన్నా ఎంత చిన్నచూపో తెలుపుతున్నది. 2022 -23 ఆర్థిక బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి రూ. 1,51,521 కేటాయించగా, 2023- 24 ఆర్థిక బడ్జెట్‌లో రూ. 1,44,214 కోట్లకు తగ్గించారు. రైతాంగానికి ఇచ్చే అనేక సబ్సిడీల్లో కోత విధించారు.

సేద్యం ద్వారా రైతాంగం అధిక దిగుబడులు సాధించాలంటే రసాయనిక ఎరువుల వినియోగం తప్పని సరి. సేద్యంలో 80% పైగా చిన్న, సన్నకారు రైతు లే. రసాయనిక ఎరువుల వినియోగం వీరికి తలకు మించిన భారంగా మారింది. సస్య విప్లవకాలంలో రైతాంగం రసాయనిక ఎరువుల వాడకానికి అలవాటు చేయటానికి ప్రపంచ బ్యాంకు ఎరువులపై సబ్సిడీలు ఇచ్చేందుకు భారత ప్రభుత్వానికి ఆర్థిక సహాయాన్ని అందించింది. ఎరువుల వాడకానికి రైతులు అలవాటుపడిన తర్వాత, సబ్సిడీలు తగ్గించమని ప్రపంచ బ్యాంక్ భారత పాలకులపై వత్తిడి ప్రారంభించటంతో సబ్సిడీ తగ్గింపులు ప్రారంభమైనవి. క్రమంగా ఎరువుల ధరల నిర్ణయాన్ని ఫ్యాక్టరీ యజమానులకే అప్పగించటం, పోషకాలను బట్టి ఎరువుల సబ్సడీలు ప్రకటించటం, ఇప్పుడు సబ్సిడీల్లో కోత విధించటం ప్రపంచ బ్యాంకు సూచనల మేర జరుగుతున్నదే. 2022- 23 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,25,200 కోట్లు కేటాయించగా, 2023- 24 ఆర్థిక సంవత్సరంలో 1,75,099.92 కోట్లకు సబ్సిడీ తగ్గించారు.

కోట్ల ఎకరాల్లో సాగయ్యే వ్యవసాయాన్ని సమూలంగా మార్చేందుకు అసలు నిధులేమీ లేని పథకాన్ని కేంద్రం తెస్తున్నది. ఈ పథకానికి బడ్జెట్‌లో నిధులు కేటాయింపులు ఉండవు. ఎరువులపై ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలో కొంత తగ్గించి ఈ స్కీమ్‌కు కేటాయిస్తారు. ఫలితంగా ఎరువుల సబ్సిడీలో కోత ప్రారంభమవుతుంది. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ అంతకు ముందు విడుదల చేసిన సబ్సిడీలో మిగులు చూపిన రాష్ట్రాలకు పిఎం ప్రణావ్ నిధుల్లో 50% గ్రాంటుగా ఇస్తారు. ఈ విధంగా ప్రతి సంవత్సరం ఎరువుల సబ్సిడీని తగ్గిస్తూ పిఎం ప్రణావ్ మళ్లిస్తారు. చివరికి పూర్తిగా ఎరువుల సబ్సిడీకి మంగళం పాడతారు. మోడీ ప్రభుత్వం అనుసరించే విధానాల ఫలితంగా తీవ్ర మైన పరిణామాలు సంభవిస్తాయి. సేంద్రియ వ్యవసాయ సాగుపై పూర్తిగా సేద్యాన్ని మళ్లిస్తే దేశంలో ఆహార కొరత ఏర్పడుతుందని, సేంద్రియ వ్యవసాయం ప్రజలకు అవసరమైన ఆహార ధాన్యాల ఉత్పత్తిని సాధించలేదు, వాటి ధరలు అధికంగా ఉంటాయని అనేక మంది వ్యవసాయ ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరో వైపు ఎరువుల సబ్సిడీ లేకపోవటం వలన రైతులకు సేద్యం భారమై, వ్యవసాయం నుంచి వైదొలిగే పరిస్థితి ఏర్పడుతుంది. పిఎం కిసాన్ యోజన పథకానికి రూ. 68 వేల కోట్ల నుండి రూ. 60 వేల కోట్లకు బడ్జెట్ తగ్గింపులు ఉన్నాయి. పిఎం కిసాన్ సమ్మాన్ పథకం ద్వారా సేద్యం కోసం ముందుగానే పెట్టుబడి అందిస్తున్నామని, రైతాంగానికి దీని ద్వారా సేద్యపు ఖర్చు తగ్గుతుందని మోడీ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిరంతరం ప్రచారం చేస్తూనే ఉంది. అది ఆచరణలో రైతాంగానికి ఎంత వరకు ఉపయోగ పడిందన్నది చర్చనీయాంశమైనా ఈ పథకాన్ని కూడా మోడీ ప్రభుత్వ అటకెక్కించే ప్రయత్నం చేస్తున్నది. అందుకు బడ్జెట్‌లో తగ్గిన కేటాయింపులే నిదర్శనం. గత ఆర్ధిక సంవత్సరంలో ఈ పథకానికి రూ. 68 వేల కోట్లు కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్ లో రూ. 60 వేల కోట్లు మాత్రమే కేటాయించారు. అర్హులైన రైతులందరికీ ఈ పథకం ద్వారా పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పిన మోడీ ప్రభుత్వం ఇప్పటికే చాలా మంది రైతులను వివిధ వంకలతో ఈ పథకం నుంచి తప్పించింది. పథకానికి నిధులు తగ్గించటం ద్వారా మరి కొంత మంది రైతులను ఇందుకు దూరం చేస్తుంది.

పిఎం ఫసల్ బీమా పథకం ద్వారా పంటల బీమా కోసం రైతులు చెల్లించాల్సిన ఫ్రీమియంలో రైతులు నామమాత్రంగా చెల్లిస్తే చాలని మిగతా ఫ్రీమియం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తాయని మోడీ ప్రభుత్వం ప్రకటించింది. రైతులందరూ ఈ పథకంలో చేరటం ద్వారా పంట నష్ట పరిహారం పొందుతారని చెప్పింది. ఈ పథకం వలన రైతుల కన్నా, దేశ, విదేశీ బీమా కంపెనీలు రూ. వేల కోట్లు లాభాలు గడించాయి. రైతులకు ఇచ్చిన అప్పులకు ఈ పథకం బ్యాంకులకు గ్యారంటీ ఇచ్చింది. గత ఆర్థిక బడ్జెట్ లో ఈ పథకానికి రూ. 15,500 కోట్లు కేటాయించగా, ఈ బడ్జెట్‌లో రూ. 13,625 కోట్లు మాత్రమే కేటాయింపు జరిగింది. దీన్ని గమనిస్తే తాను చెల్లించే ఫ్రీమియం తగ్గించుకుని రైతలపై భారం మోపనుంది. ఈ బడ్జెట్‌లో పంటల కొనుగోళ్లకు సంబంధించిన కేటాయింపుల, మార్కెట్ యార్డులకు నిధుల కేటాయింపులకు సంబంధించిన ప్రతి పాదనే లేదు. అంటే పంటల కొనుగోళ్లకు బాధ్యత వహించనని చెప్పటమే. 2023 -24 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ వ్యవసాయ రంగాన్ని, రైతాంగాన్ని సంక్షోభమనే ఊబిలో మరింత లోతుకు లాక్కెలుతుంది. రైతాంగాన్ని సేద్యం నుంచి దూరం చేసేందుకు తీవ్రతరం చేస్తుంది. రైతాంగ వ్యతిరేకమైన ఈ బడ్డెట్‌ను యావన్మంది రైతాంగం వ్యతిరేకించాలి.

బొల్లిముంత
సాంబశివరావు
9885983526

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News