Monday, May 6, 2024

జట్టులో భారీ మార్పులు?

- Advertisement -
- Advertisement -

BCCI plans for huge changes in the team india

 

రెండో టెస్టుకు సాహా, పృథ్వీలకు ఉద్వాసన
గిల్, రాహుల్, పంత్‌లకు చోటు

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘోరపరాజయం పాలవడంతో మిగిలిన మూడు టెస్టులకు జట్టులో భారీ మార్పులు చేయాలని టీమిండియా మేనేజిమెంట్ భావిస్తోంది. ఈ మూడు టెస్టులకు కెప్టెన్ కోహ్లీ కూడా అందుబాటులో ఉండక పోవడంతో ప్రధానంగా బ్యాటింగ్ లైనప్‌ను మరింత బలోపేతం చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలి టెస్టులో ఆడిన వృద్ధిమాన్ సాహా, పృథ్వీషాలకు రాబోయే టెస్టుల్లో అవకాశాలు ఉండకపోవచ్చని తెలుస్తోంది. దీనికి తోడు సీనియర్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ కూడా మూడో టెస్టు దాకా అందుబాటులో ఉండే అవకాశాలు లేకపోవడంతో రెండో టెస్టుకు జట్టులోకి వామప్ మాచ్‌లలో రాణించిన యువ బ్యాట్స్‌మన్ శుభ్‌మన్ గిల్‌తో పాటుగా నిలకడగా రాణిస్తున్న కెఎల్ రాహుల్‌ను కూడా జట్టులోకి తీసుకునే అవకాశాలున్నాయని అంటున్నారు.

కాగా తొలి టెస్టులో ఘోరంగా విఫలమైన వృద్ధిమాన్ సాహా బ్యాటింగ్‌పై జట్టు మేనేజ్‌మెంట్‌కు నమ్మకాలు తగ్గిపోవడంతో ఇంతకు ముందు ప్రాక్టీస్ మ్యాచ్‌లో సెంచరీతో రాణించిన రిషబ్ పంత్ వైపే సెలెక్టర్లు మొగ్గు చూపవచ్చని అంటున్నారు. సాహాతో పోలిస్తే పంత్ కీపింగ్ అంత గొప్పగా ఉండకపోయినప్పటికీ బ్యాటింగ్ మెరుగ్గా ఉండడమే దానికి కారణంగా పరిశీలకులు అంటున్నారు. కాగా బాక్సింగ్ డేనుంచి ప్రారంభమయ్యే రెండో టెస్టులో శుభ్‌మన్‌గిల్‌కు ఓపెనర్‌గా మరో అవకాశమిచ్చేందు కే సెలెక్టర్లు మొగ్గు చూపవచ్చు.

తొలి టెస్టులో ఎదురైన ఘోర పరాజయంనుంచి టీమిండియా త్వరగా బైటపడాలని, రెండో టెస్టులో గొప్పగా పుంజుకోవాలని బ్యాటింగ్ దిగ్గజం, టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కూడా అభిప్రాయపడ్డాడు. లేని పక్షంలో కంగారూలు గడ్డపై టెస్టు సిరీస్‌లో క్లీన్‌స్వీప్‌కు గురి కాకతప్పదని కూడా హెచ్చరించాడు. భారత జట్టులో రెండు మార్పులు తప్పనిసరని, పృథ్వీషా స్థానంలో కెఎల్ రాహుల్ రావాలని, అలాగే శుభ్‌మన్ గిల్‌కు కూడా చోటు కల్పించాలని ఆయన అభిప్రాయపడ్డాడు. అయిదు, లేదా ఆరో స్థానంలో అతడ్ని ఆడించాలని కూడా సూచించాడు. గిల్ మంచి ఫామ్‌లో ఉన్నాడని, ఆరంభం బాగుంటే ఆసీస్‌పై పైచేయి సాధించగలమని కూడా ఆయన అభిప్రాయపడ్డాడు. కాగా తొలి టెస్టులో బ్యాటింగ్ చేస్తూ గాయపడిన మహమ్మద్ షమీ స్థానాన్ని భర్తీ చేయడం జట్టుకు కష్టమేనని కూడా గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. అయితే ఇశాంత్ శర్మ ఫిట్‌గా ఉంటే అతడ్ని వెంటనే ఆస్ట్రేలియాకు పంపాలని సూచించాడు. నవ్‌దీప్ సైనీ, సిరాజ్‌లు మంచి బౌలర్లే కానీ ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ను వారు ఇబ్బంది పెట్టలేరేమోననిపిస్తోందన్నాడు.

ద్రవిడ్‌ను ఆస్ట్రేలియాకు పంపాలి: వెంగ్‌సర్కార్

కాగా ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియా తిరిగి సత్తా చాటాలంటే ఆస్ట్రేలియాకు దిగ్గజ బ్యాట్స్‌మన్ రాహుల్ ద్రవిడ్ వెంటనే వెళ్లాలని, ఈ విషయంలో బిసిసిఐ చొరవ తీసుకోవాలని సెలెక్షన్ కమిటీ మాజీ చైర్మన్, మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్ అభిప్రాయపడ్డాడు. అనుభవజ్ఞుడైన ద్రవిడ్ నెట్స్‌లో ఉంటే టీమిండియా బ్యాట్స్‌మెన్‌లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని వెంగ్‌సర్కార్ అన్నాడు. ద్రవిడ్ ప్రస్తుతం ఎన్‌సిఎ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News