Saturday, April 27, 2024

ప్రభుత్వ రంగంలో మెరుగైన వైద్య సేవలు

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ రంగంలో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. బుధవారం రా్రష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా నియోజవర్గంలోని నందన గార్డెన్‌లో నిర్వహించిన వైద్య ఆరోగ్య దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే, అదనపు కలెక్టర్లకు ఆశా కార్యకర్తలు బతుకమ్మ, బోనాలతో స్వాగతం పలికారు. వైద్య రంగంలో రాష్ట్రం సా ధించిన ప్రగతిని వివరించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని పెద్దలు అన్నారని, దాన్ని ప్రత్యేక రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేసి చూపిస్తున్నారని తెలిపారు.

గతంలో ఎన్నడు లేనివిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌళిక వసతులు కల్పించారని, ఉమ్మడి రాష్ట్రంలో ఐదు వైద్య కళాశాలలు ఉంటే నేడు 26కు పెంచుకున్నామని అన్నారు. పట్టణంలోని రెండు బస్తీ దవాఖనాలు ఏర్పాటు చేశామని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉప కేంద్రాల భవనాల నిర్మానానికి ప్రభుత్వం రూ.20 లక్షల నిధులు మంజూరు చేసిందన్నారు. త్వరలోనే అందుబాటులోకి వస్తాయని తెలిపారు. పట్టణ కేంద్రంలో 134 రకాల వైద్యం పరీక్షలను చేసే డయాగ్నిస్టిక్ హబ్ ఏర్పాటు పనులు పూర్తి చేశామన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను అందించే ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలకు జీతాలు పెంచామని, వారి అద్బుత పనితీరు ఫలితంగా నియోజకవర్గంలో గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు మంచి వైద్య సేవలు అందుతున్నాయని సుమారు 80 శాతం మంది ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం చేసుకుంటున్నారని ఎమ్మెల్యే అన్నారు.

ప్రభుత్వ ఉద్యోగాలు చేసే మనకు ప్రజలకు సేవ చేసే అదృష్టం కలిగిందని, దానిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. కరోనా సమయంలో వైద్యులు, సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు చేసిన సేవలు అభినందనీయమన్నారు. మనిషి జీవితంలో కాలం, ప్రాణం పోతే తిరిగి రావని, ఇవి చాలా అమూల్యమైనవని అన్నారు. ప్రాణాలను రక్షించే శక్తి ఉన్న వైద్య రంగం చాలా గొప్పదన్నారు.

అంతకుముందు వైద్య, ఆరోగ్య సేవలు పొందిన వారు వారి అభిప్రాయాలను తెలిపారు. రక్తదానం చేసిన దాతలను సన్మానించి ప్రశంసా పత్రాలను అందజేశారు. మిడ్ లెవల్ ప్రొవైడర్స్‌కు నియామక పత్రాలను అందజేశారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన ఉద్యోగులను, సిబ్బందిని, ఆశా కార్యకర్తలను సన్మానించారు. అనంతరం ఆశా కార్యకర్తలకు చీరెలు, ఏఎన్‌ఎంలకు బీపీ యంత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ దాసరి మమత, జడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు శ్రీధర్, తిరుపతిరావు, రంగారెడ్డి, డాక్టర్లు, ఆశాలు, ఏఎన్‌ఎంలు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News