Monday, April 29, 2024

ఆగస్టు 5న అపెక్స్ కమిటీ సమావేశం

- Advertisement -
- Advertisement -

Apex council meeting on Telangana Andhra Pradesh

 వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం
పాల్గొననున్న తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు
కృష్ణా, గోదావరి జల వివాదాలే ప్రధాన ఎజెండా
పోతిరెడ్డిపాడు సామర్థం పెంపును అడ్డుకోనున్న తెలంగాణ
ఎపి 203 జిఒను రద్దు చేయాలనేది ప్రధాన డిమాండ్

హైదరాబాద్: తెలుగురాష్ట్రాల మధ్య ఏర్పడిన జల వివాదాలపై అపెక్స్ కౌన్సిల్ సమావేశం కానుంది. ఇప్పటికే ఆంధ్ర, తెలంగాణ మధ్యలో జలవివాదాలు ముదిరిపోయాయి. తెలంగాణ జలప్రయోజనాలకు గండికొడుతూ ఆంధ్ర తలపెట్టిన పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు ఈ సమావేశంలో కీలకంగా మారనుంది. ఇప్పటికే తెలంగాణ సాగునీటి శాఖ పోతిరెడ్డిపాడు సామర్థం పెంపు అంశాన్ని తప్పుబట్టి న్యాయపోరాటానికి సిద్ధమైంది. కేంద్ర జలశక్తి మంత్రి చైర్మన్‌గా, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా గల అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించే అవకాశాలున్నాయి. కృష్ణా, గోదావరి బోర్డు పరిధి, నిర్వహణకు సంబంధించిన మాన్యువల్, గోదావరి బోర్డు పరిధి, నిర్వహణకు సంబంధించిన మాన్యువల్, గోదావరి నుంచి కృష్ణాలోకి మళ్లించే నీటిలో వాటా, ఆంధ్రప్రదేశ్ పునర్‌విభజన చట్టానికి విరుద్ధంగా కృష్ణాబోర్డు సాంకేతిక సిఫార్సు,అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండానే నిర్మాణాలు చేపట్టారంటూ పరస్పరం చేసుకున్న ఫిర్యాదుల గురించి చర్చకు వచ్చే అవకాశాలున్నాయి.

రాయలసీమ ఎత్తిపోతల పథకం, పాలమూరు రంగారెడ్డి తదితర ప్రాజెక్టుల అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరగనుంది. అయితే తెలుగు రాష్ట్రాల జలవివాదాలపై 2014లో అంధ్రప్రదేశ్ పునర్విభజన అనంతరం ఏర్పాటైన అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఇప్పటివరకు ఒకసారి ఢిల్లీలో జరిగింది. ఆ సమావేశంలో కృష్ణా, గోదావరి వాటాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయాలను సిఎం కెసిఆర్ కేంద్రం దృష్టికి తీసుకువచ్చారు. నూతనంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రానికి జలవనరుల కేటాయింపుల్లో సరైన న్యాయం జరగడం లేదని ఆయన కేంద్రాన్ని తప్పుబట్టారు. అయితే వాటాల అంశం ఇప్పటివరకు తేల్చని కేంద్ర జలశక్తి మరోసారి అపెక్స్ సమావేశానికి సిద్ధం అవుతుంది. అయితే ఆగస్టు 5న జరగ నున్న ఈ సమావేశంలో ఆంధ్ర అక్రమ ప్రాజెక్టులు, జలదోపిడిపై తెలంగాణ సర్కార్ తీవ్రంగా స్పందించే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

తెలంగాణ జలప్రయోజనాలకు గండికొడుతూ ఆంధ్రప్రదేశ్ అక్రమంగా నిర్మింప తలపెట్టిన పోతిరెడ్డిపాడు సామర్థం పెంపు ప్రాజెక్టులను ఈ సమావేశంలో తీవ్రంగా ఎండగట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతుంది. నదీజలాలపై జరిగిన అన్యాయాల ఫలితంగానే తరతరాలుగా తెలంగాణ వెనుకబడి ఉండటానికి ప్రధానకారణం. తెలంగాణ సిద్ధించినప్పటికీ ఇంకా ఆంధ్ర జలదోపిడికి పాల్పడితే సహించేది లేదని ఇప్పటికే తెలంగాణ సాగునీటిశాఖ స్పష్టం చేసింది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సిఎంగా ఉన్నప్పుడు శ్రీశైలం నాలుగు తూముల నుంచి 44 టిఎంసిల నీరు తలిస్తే ప్రస్తుతం అక్రమంగా 10తూములు ఏర్పాటు చేసి 88 వేల క్యూసెక్కుల నీటిని తరలించేందుకు ఆంధ్ర ప్రభుత్వం 203 జిఒను విడుదల చేసింది. ఈ జిఒను తక్షణం రద్దు చేయాలని అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ పట్టుబట్టనుంది.

అలాగే పోలవరం జాతీయప్రాజెక్టు నుంచి తెలంగాణకు ట్రిబ్యునల్ అవార్డు మేరకు రావల్సిన 45 టిఎంసిలపై ఈ సమావేశంలో తెలంగాణ పట్టుబట్టనుంది. కృష్ణా జలాలపై తెలంగాణ హక్కులను కాపాడాలని డిమాండ్ చేయనుంది. ఉమ్మడి రాష్ట్రంలోని నీటి వాటాలను ఇప్పుడు పొందాలంటే ఎలా సాధ్యమవుతుందని ఎపిని తెలంగాణ నిలదీయనుంది. కృష్ణా జలాల్లో 512 టిఎంసిల హక్కు ఆంధ్రకు లేదని తెలంగాణ వాదించనుంది. అనేక సంవత్సరాల నుంచి తెలంగాణకు జరగుతున్న అన్యాయాలను, ఆంధ్ర జలదోపిడిని అపెక్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి తీసుకువెళ్లనుంది. అలాగే గతంలో జరిగిన అపెక్స్‌కౌన్సిల్ తీర్మాణాలను కూడా మరోసారి కౌన్సిల్ దృష్టికి తీసుకువచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయి సమాచారంతో సిద్ధంగా ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News