Monday, April 29, 2024

జయశంకర్ సార్ యాదిలో

- Advertisement -
- Advertisement -

అది 1953 వరంగల్ నగరంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు కోసం విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉద్యమిస్తున్నారు. డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి అంటూ నినాదాలు చేస్తున్నారు. ఆ గుంపులో ఒక విద్యార్థి నోటి నుండి అనుకోకుండా యూనివర్శిటీ ఏర్పాటు చేయాలని వచ్చింది. యాదృచ్ఛికంగా వచ్చిన ఆ నినాదాన్ని విని తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు నవ్వారు. కానీ 30 సంవత్సరాల తర్వాత యూనివర్శిటీ ఏర్పడ్డది అదే యూనివర్శిటీకి యాదృచ్ఛికంగా యూనివర్శిటీ ఏర్పాటు చేయాలని పలికిన విద్యార్థి ఉపకులపతి అయ్యాడు. అదే నేటి కాకతీయ యూనివర్శిటీ. ఉపకులపతి పేరే ప్రొ. కొత్తపల్లి జయశంకర్. ‘అబ్ తో ఏక్ హీ ఖ్వాయిష్ హై, వో తెలంగాణ దేఖ్నా ఔర్ మర్జాన’ (ఇప్పుడైతే నాకు ఒకే ఒక కోరిక మిగిలింది తెలంగాణ ఏర్పాటు కళ్ళారా చూడాలి, ఆ తర్వాత చనిపోవాలి).
నిత్యం తన మిత్రులతో అంటూ ఉండేవారు. మా వనరులు మాకున్నాయి, మా వనరులపై మాకు పెత్తనం కావాలి. యాచక దశ నుండి శాసక దశకు తెలంగాణ రావాలి. మా తెలంగాణ మాగ్గావాలె. 50 సంవత్సరాలకు పైగా ఇదే ఆకాంక్ష, ఇదే శ్వాస, ఇదే లక్ష్యం, ఇదే జీవితం, ఇందులోనే మరణం అనీ శ్వాసించిన తెలంగాణ పిపాసి, తెలంగాణ కారణజన్ముడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్. తారీకు 06 ఆగస్టు 1934 సంవత్సరంలో పెద్దాపూర్ గ్రామ శివారు అక్కంపేట గ్రామం ఆత్మకూరు మండలం ప్రొ. జయశంకర్ భూపాలపల్లి జిల్లా లో తల్లి మహాలక్ష్మి తండ్రి లక్ష్మీకాంతారావుకు రెండవ సంతానంగా జన్మించారు. సార్‌కు ముగ్గురు అన్నదమ్ములు, ముగ్గురు అక్క చెల్లెళ్లు. సార్‌కు చిన్ననాటి నుండి ప్రగతిశీల భావజాలం ఎక్కువ. ఆ రోజుల్లో నే నిజాం నిరంకుశత్వాన్ని అన్యాయాన్ని వ్యతిరేకించినవాడు సార్. తాను ఆరో తరగతి చదివేటప్పుడు స్కూల్లో నిజాంను పొగుడుతూ పాడిన పాటను బహిష్కరించి వందేమాతరం అని నినదించారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, హైస్కూల్, ఇంటర్మీడియట్ వరకు హనుమకొండ వరంగల్‌లో జరిగినది. డిగ్రీ హైదరాబాద్‌లో, బనారస్ హిందూ యూనివర్శిటీ, అలీఘర్ ముస్లిం యూనివర్శిటీల నుండి ఆర్థికశాస్త్రంలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చదివారు. ఉస్మానియా యూనివర్శిటీ నుంచి పిహెచ్‌డి చేశారు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషులో మంచి పరిజ్ఞానం ఉండేది.
1975 నుండి 1979 వరకు సికెఎం కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేయడం చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారం ఎందుకంటే ఆ కళాశాలలో విప్లవ సంఘాల విద్యార్థులు ఎక్కువగా ఉంటారనేది అప్పటి మాట. సార్‌తో 35 ఏళ్ల అనుబంధం ఉన్న ప్రముఖ సాహితీవేత్త రామశాస్త్రి ఏమంటారంటే విద్యార్థులు, ఉపాధ్యాయుడిని గుర్తుపెట్టుకోవడం చాలా సులువు. కానీ విద్యార్థులను ఉపాధ్యాయుడు గుర్తుపెట్టుకొని వారి పేర్లు పెట్టి మరీ పిలిచి మాట్లాడేవాడు అంటే మామూలు విషయం కాదని సార్ గురించి చెప్పారు. అది సార్ గొప్పతనం, నిరాడంబర జీవితానికి నిదర్శనం. 1979 నుండి 1981 వరకూ కాకతీయ యూనివర్శిటీ రిజిస్ట్రార్‌గా 1982 నుండి 1991 వరకు సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ రిజిస్ట్రార్, 1991 నుండి 1994 వరకు కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పని చేశారు. సార్ శిష్యులు దేశవిదేశాల్లో చాలామంది ఉన్నారు, ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించారు వారిలో కాకతీయ యూనివర్శిటీ ప్రొ. లింగమూర్తి, శ్రీ కూరపాటి వెంకటనారాయణ, ఫ్రీ సీతారామ రావు. సార్‌కు అప్పటి ఆర్.బి.ఐ గవర్నర్, మాజీ ప్రధానమంత్రి అయిన డా. మన్మోహన్ సింగ్‌తో మంచి స్నేహమే ఉండేది. అందువల్లనే సార్ కాకతీయ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ గా ఉన్నప్పుడు జరిగిన కాన్వకేషన్‌కు డా. మన్మోహన్ సింగ్‌ని ఆహ్వానించారు. సార్ ఆహ్వానాన్ని మన్నించి వారు కాన్వకేషన్ ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. సార్‌కు యుపిఎ ప్రభుత్వంలో రాజ్యసభ, ప్లానింగ్ కమిషన్ నెంబర్ రావడం తప్పిపోయాయి. కానీ నేషనల్ కమిషన్ ఫర్ ఎంట్ర్పజెస్ ఫర్ రూరల్ ఆర్గనైజేషన్ సభ్యుడిగా నియమించబడ్డారు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ పదవిలో తెలంగాణకు అడ్డురానంత వరకు మాత్రమే ఉంటాను. ఒకవేళ ఇది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఇబ్బంది అంటే కొనసాగను అంటూ షరతు విధించి మరీ, పై పదవిలో చేరాడు. 1999 నుండి 2000 వరకు అమెరికాలో ఉంటూ తెలంగాణ ప్రజలందరికీ సహకరిస్తూ తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతను, ఉద్యమం గురించి అవగాహన కల్పిస్తూ అమెరికాలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (టిడిఎఫ్) ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటులో భాగంగా నేటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జయశంకర్ సార్ మార్గదర్శకత్వాన్ని సమ్మతిస్తూ వారి సలహాలను స్వీకరిస్తూ తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించారు. ఐక్యవేదిక వ్యవస్థాపకులు నువ్వు కూడా పని చేశారు. 2009 తెలంగాణ రాష్ట్రం కోసం కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేసిన దీక్షకు మద్దతు తెలిపారు.

ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో కల్వకుంట్ల చంద్రశేఖర రావుకి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.ఆ సమయంలో ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థి లోకం ఇచ్చిన అసెంబ్లీ ముట్టడి పిలుపుతో అప్పటి హోం మంత్రి పి చిదంబరం, యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ జయశంకర్ సార్‌తో మాట్లాడి తెలంగాణ ప్రక్రియ ఆరంభమైందని అర్ధరాత్రి ప్రకటన విడుదల చేశారు. తెల్లవారితే అసెంబ్లీ ముట్టడి. సార్ ఉస్మానియా యూనివర్శిటీ గురించి ఏమన్నారంటే ‘ఉస్మానియా యూనివర్శిటీనీ తలుచుకుంటే తెలంగాణ వాడినైనందుకు చాతి ఉబ్బుతుంది. ఎన్నెన్నో పోరాటాలకు, ఆరాటాలకు వేదికయ్యింది. ఉస్మానియా యూనివర్శిటీ అంటే అందరికీ చెట్లు, బిల్డింగులు కనిపిస్తాయి. కానీ నాకు మాత్రం మొన్నటికి మొన్న తెలంగాణ కోసం అమరులైన అనేక మంది విద్యార్థులు ఆ చెట్ల సాక్షిగా కదులుతూ కనిపిస్తారు. దుఃఖం ఒస్తది. అయితే యావత్తు తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచే అదృష్టం ఎంతమందికి దక్కుతుంది. వాళ్లకు మరణం లేదు. అదే ఉస్మానియా యూనివర్శిటీలో డిసెంబరు 9 ప్రకటన తర్వాత పిల్లలు జరుపుకున్న సంబరం నా జీవితంలో మర్చిపోలేని గొప్ప జ్ఞాపకం అని ఆయన గుర్తు చేసుకున్నారు’. నేటికీ తెలంగాణ యావత్ విద్యార్థి లోకం సార్‌ను యాది చేసుకుంటూనే ఉంటుంది.
1952లో వచ్చిన నాన్ ముల్కీ ఉద్యమంలో భాగమైన ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అంటూ ఉద్యమించారు. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడే రోజులు కావు అయినప్పటికీ 1954లో ఫజల్ అలీ కమిషన్ రిపోర్టు ఆధారంగా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర విలీనాన్ని వ్యతిరేకించారు.1969లో వచ్చిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో చాలా క్రియాశీలకంగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడక ముందు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే ధ్యేయంగా చాలా పార్టీలు ఏర్పడ్డాయి. వారందరూ కూడా సార్ సలహాలు, సూచనలు తీసుకునేవారు. అయితే తెలంగాణ పోరాటంలో ఎందరో నేతలను కలిసినప్పటికీ కేవలం కె. చంద్రశేఖర రావు మాత్రమే నన్ను ఇంప్రెస్స్ చేయగలిగారు అని జయశంకర్ సార్ అన్నారు. మన ముఖ్యమంత్రిని సార్ రావు సాబ్ అనేవారు. అది మన ముఖ్యమంత్రి చంద్రశేఖర రావుకి తెలంగాణ పై ఉన్న పరిజ్ఞానం, నిబద్ధత, అంకితభావం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఎందరో నాయకులు ప్రయత్నించారు. కానీ తెలంగాణ అనేది కేవలం మన ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే సాధ్యమైంది అని చెప్పవచ్చు. అందుకే కావచ్చు సార్‌ను బాగా ఇంప్రెస్ చేయగలిగారు. దేశపతి శ్రీనివాస్ మాటల్లో చెప్పాలంటే సార్ ఆలోచనల్లో ఎంత గాంభీర్యం ఉంటుందో మాటల్లో అంత చమత్కారం ఉంటుంది అంటారు. ఒకసారి కెసిఆర్ నివాసంలో టి ఇవ్వడానికి ఒకరు వచ్చి సారును షుగర్ లేకుండా టీ ఇవ్వాలా అని అడిగారట దీనితో సార్ ‘ఐ కెన్ టేక్ ఎ కప్ ఆఫ్ షుగర్ విత్ అవుట్ టీ ఆల్సో’ అని నవ్వుతూ అన్నాడట. నేను ఏది వదిలిపెట్టిన రెండింటినీ మాత్రం వదిలిపెట్టను అవి శనివారం ఉపవాసం, తెలంగాణ వాదం. ఇది వారి నియమ నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనం. వారి తనువెల్లా తెలంగాణ ధ్యాస కాబట్టి వారు తెలంగాణపై 1. తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్ 2. తెలంగాణలో ఏం జరుగుతోంది 3. వక్రీకరణలు వాస్తవాలు 4. తల్లడిల్లుతున్న తెలంగాణ (వ్యాస సంపుటి) 5. తెలంగాణ (ఇంగ్లీష్) మొదలగు రచనలు చేశారు.చివరి రెండు సంవత్సరాలు సార్ గొంతు కేన్సర్‌తో బాధ పడ్డాడు. హైదరాబాదులో గొంతు కేన్సర్‌కు చికిత్స తీసుకున్నప్పటికీ అది నయం కాలేదు. అప్పుడు సార్ డాక్టర్లను మీరు చేయాల్సిందల్లా చేశారు కానీ నేను ఈ సమయంలో ఇక్కడ ఉండలేను నేను వరంగల్ కు పోతాను నన్ను పంపండి అంటూ తన పురిటిగడ్డ మీద మమకారం తో వరంగల్‌కు వచ్చారు. తన ఇంట్లోనే డాక్టర్లు ట్రీట్‌మెంట్ చేశారు. కానీ 2011 జూన్ 21 తారీకు నాడు సార్ కలలుగన్న తెలంగాణ చూడకుండానే బ్రహ్మచారిగా కన్నుమూశారు. ఆజన్మ బ్రహ్మచారిగా నిరంతరం తెలంగాణ గురించి ఆలోచిస్తూ, తెలంగాణ సాధన కొరకు పాటుపడుతూ, అందరికీ తెలంగాణ గురించి అవగాహన కల్పిస్తూ ఉండటాన్ని చూసి సార్‌ను అందరూ తెలంగాణ సిద్ధాంతకర్త అని అంటుంటే దయచేసి నన్ను తెలంగాణ సిద్ధాంతకర్త అని అనవద్దు అన్నాడు. సార్ గౌరవార్ధం తెలంగాణ ప్రభుత్వం అగ్రికల్చర్ యూనివర్శిటీకి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్శిటీ గా, కొత్తగా ఏర్పడిన భూపాలపల్లి జిల్లాకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాగా నామకరణం చేయడం జరిగింది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ అన్ని రంగాలలో సర్వతోముఖాభివృద్ధి చెందినప్పుడే వారు కలలుగన్న నిజమైన తెలంగాణ సాకారం అయినట్లు.

Article about Professor Jayashankar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News