Monday, April 29, 2024

ఐసియులో అమెరికా

- Advertisement -
- Advertisement -

America

 

కుప్పలు తెప్పలుగా ఆసుపత్రులకు తరలుతున్న రోగులు, మరికొన్ని రాష్ట్రాల్లో షట్‌డౌన్ ఆంక్షలు
కాలిఫోర్నియాలో రెట్టింపైన వైరస్ బాదితులు
10లక్షల మందికి కరోనా పరీక్షలు, స్పెయిన్‌లో ఒక్క రోజే 849 మరణాలు
మౌనంగా రోదిస్తున్న ఇటలీ

మరణాలు : 3017
24 గంటల్లో మృతులు : 540
కేసులు : 1,63,000

న్యూయార్క్/పారిస్/మాడ్రిడ్ : మహమ్మారి కరోనా వైరస్ కారణంగా మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ 35 వేలను దాటి పోవడం, అమెరికాలో పరిస్థితి మరింతగా క్షీణిస్తున్న నేపథ్యంలో ఈ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు లాక్‌డౌన్ నిబంధనలను మరింత కఢినంగా అముల చేస్తున్నాయి. ఇప్పటివరకు ప్రతిరోజూ వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్న అమెరికా, ఇటలీ, స్పెయిన్‌లలో వైరస్ మరణ మృదంగం కొనసాగుతుండగా మిగతా దేశాలు లాక్‌డౌన్ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేస్తుండడంతో ప్రపంచ జనాభాలో అయిదింట రెండు వంతుల మంది తమ ఇళ్లకే పరిమితమైనారు. అనేక నగరాల బాటలో మాస్కో, లాగోస్ నగరాల్లో కూడా పూర్తి లాక్‌డౌన్ అమలు చేయడంతో ఆ నగరాల వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. మరో వైపు అమెరికాలోని వర్జీనియా, మేరీలాండ్, కాన్సాస్ రాష్ట్రాలు తాజాగా తమ ప్రజలను ఇళ్లలోనే ఉండాలంటూ అత్యవసర ఆదేశాలు జారీ చేశాయి. ఇప్పటికే న్యూయార్క్, న్యూజెర్సీ సహా పలు రాష్ట్రాలు ఈ ఆంక్షలను అమలు చేస్తున్న విషయం తెలిసిం దే.

రాజధాని నగరం వాషింగ్టన్‌లో కూడా ఇదే విధమైన ఆంక్షలను విధించారు. కాగా అమెరికాలో కరోనా వైరస్ బారిన పడి మరణించి న వారి సంఖ్య 3000ను దాటింది. సోమవారం ఒక్క రోజే ఏకంగా 540 మంది ఈ వైరస్ కారణంగా మృత్యువాత పడ్డారు. దీంతో ఈ వైరస్‌తో పోరాడుతూ మృతి చెందిన వారి సంఖ్య 3017కు పెరిగింది. మరో వైపు ఈ వైరస్ బారిన పడినవారి సంఖ్య 1,63,000కు పెరిగిం ది. న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాల్లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండడం తో ఇతర వ్యాధులతో బాధపడే వారికి చికిత్స అందించేందుకు ఆస్పత్రులే కరువైనాయి. దీంతో అక్కడి ప్రభుత్వం ఓ భారీ మిలిటరీ నౌక ను ఆస్పత్రిగా మార్చింది. అమెరికా నౌకాదళానికి చెందిన ‘యుఎస్ కంఫర్ట్’ అనే ఈ నౌక సోమవారం హడ్సన్ నది ఒడ్డుకు చేరినప్పుడు ఈ నౌకను రెండు రాష్ట్రాల ప్రజలు నదికిరువైపులా నిలబడి స్వాగతించారు. ఇక తీవ్రత ఎక్కువగా ఉన్న మరో రాష్ట్రం కాలిఫోర్నియాలో నాలుగు రోజుల్లో కరోనా వైరస్ కారణంగా ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య రెట్టింపయిందని, ఐసియులో చేరుతున్న వారి సంఖ్య మూడు రెట్లయిందని గవర్నర్ గావిన్ న్యూసమ్ తెలిపారు.

10లక్షల మందికి కరోనా పరీక్షలు
మరో వైపు ఇప్పటివరకు 10లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ప్రతిరోజు దాదాపు లక్ష నమూనాలను సేకరిస్తున్నామని ఆరోగ్య మంత్రి అలెక్స్ అజర్ తెలిపారు. మరోవైపు భారత్‌లోని అమెరికన్లను తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని ట్రంప్ పాలకవర్గం ప్రకటించింది. ఇప్పటివరకు 50 దేశాల్లోని అమెరికన్లను స్వదేశానికి తీసుకెళాల్లమని వెల్లడించింది.

మృతులకు ఇటలీ నివాళి
కాగా కరోనా వైరస్ కారణంగా మరణించిన వారికి మంగళవారం ఇటలీ నివాళి అర్పించింది. జాతీయ జెండాలను అవనతం చేసి మౌనం పాటించింది. రెండో ప్రపంచయుద్ధం తర్వాత ఇటలీలో ఇలాంటి మరణ మృదంగం మోగడం ఇదే తొలిసారి.‘ ఈ వైరస్ ఒక గాయం. అది దేశమంతటినీ గాయపరిచింది’ అని రోమ్ మేయర్ వర్జీనియా రాగి మౌనం పాటించిన అనంతరం అన్నారు. వాటికన్ సిటీ సైతం సంఘీభావంగా పసుపు, తెలుపు జెండాలను అవనతం చేసింది. కరోనా వైరస్ మార్చిని ఇటలీ వాసులు ఎన్నటికీ మర్చిపోలేని నెలగా మార్చింది. మంగళవారం నాటికి దేశంలో 11,591 మంది కోవిడ్19 కారణంగా ప్రాణాలు కోల్పోయారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇటలీలో ఇంత భారీ సంఖ్యలో మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. ఈ దెబ్బతో ఇటలీ పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. మూడు వారాల క్రితం ప్రకటించిన షట్‌డౌన్ ఏప్రిల్ మధ్యదాకా కొనసాగుతుందని సోమవారం ఇటలీ ప్రభుత్వం ప్రకటించింది.అయితే మే చివరి వారం వరకు అక్కడ దుకాణాలు తెరిచే పరిస్థితి కనిపించడం లేదు.

స్పెయిన్‌లో ఒక్క రోజే 849 మరణాలు
మరరోవైపు కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న మరో దేశం స్పెయిన్‌లో సోమవారం ఒక్క రోజే 849 మంది ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు దేశంలో కరోనా మృతుల సంఖ్య 8,189కు చేరింది. ఇటలీ తర్వాత కరోనా కారణంగా ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయింది స్పెయిన్‌లోనే. అదే సమయంలో కొత్తగా 9,222 కరోనా కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 94,417కు చేరుకుంది. గత వారం రోజులుగా క్రమంగా తగ్గుతూ వస్తున్న కేసుల సంఖ్య సోమవారం పెరగడం అక్కడి అధికారులను ఆందోళననకు గురి చేస్తోంది. అయితే తగ్గుదల దోరణి కొనసాగుతోందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎమర్జెన్సీస్ కోఆర్డినేషన్‌విభాగం ప్రతినిధి మారియా జోస్ సియెర్రా చెప్పారు.

 

America in the ICU
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News