Monday, April 29, 2024

బంగ్లాదేశ్‌లో ఘర్షణల మధ్య ముగిసిన పోలింగ్

- Advertisement -
- Advertisement -

ఢాకా : దాదాపు 17 కోట్ల జనాభా ఉన్న బంగ్లాదేశ్‌లో ఘర్షణల మధ్యే 12 వ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ప్రధాన విపక్షం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బిఎన్‌పి) ఈ ఎన్నికలను బహిష్కరించాలని పిలుపు ఇవ్వడంతో అనేక హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. మొత్తం 300 నియోజక వర్గాలకు గాను 299 స్థానాల్లో పోలింగ్ నిర్వహించారు. అభ్యర్థి మృతితో ఒక స్థానానికి తర్వాత ఎన్నికలు నిర్వహిస్తారు. 436 మంది స్వతంత్ర అభ్యర్థులతోపాటు 27 రాజకీయ పార్టీల నుంచి 1500 మందికి పైగా పోటీ చేశారు. జనవరి 8 న ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉందని ఎన్నికల సంఘం వెల్లడించింది. ప్రధాన విపక్షం ఎన్నికలకు దూరంగా ఉన్న నేపథ్యంలో నాలుగోసారి కూడా షేక్ హసీనా నేతృత్వం లోని అవామీలీగ్ పార్టీదే గెలుపని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రధాన మంత్రి షేక్ హసీనా ఢాకాలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 4 గంటలకు ముగిసింది. అయితే 2018 నాటి ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ చాలా తక్కువగా అంటే 40 శాతం నమోదైంది. 2018 ఎన్నికల్లో 80 శాతం కన్నా ఎక్కువగా రికార్డు స్థాయిలో పోలింగ్ జరగడం గమనార్హం. అయితే ఇప్పుడు తుది లెక్కింపు తరువాత ఈ సంఖ్య మారవచ్చని ప్రధాన ఎన్నికల అధికారి కాజీ హబిబుల్ అవాల్ వెల్లడించారు. మధ్యాహ్నం 3 గంటల సమయానికి దేశ వ్యాప్తంగా కేవలం 27.15 శాతం పోలింగ్ నమోదైంది. ఖుల్నా డివిజన్‌లో అత్యధికంగా 32 శాతం, సిల్హట్‌లో అత్యల్పంగా 22 శాతం ఓట్లు పోలైనట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఏడు పోలింగ్ కేంద్రాల్లో తాత్కాలికంగా ఓటింగ్‌ను నిలిపివేశారు.

మూడు కేంద్రాల్లో మొత్తం రద్దు చేశారు. పోలింగ్ సందర్భంగా ఘర్షణలు, కాల్పుల సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఛత్తోగ్రామ్ స్థానంలో ఇద్దరు అభ్యర్థుల మద్దతుదారుల మధ్య ఘర్షణలు తలెత్తి కాల్పులకు దారి తీయడంతో ఇద్దరు గాయపడ్డారు. జమాల్‌పుర్ లోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద గొడవ జరిగి ఇద్దరు గాయపడ్డారు. ఢాకా లోని హజారీబాగ్‌లో ఓ పోలింగ్ కేంద్రం సమీపంలో రెండు పెట్రోల్ బాంబులు పేలి, చిన్నారి సహా నలుగురు గాయపడ్డారు.

దేశాభివృద్ధికి ప్రజాస్వామ్యం కీలకం : హసీనా
పోలింగ్ సందర్భంగా ఓటు వేసిన తరువాత ప్రధాని షేక్ హసీనా మీడియాతో మాట్లాడుతూ దేశాభివృద్ధికి ప్రజాస్వామ్యం కీలకమని పేర్కొన్నారు. 2009 నుంచి 2023 వరకు సుదీర్ఘకాలం తాము అధికారంలో ఉండడం వల్లనే బంగ్లాదేశ్ ఎంతో అభివృద్ధి చెందిందని, ప్రజలు నిర్భయంగా ఓటేసే వాతావరణం కలిగిందని చెప్పారు. ఎన్నికలను బహిష్కరించిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బిఎన్‌పి)ని ఉగ్రవాద సంస్థగా ఆరోపించారు. ఈ సందర్భంగా భారత్‌కు ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ తమకు నమ్మకమైన మిత్ర దేశంగా ఉండడం తమ అదృష్టంగా ప్రశంసించారు. బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో భారత్ తమకు అండగా ఉందని, 1975 తర్వాత తమ కుటుంబం మొత్తం కోల్పోయినప్పుడు ఆశ్రయమిచ్చిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News