Saturday, April 27, 2024

నిరుద్యోగం, నిరుపేదరికం!

- Advertisement -
- Advertisement -

Covid 19 Lockdown in India

 

కరోనా వైరస్‌పై యుద్ధానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారు. లాక్‌డౌన్ దెబ్బ వల్ల దేశ వ్యాప్తంగా ఇప్పుడు సరికొత్త పేదరికం చోటు చేసుకుంది. మార్చి 25 నుంచి లాక్‌డౌన్ అమలులో ఉంది. దేశంలోని 12 నగరాల్లో ఒక ప్రభుత్వ సంస్థ నిర్వహించిన సర్వేలో, ముఖ్యంగా మురికివాడల్లో నిర్వహించిన సర్వేలో తెలిసిన వివరాలివి. దారిద్య్రరేఖకు దిగువన బతుకున్న ప్రజలు దేశంలో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఇంకా అనేక మంది దారిద్య్రరేఖకు దిగువన బతికే స్థితికి నెట్టివేయబడ్డారు. కొత్తగా అనేక మంది నిరుపేదలుగా మారిపోయారు. నిన్నటి వరకు కొద్దోగొప్పో జీవనోపాధి ఉన్నవారు కూడా ఇప్పుడు దయనీయస్థితికి జారిపోయారు. కొత్తగా దారిద్య్రరేఖకు దిగువ స్థాయికి పడిపోయిన వారిలో 95.3 శాతం కుటుంబాలకు ప్రధాన జీవనోపాధి ఇప్పుడు నాశనమైపోయింది. బతుకు గడపడం ఎలాగో తెలియని స్థితిలో ఉన్నారు. దేశంలోని 12 నగరాల్లో దారిద్య్రరేఖకు దిగువన బతుకున్న కుటుంబాల్లో 95.8 శాతం కుటుంబాలకు ప్రధాన జీవనోపాధి పూర్తిగా దెబ్బతింది. లాక్‌డౌన్ వల్ల వాటిల్లిన ఈ దయనీయస్థితిని సర్వే బట్టబయలు చేసింది.

లాక్‌డౌన్ వల్ల జీవనోపాధి కోల్పోయినవారిలో స్వయం ఉపాధితో బతుకుతెరువు వెదుక్కున్నవారు, రోజుకూలీలు ఎక్కువగా ఉన్నారు. స్వయం ఉపాధితో బతుకుతున్న కుటుంబాల్లో 98.9 శాతం కుటుంబాలు ఇప్పుడు దిక్కుతోచని స్థితికి నెట్టివేయబడ్డాయి. వారి బతుకు తెరువు పూర్తిగా నాశనమైంది. అలాగే రోజు కూలీతో పొట ్ట నింపుకునే కుటుంబాల్లో 97.6శాతం కుటుంబాలు అన్నమో రామచంద్రా అని అలమటించే స్థాయికి చేరుకున్నాయి. గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ క్రింద పని చేసే స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అర్బన్ ఎఫైర్స్, చెన్నైలోని స్వచ్ఛంద సంస్థ వరల్డ్ విజన్ కలిసి ఈ సర్వే నిర్వహించాయి. అనంతనాగ్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, గౌహతి, హైదరాబాద్, ఇండోర్, జైపూర్, కంచీపురం, కోల్‌కతా, ముంబయి, శ్రీనగర్ పట్టణాల్లో కోవిద్ 19 వల్ల మురికివాడలపై ప్రభావాన్ని అధ్యయనం చేశారు. ఏప్రిల్ 24 నుంచి మే 7 వరకు ఈ అధ్యయనం జరిగింది. 1157 కుటుంబాలను ప్రశ్నించి వివరాలు రాబట్టారు. ఈ ప్రశ్నలు, ఇంటర్వ్యూలు, టెలీఫోన్ సంభాషణల రూపంలో జరిగాయి. ప్రభుత్వ సర్వే ప్రకారం సర్వే చేసిన కుటుంబాల్లో 85.3 శాతం కుటుంబాలు జీవనోపాధిని కోల్పాయామని తెలియజేశాయి. కాగా దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాల్లో 91.4 శాతం బతుకుతెరువు కోల్పోయారు. కొత్తగా నిరుపేదలుగా మారినవారు, లేదా కొత్తగా దారిద్య్రరేఖ క్రిందికి చేరిన నిరుపేదలు, పేదలైనప్పటికీ దారిద్య్రరేఖకు కాస్త ఎగువన ఉన్న కుటుంబాల్లో పరిశీలిస్తే 86.2 శాతం కుటుంబాలు జీవనోపాధిని కోల్పోయాయి. ఇక పేదరికంలో లేని కుటుంబాలను పరిశీలిస్తే, ఈ కుటుంబాల్లో కూడా 75.3 శాతం కుటుంబాలు బతుకు తెరువు కోల్పోయాయి.
దేశం మొత్తం మీద సర్వే జరిగిన 12 పట్టణాల్లో అనంతనాగ్ వంటి చిన్న పట్టణాలు కూడా ఉన్నాయి. అనంతనాగ్, జైపూర్, కంచీపురం, శ్రీనగర్ చిన్న పట్టణాల కోవలోకే వస్తాయి. ఈ పట్టణాల్లో ఉపాధి నష్టం చాలా ఎక్కువగా ఉంది. పెద్ద పెద్ద నగరాలు, అంటే, ఢిల్లీ, ముంబయి వంటి నగరాల్లో ఉపాధి నష్టం కాస్త తక్కువగానే ఉంది. పెద్ద నగరాల్లో చాలా మందికి జీతాలు సరిగా అందకపోవడం వంటి సమస్యలున్నప్పటికీ, చిన్న పట్టణాలతో పోలిస్తే ఉపాధి నష్టం తక్కువగా కనబడింది. మురికివాడల్లో అనేక కుటుంబాల్లో బతుకుతెరువు కోల్పోవడం వల్ల కుటుంబ ఆదాయం పూర్తిగా అడుగంటింది. ఫలితంగా గృహహింస పెరిగిందని కూడా సర్వే తేల్చి చెప్పింది. లాక్‌డౌన్ తర్వాత ఈ కుటుంబాల్లో గృహ హింస కేసులు 40 శాతం పెరిగాయి. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అర్బన్ ఎఫైర్స్ లేదా జాతీయ పట్టణ వ్యవహారాల సంస్థ ఒక ఆన్‌లైన్ సెమినారులో ఈ విషయాలు తెలియజేసింది.జాతీయర పట్టణ వ్యవహారాల సంస్థ, సెంటర్ ఫర్ సస్టెయినబుల్, హెల్దీ అండ్ లెర్నింగ్ సిటీస్ అండ్ నైబర్ హుడ్స్, యు.ఎన్.హేబిటేట్ సంస్థలు కలిసి గత వారం ఈ ఆన్‌లైన్ సెమినార్ ఏర్పాటు చేశాయి.

ఈ సందర్భంగా జాతీయ పట్టణ వ్యవహారాల సంస్థలో ప్రొఫెసర్ దెబోలినా కుందు మాట్లాడుతూ కొత్తగా నిరుపేదలవుతున్న వారి సంఖ్య చాలా పెరుగుతుందని అన్నారు. ఈ సమస్యపై వెనువెంటనే దృష్టిపెట్టాలని చెప్పారు. లాక్‌డౌన్ కన్నా ముందు నిరుపేదలుగా ఉన్నవారి సమస్యలు మరింత ఎక్కువయ్యాయి, కాగా కొత్తగా నిరుపేదలుగా మారుతున్న వారి సమస్యలు కూడా ఇప్పుడు వచ్చి చేరాయి. ఈ కుటుంబాలకు ఆహార సరఫరా జరగాలి. అవసరమైన నగదు సహాయం అందించాలని నిపుణులు అభిప్రాయపడ్డారు. నిరుపేదల ఆరోగ్యం, జీవనోపాధి విషయంలో శ్రద్ధ వహించడం తక్షణం తీసుకోవలసిన చర్యలని, అలాగే దీర్ఘకాలిక ప్రణాళికతో పేదల జీవన స్థితిగతులు మెరుగుపరచి, మహమ్మారి వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలిన అన్నారు. ఒకే జాతి ఒకే రేషను కార్డు వంటి చర్యలు ఆహ్వానించదగ్గవిగా కుందు అభిప్రాయపడ్డారు. ఇలాంటి చర్యల వల్ల ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలసవెళ్ళినా వారికి అవసరమైన నిత్యావసరాలు లభిస్తాయని చెప్పారు. అయితే, పటిష్ఠమైన డేటాబేస్ తయారు చేసుకోవాలని, ఆ విధంగా నిరుపేదల్లో ప్రతి ఒక్కరికి ప్రయోజనాలు లభించేలా చూడాలని చెప్పారు. అలాగే ప్రజారోగ్యం కోసం కేటాయింపులు పెరగాలని చెప్పారు. నగరాల్లో పట్టణాల్లో నివసిస్తున్న పేదలకు అవసరమైన ఆరోగ్యసేవలు అందేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. 74వ రాజ్యాంగ సవరణ (1992) దీనికి సంబంధించినదే, కాని ఇంతవరకు అమలుకు నోచుకోలేదని చెప్పారు.ఈ సర్వేలో తెలిసిన మరి కొన్ని విషయాలేమిటంటే, లాక్‌డౌన్ కాలంలో 29.2 శాతం కుటుంబాలు పొరుగువారి నుంచి, బంధువులు, స్నేహితుల నుంచి అప్పోసప్పో చేసి నెట్టుకువచ్చాయి. కాగా 27.3 శాతం కుటుంబాలు అప్పటి వరకు తాము పొదుపు చేసుకున్న కొద్దోగొప్పో సొమ్ము ఖర్చు చేసి ఈ లాక్‌డౌన్‌లో బతికాయి. చాలా మంది తమ పొదుపు మొత్తాలన్నీ ఖర్చు చేసేశారు. 19.2 శాతం కుటుంబాలు ఇతరుల నుంచి సహాయం అర్ధించి బతికారు. దారిద్య్రరేఖకు దిగువన లేనివారు, అంటే ప్రభుత్వం లెక్కల ప్రకారం పేదలు కాని వారిలో 34.4 శాతం కుటుంబాలు తమ సొంత పొదుపును ఖర్చు చేసి బతికారు. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి పెద్ద నగరాల్లో మురికివాడల ప్రజలు ఎక్కువగా ఇరుగుపొరుగుపై ఆధారపడ్డారు.

కాగా జైపూర్ వంటి చిన్న పట్టణాల ప్రజలు వడ్డీ వ్యాపారులు తదితరుల నుంచి అప్పులు తీసుకున్నారు. కంచీపురం, శ్రీనగర్ పట్టణాల్లో ప్రజలు ఎక్కువగా బయటి సహకారంపై ఆధారపడ్డారని అధ్యయనంలో తెలిసింది. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన ప్రకారం ప్రభుత్వం ప్రకటించిన అదనపు రేషన్ పేదలకు కాస్త ఉపయోగపడింది. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా మురికివాడల్లో 63 శాతం కుటుంబాలు ఈ రేషన్ తీసుకోగలిగాయి. కేవలం 40.1 శాతం కుటుంబాలు మాత్రమే నగదు బదిలీ పొందగలిగాయి. సర్వే చేసిన కుటుంబాల్లో 51 శాతం కుటుంబాలు లాక్‌డౌన్‌కు మద్దతు పలికాయి. అయితే లాక్‌డౌన్ త్వరగా తొలగించకపోతే ఆకలితో చచ్చిపోతామని కూడా చాలా మంది అన్నారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాల్లో కేవలం 22.7 శాతం కుటుంబాలు మాత్రమే లాక్‌డౌన్ అవసరం లేదని అభిప్రాయపడ్డాయి. వలస కార్మిక కుటుంబాల్లో భౌతిక దూరం పాటించడానికి చాలా ఇబ్బందులున్నాయని కూడా ఈ సర్వే తెలియజేసింది. సగటున ఒక గదిలో 3.2 మంది వ్యక్తులు నివసిస్తున్నారని తెలిసింది. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి వలస కార్మికుడిగా ఉంటే ఆ కుటుంబాన్ని సర్వేలో వలస కార్మిక కుటుంబం గా పరిగణించారు. ఈ సర్వేలో తెలిసిన మరో వాస్తవమేమంటే, సర్వే చేసిన కుటుంబాల్లో కేవలం 8.6 శాతం కుటుంబాలు మాత్రమే మరుగుదొడ్డి సౌకర్యం లేని కుటుంబాలు. 58 శాతం కుటుంబాలకు ప్రత్యేక మరుగుదొడ్డి సదుపాయం ఉంది. 32.5 శాతం కుటుంబాలు ఉమ్మడి మరుగుదొడ్లను ఉపయోగిస్తున్నాయి. అదే విధంగా 66.2 శాతం కుటుంబాలు ప్రత్యేక బాత్రూం సదుపాయం కలిగిఉన్నాయి. కేవలం 4.5 శాతం కుటుంబాలకు మాత్రమే బాత్రూం సదుపాయం అందుబాటులో లేదు.

                                                                                              మౌసుమీ దాస్ గుప్త (ది ప్రింట్)

Article on Covid 19 Lockdown in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News