Saturday, April 27, 2024

అమర్త్యసేన్ – అట్లాస్ సైకిల్!

- Advertisement -
- Advertisement -

Atlas Company is permanently locked up

 

కఠోర లాక్‌డౌన్ కాలంలో అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని ఢిల్లీ నుంచి బీహార్‌లోని దర్భంగాకు (1200 కి.మీ.) సైకిల్ తొక్కుకుంటూ వారం రోజుల్లో తీసుకొచ్చిన దుర్గా కుమారి అనే 15 ఏళ్ల బాలిక వాసికెక్కిన వాస్తవ గాథ తెలిసిందే. ఒకప్పుడు సైకిల్ మన దేశంలోనూ, ప్రపంచమంతటా సామాన్యుల జీవితాలతో విశేషంగా పెనవేసుకున్నది. దాని రిపేర్లు, విడి భాగాల అమ్మకం వగైరా వ్యాపకాలపై లక్షలాది కుటుంబాలు బతికాయి. సైకిల్ ఉత్పత్తిలో, విక్రయంలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన అట్లాస్ కంపెనీ మొన్న బుధవారం నాడు ఢిల్లీ సమీపంలోని తన చిట్ట చివరి తయారీ విభాగానికి శాశ్వతంగా తాళం వేసింది. ఏడాదికి 40 లక్షల వాహనాలు అమ్మి ప్రపంచంలోనే అతి పెద్ద సైకిల్ ఉత్పత్తిదారుగా అట్లాస్ పేరు తెచ్చుకున్నది. నోబుల్ బహుమతి గ్రహీత భారతీయ మానవీయ, సంక్షేమ దృక్పథం గల ఆర్థికవేత్త అమర్త్యసేన్ అట్లాస్ సైకిల్ మీదనే పశ్చిమ బెంగాల్ గ్రామాల్లో తిరిగి పేదరికం, అసమానతల గురించి అధ్యయనం చేసిన ఉదంతం చెప్పుకోదగినది.

ఆయన ఆ సమయంలో ఉపయోగించిన అట్లాస్ సైకిల్‌ను స్వీడన్‌లోని స్టాక్ హోమ్‌లో గల నోబుల్ మ్యూజియంలో ఉంచారు. నల్ల రంగులోని ఆ సైకిల్ మీదనే అమర్తసేన్ తనకు నోబుల్ పురస్కారాన్ని తెచ్చిన ఆర్థిక సూత్రీకరణ కోసం క్షేత్ర స్థాయి అధ్యయనం జరిపారు. భారతీయ మూలాలున్న మరో ప్రఖ్యాత ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ 2019 నోబుల్ బహుమతిని పంచుకున్న సందర్భంగా గత డిసెంబర్‌లో మన జర్నలిస్టులకు ఆ మ్యూజియం క్యూరేటర్ ఈ సైకిల్ గురించి వివరించారు. అమర్తసేన్ తన అధ్యయనం కోసం బెంగాల్ గ్రామాల్లోని ఆడ, మగ శిశువుల బరువుల తేడాను తెలుసుకోవాలనుకున్నారు. ఆ పని మీద తన సిబ్బందిని పంపించారు. కాని గ్రామస్థులు వారికి సహకరించలేదు. అప్పుడు సేన్ స్వయంగా అట్లాస్ సైకిల్ మీద ఆ ప్రాంతాల్లో పర్యటించి పని సాధించుకొచ్చారు.

ఒకప్పుడు హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్ వంతెన వద్ద నిలుచొని చూస్తే ఉదయం 9 గం. వేళ అప్పటి ప్రాగా టూల్స్ వంటి అనేక పరిశ్రమల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేస్తుండిన వందలాది మంది కార్మికులు, సిబ్బంది సైకిళ్ల మీద గుంపులు గుంపులుగా బారులు బారులుగా వెళుతూ ఉండేవారు. ఆ దృశ్యం కమనీయంగా చూడముచ్చటగా, శ్రమ ప్రవాహంగా కనిపించి కన్నుల విందు చేసేది. అప్పుడు నగరంలో ఎక్కడ చూసినా సైకిళ్లు దండు కట్టి వెళుతున్నట్టు ఉండేది. ఇప్పుడు వాటి స్థానాన్ని మోటారు సైకిళ్లు ఆక్రమించుకున్నాయి. కాని అప్పటి సైకిళ్ల సమూహ దృశ్యాలు ఇప్పటి మోటారు సైకిళ్ల విషయంలో కరువయ్యాయి. జీవితంలో వేగం ప్రాధాన్యత అసాధారణంగా పెరిగిపోయింది. నగరాలు, పట్టణాల విస్తరణతో దూర భారాలు ఎక్కువయ్యాయి. సైకిల్ మీద వెళ్లడానికి అలవికానివైపోయాయి. మోటారు సైకిల్ యువతరం కలల వాహనంగా మారిపోయింది, ఆ స్పీడు, ఆ థ్రిల్ వారిని దాని వైపు విపరీతంగా మొగ్గించాయి.

అయినా వ్యాయామ, పర్యావరణ అవసరాల రీత్యా సైకిల్ ప్రాధాన్యం కొనసాగుతున్నది. శిలాజ ఇంధనాలతో పని చేసే మోటారు సైకిళ్ల వల్ల కాలుష్యం పెరిగి భూతాపం అవధులు మీరి పర్యావరణానికి చెప్పనలవికాని హాని జరుగుతున్నందున సైకిల్ ప్రయాణాన్నే ఎంచుకోవలసిన అవసరం మున్ముందు పెరిగే అవకాశముంది. కాని జీవన వేగానికి అది పనికి రాదనే చేదు వాస్తవం దాని భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నది. సరిగ్గా ప్రపంచ సైకిల్ దినోత్సవం నాడే ఢిల్లీ సమీపంలోని అట్లాస్ సైకిల్ ఫ్యాక్టరీ మూత పడడం యాదృచ్ఛికం. దీని వల్ల 1000 మంది నిరుద్యోగులయ్యారు. లూథియానాలోని విడి భాగాల సరఫరాదార్లు దిక్కు తోచని స్థితిలోపడ్డారు. రూ. 120 కోట్ల నష్టాల్లో కూరుకుపోయినందున ఫ్యాక్టరీని మూసివేసినట్టు యజమానులు ప్రకటించారు. తమకున్న భూమిని అమ్మి అప్పులు తీర్చి తిరిగి ఫ్యాక్టరీని తెరుస్తామని వారు చెబుతున్నప్పటికీ సైకిళ్లకు డిమాండ్ పూర్వమున్న స్థాయిలో లేకపోడం వల్ల అది జరిగే పనిగా కనిపించడం లేదు.

కాలంతో పాటు సాంకేతికతలో వచ్చే మార్పులు ఎంతటి గొప్ప చరిత్రనైనా వెనుకకు నెట్టేస్తాయి. ఇదే అట్లాస్ విషయంలోనూ జరిగింది. మధ్యప్రదేశ్‌లో, హర్యానాలో గల మరి రెండు తయారీ కేంద్రాలను అట్లాస్ 2014, 2018 సంవత్సరాల్లో మూసివేసింది. గతంలో గ్రామీణ సమాజంలో కూలినాలి జనానికి మధ్య తరగతికి ఉపాధి మూలాలుగా ఉపయోగపడిన ఎన్నో వృత్తులు, సాంకేతిక మార్పుల వల్ల, పట్టణీకరణ మూలంగా మూలపడిపోయి వాటి మీద ఆధారపడిన వివిధ రకాల వృత్తి జనం నిరాధారులయిపోయి ఆ నైపుణ్యాలను కూడా కోల్పోయిన విషాద దృశ్యం అట్లాస్ మూసివేతలో కనిపించక మానదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News