Monday, April 29, 2024

విద్యా సంస్థల్లో కౌన్సిలర్ల నియామకం జరిగేనా?

- Advertisement -
- Advertisement -

నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు భారత ప్రథమ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ. నేటి ఈ బాలలను సురక్షితంగా కాపాడుకుంటేనే రేపటి మెరుగైన భారతాన్ని నిర్మించగలుగుతాం. కాని ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే బాలలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్టు కనిపిస్తున్నది. ఒకవైపు గణనీయ సంఖ్యలో విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతుంటే, మరొక వైపు పాఠశాల స్థాయి పిల్లల్లో మాదకద్రవ్యాల వినియోగం వెలుగు చూస్తున్నది. తెలిసీ తెలియని వయసులో ఇటువంటి చర్యలకు పాల్పడుతూ తమ జీవితాలను బలి చేసుకుంటున్నారు నేటి బాలలు. ఇటీవల వరుసగా నిరుపేద వర్గాల పిల్లలు చదువుకునే గురుకుల విద్యాలయాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు, ప్రభుత్వ పాఠశాలల్లో వెలుగు చూసిన మాదకద్రవ్యాల వినియోగం పేద పిల్లల భవిష్యత్‌పై పౌర సమాజం లో భయాందోళనలను కలుగజేస్తున్నది.

నిజానికి దేశ వ్యాప్తంగా ప్రతి ఏటా విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య పెరిగిపోతూనే ఉన్నది. జాతీయ నేర నమోదు విభాగం -2023లో వెల్లడించిన గణాంకాల ప్రకారం ఒక్క 2022 సంవత్సరంలోనే దేశ వ్యాప్తంగా 10 వేలకు పైగా 18 సంవత్సరాలలోపు పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 2022లో జరిగిన ఆత్మహత్యల్లో దాదాపు 8% విద్యార్థులవే. పైగా ఇందులో దాదాపు 24% మంది విద్యార్థులు 9-, 10వ తరగతి లోపు చదువుతున్న చిన్నారులే. ఈ ఆత్మహత్యలకు ప్రధాన కారణం ఒత్తిడిని జయించలేకపోవడమే అని అనేక సందర్భాల్లో రుజువు అయింది. ప్రస్తుతం విద్యా బోధన విద్యార్ధి కేంద్రంగా జరగడం లేదనేది నిర్వివాదాంశం. 2001లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు జరగడంతో ప్రొఫెసర్ నీరదా రెడ్డి ఆధ్వర్యంలో నియమించిన కమిటీ ర్యాంకులే ధ్యేయంగా విద్యా సంస్థలు, తల్లిదండ్రులు విద్యార్థులపై ఒత్తిడి పెంచడమే ఆత్మహత్యలకు ప్రధాన కారణం అని తేల్చింది.

నేటికీ ర్యాంకులే ధ్యేయంగా చూస్తున్నారు తప్పితే విద్యార్థులు పడుతున్న మనోవేదనను ఇటు ఉపాధ్యాయులు, అటు తల్లిదండ్రులు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు.మెరుగైన ఫలితాలు సాధించని విద్యార్థులు తల్లిదండ్రులు తమపై పెంచుకున్న ఆశలను నెరవేర్చలేకపోతున్నామని ఆత్మన్యూనత భావానికి లోనవుతూ బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. విద్యార్థుల్లో మానసిక సంఘర్షణలను తొలగించి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి విద్యా సంస్థలు తీసుకుంటున్న చర్యలు శూన్యంగానే కనబడుతున్నాయి. చాలా వరకు విద్యాసంస్థల్లో తాత్కాలికంగా మోటివేషన్ తరగతులు నిర్వహిస్తున్నారే తప్ప సుస్థిరమైన ప్రణాళికలపై దృష్టి సారించడం లేదు. 1993 లోనే యష్ పాల్ కమిటీ Leaning Without Burden పేరుతో ఒక నివేదికను రూపొందించి అందులో పాఠ్యంశాల రూపకల్పన, హోమ్ వర్క్, పుస్తకాల బరువు వంటి అంశాలపై సూచనలు చేసింది.

2001లో నీరదా రెడ్డి కమిటీ స్టడీ అవర్స్ 8 గంటలకు కుదించడం, తరచుగా విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించడం, తగిన విశ్రాంతిని కల్పించడం వంటి కీలక సూచనలు చేసింది. కానీ నేటికీ అవి అమలుకు మాత్రం నోచుకోవడం లేదు. మారుతున్న పరిస్థితిలో ఉపాధి అవకాశాలకు సంబంధించిన అంశాలను మాత్రమే పాఠ్యప్రణాళికల్లో చేరుస్తూ సామాజిక అంశాలు, మానవీయ విలువలు, జీవన నైపుణ్యాలు వంటి నిజ జీవితానికి సంబంధించిన అంశాలను పూర్తిగా విస్మరిస్తున్నారు. దీంతో సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలియక, భావోద్వేగాలకు లోనవుతూ అర్ధాంతరంగా అసువులు బాస్తున్నారు. మరొకవైపు రాష్ట్రంలో ఇటీవల బయటపడిన మాదక ద్రవ్యాల వినియోగం ఘటన రాష్ట్రాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. గతంలోనూ అనేక సందర్భాలలో విద్యార్థులు మాదక ద్రవ్యాలు తీసుకున్న ఘటనలు ప్రధాన నగరాల్లో, ప్రొఫెషనల్ కళాశాలల్లో బయటపడ్డాయి. కానీ వాటితో పోలిస్తే ఇది భిన్నం.

ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న జగిత్యాల వంటి గ్రామీణ జిల్లా కేంద్రంలో, అందునా ప్రభుత్వ పాఠశాలలకు చెందిన బాలికలు గంజాయికి అలవాటు పడడం విస్మయాన్ని కలిగిస్తున్నది. కొద్ది మంది అసాంఘిక శక్తులు అమాయకపు బాలికలను గంజాయికి బానిసలుగా చేసి, వారి పేదరికాన్ని ఆసరాగా చేసుకొని డబ్బులు ఆశజూపి వారి మీద లైంగిక దాడులకు పాల్పడినట్టు రుజువైంది. దాదాపు ఏడాది కాలంగా 10 మంది బాలికలు గంజాయి సేవిస్తున్నా ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు గాని, అటు ఉపాధ్యాయులు గానీ దానిని గుర్తించకపోవడం వారి మధ్య ఉన్న దూరాన్ని స్పష్టంగా తెలియపరుస్తున్నది.

అయితే ఇది కేవలం బయటపడిన ఒక సంఘటన మాత్రమే. అమాయకపు పిల్లలే లక్ష్యంగా పని చేస్తున్న అసాంఘిక శక్తుల వల్ల ఇంకా ఎంతమంది చిన్నారుల భవిష్యత్ ప్రమాదంలో ఉన్నదో అంతపట్టని విషయమే. పిల్లల గుణాత్మక అభివృద్ధిలో సామాజీకరణ ఏజెంట్లుగా కుటుంబం, పాఠశాలల పాత్ర కీలకం. అయితే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ క్షీణించి విచ్ఛిన్న కుటుంబాలుగా ఏర్పడిన తర్వాత పిల్లలపై పర్యవేక్షణ తగ్గిపోయింది అన్నది వాస్తవం. దీనికి కుటుంబ సామాజిక, ఆర్థ్ధిక నేపథ్యం కూడా ఒక కారణం. బాల బాలికల్లో మాదక ద్రవ్యాల వంటి చెడు వ్యసనాలు మరింతగా విస్తరించక ముందే నివారించాల్సిన అవసరం ఉంది. అందుకు సామాజిక, మానసిక అంశాలపై అవగాహన కలిగిన సోషల్ వర్కర్లను, మానసిక నిపుణులను విద్యాసంస్థల్లో కౌన్సిలర్లుగా నియమించాలి. అప్పుడే విద్యార్థుల బంగారు భవిష్యత్‌ని తీర్చిదిద్దగలుగుతాం. ఆ దిశగా ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలను తీసుకోవాలి.

అనిల్ మేర్జ
8106958818

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News