Saturday, April 27, 2024

ముంచుకొస్తున్న రెడ్ సీ ఉపద్రవం

- Advertisement -
- Advertisement -

ప్రపంచ నౌకా వాణిజ్యంలో కీలకమైన ఎర్ర సముద్రం ద్వారా ప్రయాణం సాగించే వాణిజ్య నౌకలపై హూతీ తిరుగుబాటుదారుల దాడులు అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలను తీవ్రంగా కలవరపరుస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచాన్ని చుట్టుముట్టిన ఆర్థిక మాంద్యానికి తోడు సరకుల రవాణా వ్యవస్థను హూతీలు దెబ్బ తీయడం వల్ల ద్రవ్యోల్బణం మరింతగా విజృంభిస్తుందని ఆర్థికవేత్తలు ఆందోళన చెందుతున్నారు. సంక్షుభిత గాజాపై ఇజ్రాయెల్ యుద్ధానికి ప్రతీకారంగా ఎర్ర సముద్రంలో దాడులు చేస్తున్నామని హూతీలు ప్రకటించారు. హూతీలను నిరోధించి ఎర్ర సముద్రం ద్వారా నౌకా రవాణాను సురక్షితం చేయడానికి అమెరికా, యుకె మిలిటరీ దాడులను ఉధృతం చేసినా హూతీలు వెనక్కి తగ్గడం లేదు.

ఎర్ర సముద్ర నౌకలపై దీర్ఘ కాల దాడుల ఫలితంగా ప్రపంచంలోని అనేక దేశాల్లో ఆయిల్, గ్యాస్, బియ్యం, గోధుమలు వంటి నిత్యావసరాల ధరలు మరింతగా పెరిగి పేద దేశాల్లో ఆకలి చావులు కూడా సంభవిస్తాయని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. అయినా పెద్దన్నలా వ్యవహరించే అగ్ర రాజ్యాలు గాజా సంక్షోభాన్ని పరిష్కరించడానికి బదులు హూతీలపై దాడులు చేయడం అగ్నికి ఆజ్యం పోయడమేనని వారు అంచనా వేస్తున్నారు. హూతీల దాడుల ఫలితం ప్రస్తుతం కొన్ని దేశాలకే పరిమితమైనా మున్ముందు భారత్‌తో సహా అన్ని దేశాలు పెరిగే ధరలతో సతమతంకాక తప్పదని ఆర్థికవేత్తలు ప్రమాద ఘంటికలను మోగిస్తున్నా పెద్ద దేశాల పాలకులు మేల్కోవడం లేదు. ప్రపంచ వాణిజ్యంలో కీలకమైన ఎర్ర సముద్రంలో ఇప్పటి దాకా 40 వాణిజ్య నౌకలపై దాడులు జరిగాయి.

ఈ దారిలో ఉద్యోగాలు చేయడమంటే ప్రాణాలతో చెలగాటమేనని నౌకల సిబ్బంది చెబుతున్నారు. నౌకల యజమానులు కూడా పెరిగిన కార్గో బీమా రేట్లతో ఎర్ర సముద్రం పేరు చెబితేనే వణికిపోతున్నారు. యూరపు, ఆసియా, ఆస్ట్రేలియాల మధ్య సూయజ్ కెనాల్, ఎర్ర సముద్రం ద్వారా ప్రయాణం దగ్గరి దారి అని ప్రపంచానికి తెలుసు. ఇలా కాకుండా మరో రూటులో ప్రయాణం మరింతగా ఖర్చులు పెంచుతుంది. ప్రపంచ వాణిజ్యంలో 15 శాతం నౌకాయానం ఎర్ర సముద్రం ద్వారానే జరుగుతుందంటే ఈ దారి ప్రాముఖ్యత ఏమిటో అర్థమవుతుంది. గడిచిన రెండు రోజులుగా హూతీ తిరుగుబాటుదారులు అమెరికా యుద్ధ నౌకలపై క్షిపణులు, డ్రోన్ల సాయంతో చేస్తున్న దాడులకు అమెరికా దళాలు ఎదురు దాడి చేసి డ్రోన్లను, క్షిపణులను ధ్వంసం చేశాయి. సోమవారం రాత్రి ‘ఎంఎస్‌సి స్కై II’ అనే వాణిజ్య నౌకపై కూడా హూతీలు భీకర దాడులు చేయడంతో సముద్రం మరింతగా ఎరుపెక్కింది.

ఆ నౌక సిబ్బంది సాయం కోరడంతో భారత నౌకాదళానికి చెందిన ఐఎన్‌ఎస్ కోల్‌కతా ఎర్ర సముద్రానికి యుద్ధ ప్రాతిపదికగా చేరుకొని నౌకలోని 23మంది సిబ్బందిని కాపాడారు. ఇలాంటి సంఘటనలు అక్కడ నిత్యకృత్యంగా మారాయి. హూతీల దాడుల కారణమో మరేమిటో తెలియదు గాని ఎర్ర సముద్రం అడుగున నిర్మించిన మూడు డేటా కేబుల్స్ తెగిపోయి అంతర్జాతీయంగా 25శాతం డేటా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడినట్లు టెలికం సంస్థలు ప్రకటించాయి. ప్రపంచంలోని దిగ్గజ సంస్థలైన అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా వంటి కంపెనీలు లక్షల కోట్లతో ఈ కేబుల్స్‌ను నిర్మించాయి. ప్రపంచ కమ్యూనికేషన్‌కు కీలకమైన ఇంటర్‌నెట్‌కు ఈ కేబుల్సే కీలకం. ఇటీవలి కాలంలో ఇంటర్‌నెట్ అంతరాయాలకు కేబుల్స్ తెగిపోవడం కూడా ఒక కారణంగా టెలికాం సంస్థలు చెబుతున్నాయి. హూతీల దాడుల ప్రభావం ఇలా బహుముఖంగా వుండడం కూడా ప్రపంచాన్ని కలవరపరిచే అంశంగా చెప్పవచ్చు.

ఇప్పటికే హూతీల దాడుల వల్ల ఒక ట్రిలియన్ డాలర్ల వాణిజ్యం దెబ్బ తిన్నదని అంచనా. దాడుల భయంతో కార్గో ఇన్సూరెన్స్‌ను కూడా కంపెనీలు 0.6 నుంచి 2 శాతానికి పెంచాయి. దీనివల్ల షిప్పింగ్ ఛార్జీలు కూడా 100 నుంచి 150 శాతం పెరిగాయి. ఎగుమతులు, దిగుమతుల వ్యయం పెరగడంతో అనేక దేశాల్లో నిత్యావసర వస్తువులతో పాటు వివిధ రంగాల వినియోగ వస్తువులు కూడా పెరుగుతున్నాయి. ఆర్థిక మాంద్యంతో ఉపాధి పోవడం, సరకుల ధరలు పెరగడంతో అన్ని వర్గాలకు జీవన వ్యయం భారంగా మారుతున్నది. యుద్ధాలను నివారించే ఐక్యరాజ్య సమితి వంటి సంస్థలు ఎర్ర సముద్రం సంక్షోభానికి తాత్కాలిక పరిష్కారాలు కనుగొనే బదులు అసలు మూలాన్ని గుర్తించి ఆ దిశగా శాశ్వత పరిష్కార ఆలోచించకుంటే అన్ని దేశాలకు మున్ముందు ఆర్థిక గండాలే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News