Monday, May 6, 2024

ఇఎంఐల వాయిదాకు ఓకే..

- Advertisement -
- Advertisement -

Marathorium

 

రేపటి నుంచే 3 నెలల మారటోరియం అమలు
కస్టమర్లకు ఎస్‌ఎంఎస్ ద్వారా సందేశాలు
ట్విట్టర్ ద్వారా ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రకటనలు

న్యూఢిల్లీ: గృహ, వాహన, పంట రుణాలతో సహా అన్ని రకాల టర్మ్‌లోన్లపై మూడు నెలల మారటోరియం అమలు చేయనున్నట్టు బ్యాంకులు ప్రకటించాయి. ఎస్‌ఎంఎస్‌ల ద్వారా కస్టమర్లకు సందేశాలు పంపిస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో ప్రజలకు ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు రుణాల ఇఎంఐలను మూడు నెలలు వాయిదా వేయాలంటూ గతవారం ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. ఈమేరకు ఏప్రిల్ నుంచి ఈ మారటోరియంను అమలు చేస్తున్నట్టు మంగళవారం ప్రభుత్వరంగ బ్యాంకులు ప్రకటించాయి. ఆర్‌బిఐ సూచించిన మార్గదర్శకాలతో కూడిన వివరాలను బ్రాంచ్‌లకు పంపాయి. ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) రుణగ్రస్తులకు మూడు నెలల పాటు ఇఎంఐల(నెలసరి వాయిదా) మినహాయింపు ఇచ్చింది.

అన్ని రకాల టర్మ్ లోన్లకు(వ్యవసాయ, రిటైల్, పంట రుణాలు) గాను అన్ని వాణిజ్య బ్యాంకులు(ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్‌లు, చిన్న ఫైనాన్స్ బ్యాంక్‌లు, స్థానిక బ్యాంకులు), కోఆపరేటివ్ బ్యాంక్‌లు, అఖిల భారత ఆర్థిక సంస్థలు, ఎన్‌బిఎఫ్‌సిలకు 2020 మార్చి 1 నుంచి మే 31 వరకు చెల్లింపులపై మూడు నెలల మారటోరియం అనుమతి ఇస్తున్నట్టు ఆర్‌బిఐ ప్రకటించింది. మారటోరియం కాలంలో టర్మ్ లోన్లపై వడ్డీ కొనసాగుతుంది. ఈ మూడు నెలల మారటోరియంను అనుమతి ఇచ్చే హక్కు బ్యాంకులకు ఉంది. వినియోగదారులు తమను తాము కోరుకుంటే వాయిదాలు చెల్లించవచ్చు.

బ్యాంకులు ఒత్తిడి చేయవు. అంటే రాబోయే మూడు నెలలు రుణం తీసుకున్న ఏ వ్యక్తి ఖాతా నుండి వాయిదా కట్ కాదు. దీంతో క్రెడిట్ స్కోర్ కూడా ప్రభావితం కాదు. మూడు నెలలు రుణ వాయిదాలను తిరిగి చెల్లించలేకపోతే, అది డిఫాల్ట్ కూడా కాదు. నెలసరి వాయిదా మూడు నెలల వ్యవధి తర్వాత తిరిగి ప్రారంభమవుతుంది. అయితే బకాయిలు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని కాదు. కేవలం మూడు నెలలు వాయిదా. ఆ తరువాత చెల్లించాలి. లాక్‌డౌన్ కారణంగా నిజంగా నగదు కొరత ఉన్నవారికి కొంత సమయం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఆర్‌బిఐ ఈ నిర్ణయం తీసుకుంది.

3 నెలలు ఇఎంఐలు వాయిదా: ఎస్‌బిఐ
2020 మార్చి 1, మే 31 మధ్య టర్మ్ లోన్ల వడ్డీ/ ఇఎంఐలు వాయిదా వేస్తున్నామని, తిరిగి చెల్లించే గడువు మూడు నెలలు ఇస్తున్నట్టు ఎస్‌బిఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ప్రకటించింది. ఆర్‌బిఐ కోవిడ్19 రెగ్యులేటరీ ప్యాకేజీ నిబంధనల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని బ్యాంక్ ట్విట్టర్‌లో వెల్లడించింది.

ఇమెయిల్‌లో ఇసిఎస్ సమాచారం: యుబిఐ
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యుబిఐ) మేనేజింగ్ డైరెక్టర్ రాజ్‌కిరణ్ రాయ్ జి మాట్లాడుతూ, అన్ని రకాల టర్మ్ లోన్లపై మారటోరియం అమలు చేయాలని బ్రాంచ్‌లకు సమాచారమిచ్చామని అన్నారు. ఇసిఎస్ ద్వారా వాయిదాలు కట్ అవుతున్న కస్టమర్లకు బ్రాంచ్‌లు ఇమెయిల్ లేదా డిజిటల్ మాద్యమంలో సమాచారమిస్తాయని, వారి చెల్లింపులపై నిర్ణయం చెప్పాల్సి ఉంటుందని అన్నారు.

వాయిదా వేస్తున్నాం: పిఎన్‌బి
2020 మార్చి 1, మే 31 మధ్య అన్ని టర్మ్ లోన్ల ఇఎంఐల చెల్లింపులను వాయిదా వేస్తున్నట్టు పంజాబ్ నేషనల్ బ్యాంక్ తెలిపింది. పిఎన్‌బి ట్విట్టర్‌లో ‘మా కస్టమర్లకు పిఎన్‌బి ఊరటనందిస్తోంది. కరోనా వైరస్ నేపథ్యంలో టర్మ్ లోన్ల ఇన్‌స్టామెంట్లు అన్నింటిని మూడు నెలలు వాయిదా వేస్తున్నాం’ అని పేర్కొంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా:
కార్పొరేట్, ఎంఎస్‌ఎంఇ, వ్యవసాయ, రిటైల్, గృహ, వాహన టర్మ్ లోన్లపై మూడు నెలల మారటోరియం అనుమతిస్తున్నామని బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటించింది. ఈమేరకు ట్విట్టర్‌లో తెలిపింది.

ఆంధ్రా బ్యాంక్
రుణగ్రస్తులకు ఊరట అంటూ ఆంధ్ర బ్యాంక్ కూడా ఇఎంఐల వాయిదా ప్రకటన చేసింది. మూడు నెలలపాటు టర్మ్ లోన్ల, క్రెడిట్ కార్డుల ఇఎంఐలు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.

మారటోరియం ఇచ్చిన ఇతర బ్యాంకులు
ఐడిబిఐ బ్యాంక్, కెనరా బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, యుకో బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్‌లు మూడు నెలలపాటు టర్మ్ లోన్ల ఇఎంఐలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించాయి.

Banks ready to accept Marathorium
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News