Saturday, April 27, 2024

నితీశ్ అడుగులు ఎటువైపు?

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ ఒంటెద్దు పోకడలపై జెడియులో ఆగ్రహం

న్యూఢిల్లీ: జనతాదళ్(యు) అధికార ప్రతినిధి కెసి త్యాగి ఈనెల 8న చేసిన ప్రకటనతో ప్రతిపక్ష ఇండియా కూటమిలో అంతర్గతంగా తీవ్ర అభిప్రాయభేదాలు ఉన్నాయని, బీహార్ ముఖ్యమంత్రి, జెడి(యు) అధినేత నితీశ్ కుమార్ సంతోషం లేరని అర్థమవుతోంది. అనుభవజ్ఞుదైన రాజకీయ నాయకుడు త్యాగి. ఆయన చాలా జాగ్రత్తగా, ఆచితూచి మాట్లాడతారని రాజకీయ వర్గాలలో పేరుంది. ఈ కారణంగా కాంగ్రెస్‌పై ఆయన చేసిన విమర్శలను తీవ్రంగా పరిగణించక తప్పదు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గత శనివారం వలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇండియా కూటమి కన్వీనర్ పదవిపై చేసిన వ్యాఖ్యల పట్ల త్యాగి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆ వ్యాఖ్యలు తమకు అసంతృప్తిని కలిగించినట్లు ఆయన చెప్పారు. ఒక పక్క కాలాతీతమవుతోందని, మేధోమథనం జరగాల్సి ఉందని, ఇండియా కూటమిని క్రియాశీలం చేయడానికి కాంగ్రెస్‌లో ఏమాత్రం ఆతృత కనపడడం లేదని త్యాగి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ సొంత యాత్ర తలపెడుతోందని, దీనికి బదులుగా కూటమికి చెందిన అగ్ర నాయకులతో ఇండియా యాత్ర ఆలోచన చేసి ఉంటే ఇంకా బాగుండేదని ఆయన చెప్పారు. తన భారత్ జోడో న్యాయ యాత్రను తలపెట్టక ముందు కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలోని ఏ పార్టీని సంప్రదించలేదని ఆయన చెప్పారు. తాము యాత్రను స్వాగతిస్తున్నామని, అయితే ఈ యాత్రను చేపట్టడానికి ఇది తగిన సమయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇండియా కూటమిలో ఇప్పటికీ అయోమయ పరిస్థితి కొనసాగుతోందని, అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం జరిగిన తర్వాత వెంటనే పార్లమెంటరీ ఎన్నికలను ప్రకటిస్తే పరిస్థితి ఏమిటని త్యాగి ప్రశ్నించారు.

ముందుగా అర్థం చేసుకోవలసింది తన బాస్ నితీశ్ కుమార్‌ను సంప్రదించకుండా త్యాగి ఈ ప్రకటన చేసి ఉంటారని భావించలేము. కాంగ్రెస్‌కు చెందిన అగ్రనేతలపై త్యాగి తన విమర్శలను గురిపెట్టారు. ఇండియా కన్వీనర్ విషయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేను, భారత్ జోడో న్యాయ యాత్ర విషయంలో రాహుల్ గాంధీని ఆయన టార్గెట్ చేశారు. బిజెపి హిందూత్వ అజెంబాను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు సరైన వ్యూహాన్ని రచించడంలో కాంగ్రెస విఫలమైందని ఆయన తన మాటల ద్వారా చెప్పారు. అంతేగాక మిత్రపక్షాలను సంప్రదించకుండా కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇవి తీవ్రమైన ఆరోపణలు. వీటిపై వెంటనే దృష్టిపెట్టకపోతే ఇండియా కూటమిలో పెను సంక్షోభం ఏర్పడే అవకాశం కూడా లేకపోలేదు.

నితీశ్ కుమార్ బలహీనతలు
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అవకాశవాద రాజకీయ నాయకుడని, ఆయనకు ప్రధాన మంత్రి పదవిపై కన్ను ఉందని, ఈ లక్ష్యాన్ని ,చేరుకోవడానికి తొలి మెట్టుగా కూటమి కన్వీనర్ పదవిని కోరుకుంటున్నారని అందరికీ తెలుసు. ఎన్‌డిఎతో తెగతెంపులు చేసుకుని లాలూ యాదవ్‌తో చేతులు కలిపినపుడు ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని ఉప ముఖ్యమంత్రి, ఆర్‌జెడి నేత తేజస్వి యాదవ్‌కు అప్పగించి జాతీయ రాజకీయాలలో పెద్ద పాత్ర పోషించడానికి కదులుతారని అందరూ ఊహించారు. ప్రధాని నరేంద్ర మోడీని ఢీకొనడానికి ప్రతిపక్ష కూటమి తరఫున ప్రధాని అభ్యర్థిగా నితీశ్ కుమార్ పేరే తెరమీదకు వస్తుందని కూడా అందరూ ఊహించారు. నితీశ్ కుమార్ ఎప్పుడూ ఉన్నత స్థానంపైనే గురిపెడతారు. మోడీ లాగే ఆయన కూడా బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలకు పైగా పనిచేశారు.

మోడీ లాగే నితీశ్ కూడా ఓబిసిలోని కుర్మి కులానికి చెందిన వ్యక్తి. ఉత్తర భారతంలో యాదవుల తర్వాత ఓబిసిలలో రాజకీయంగా బలమైనది కుర్మి కులం. నితీశ్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం వల్ల ఓబిసిలను బిజెపి వైపు వెళల్కుండా కట్టడి చేసే అవకాశం ఉంది. దీంతో హిందీ భాషను మాట్లాడే రాష్ట్రాలలో బిజెపిని బలహీనపరచవచ్చు. మమమతా బెనర్జీ, ఎంకె స్టాలిన్, ఖర్గేలతో పోలిస్తే నితీశ్ కుమార్ హిందీ భాషను మాట్లాడే రాష్ట్రాలకు చెందిన వ్యక్తి కావడం ఆయనకు మరో సానుకూల పరిణామం. బిజెపికి ఇది కంచుకోటలాంటిది. 2019 లోక్‌సభ ఎన్నికలలో బిజెపి ఇక్కడ 90 శాతానికి పైగా స్థానాలను గెలుచుకుంది. మోడీ మోడవసారి ప్రధాని కాకుండా నిలువరించాలంటే హిందీ మాట్లాడే రాష్ట్రాలలో అధిక స్థానాలను ఇండియా కూటమి గెలుచుకోవలసి ఉంటుంది. ఈ రాష్ట్రాలలో కాంగ్రెస్ బిజెపితో ముఖాముఖీ తలపడుతోంది. కాని నితీశ్ కుమార్‌ను ప్రతిపక్ష కూటమి ప్రధాని అభ్యర్థిగా చూపించిన పక్షంలో ఓబిసి ఓటర్లలో అధిక సంఖ్యాకులు జెడియు, కాంగ్రెస్, ఉత్తర్ ప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీ అకర్షితులయ్యే అవకాశం ఉంది.

నితీశ్‌ను నమ్మని ఇండియా కూటమి
నితీశ్ కుమార్‌ను ఇండియా కూటమిలోని చాలా పార్టీలు పూర్తిగా నమ్మే పరిస్థితిలో లేవు. ఆయన కదలికల పట్ల కూటమి పక్షాలలో అనేక అనుమానాలు ఉన్నాయి. నితీశ్‌కు దీర్ఘకాలంగా సన్నిహిత మిత్రుడైన లాలూ ప్రసాద్ యాదవ్‌సైతం తన మిత్రుడి రాజకీయ ఎత్తుగడలను పసిగట్టడంలో విఫలమవుతుంటారు. నితీశ్‌ను స్వార్థపరుడిగా, గోప్యతను పాటించే వ్యక్తిగా చాలామంది భావిస్తుంటారు. అంతేగాక లౌకికవాడం విషయంలో నితీశ్ కుమార్ చిత్తశుద్ధిపై పలువురికి అనుమానాలు ఉన్నాయి. సిద్ధాంపరంగా ఆయన సోషలిస్టు అయినప్పటికీ రాజకీయ అధికారం కోసం బిజెపితో చేతులు కలిపేందుకు ఆయన వెనుకాడలేదు. 1990 దశకంలో జనతాదళ్ నుంచి నిష్క్రమించిన తర్వాత ఆయన తన పాత సోషలిస్టు మిత్రులతో కన్నా ఎక్కువ సమయాన్ని బిజెపితోనే వెచ్చించారు.

అటల్ బిహారీ వాజపేయి క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత బిజెపి మద్దతుతో బీహార్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టి 2014 వరకు కొనసాగారు. నరేంద్ర మోడీ ప్రధాని పదవిని చేపట్టిన నాటి నుంచి ఆయన బిజెపిని ఢీకొని పాత మిత్రుడు లాలూ ప్రసాద్‌తో చేతులు కలిపారు. వారిద్దరూ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసి విజయం సాధించారు. వెంటనే ఆర్‌జెడికి హ్యాండిచ్చి 2017లో మళ్లీ బిజెపి చెంతకు చేరారు. 2022లో మళ్లీ బిజెపితో వేరుపడి ఆర్‌జెడితో చేతులు కలిపారు. ఈ చరిత్రను బట్టి చూస్తే లలన్ సింగ్‌ను పదవి నుంచి దింపి తాను జెడియు అధ్యక్ష బాధ్యతలను చేపట్టడాన్ని బట్టి నితీశ్ మళ్లీ ఏ గూటికి వెళతారోనన్న అనుమానాలు అందరినీ పట్టిపీడిస్తున్నాయి.

ఖర్గే పేరు ప్రతిపాదన వెనుక వ్యూహం
ఇండియా కూటమి డిసెంబర్ 19న నిర్వహించిన సమావేశంలో ప్రధాని అభ్యర్థిగా మల్లికార్జున్ ఖర్గే పేరును మమతా బెనర్జీ ప్రతిపాదించారు. వెంటనే దీన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బలపరిచారు. వీరిద్దరి చర్యల వెనుక ఒక బలమైన కారణం ఉందన్న ఊహాగానాలు కూడా సాగుతున్నాయి. ప్రధాని పదవిని ఆశిస్తున్న వారిలో మమత, కేజ్రీవాల్ ఇద్దరూ ఉన్నారు. నితీశ్ అవకాశాలను దెబ్బతీయడానికే వీరిద్దరూ ఖర్గే పేరును ప్రతిపాదించి ఉంటారన్న అభిప్రాయం వినపడుతోంది. 2024 ఎన్నికలకు ఇండియా కూటమి తరఫున ప్రధాని అభ్యర్థిగా ఎవరి పేరును ప్రతిపాదించకూడదని అంతకు ముందురోజే కూటమి నాయకులకు సూచించిన మమతా బెనర్జీ మరుసటి రోజు ఇండియా కూటమి సమావేశంలో తానే ఖర్గే పేరును ప్రతిపాదించడంపై కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది.

కూటమి కన్వీనర్‌గా నితీశ్ ఉండడం ఏమాత్రం ఇష్టం లేనందునే ఆమె ఈ ప్రతిపాదన తెరమీదకు తెచ్చారని తెలుస్తోంది. అయితే స్టాలిన్‌కు అభ్యంతరాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ మాత్రం నితీశ్ కుమార్‌నే కన్వీనర్‌గా ఉంచాలని భావిస్తోంది. నితీశ్‌కు కన్వీనర్ పదవిపై ఏకాభిప్రాయ సాధన కోసం కాంగ్రెస్ ప్రయత్నాలు సాగిస్తోంది. ఇండియా కూటమి సమావేశంలో హఠాత్తుగా ఖర్గే పేరును తెరమీదకు తీసుకురావడంతో అసంతృప్తికి గురైన నితీశ్‌ను బుజ్జగించేందుకు రాహుల్‌తోపాటు ఖర్గే కూడా చర్చలు జరిపారు.

అయితేత్యాగి మాటలను బట్టి చూస్తే నితీశ్ ఇంకా అసంతృప్తితోనే ఉన్నట్లు ఆర్థమవుతోంది. మరో మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. బిజెపి ఇప్పటికే ఎన్నికల ప్రచారంలోకి దిగిపోయింది. ఈనెల 22న జరగనున్న అయోధ్య రామాలయ ప్రారంభోత్సవాన్ని ఎన్నికల ప్రచార అస్త్రంగా బిజెపి చేసుకునే అవకాశం ఉంది. మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన ఊపులో కూడా ఆ పార్టీ ఉంది. ఈ పరిస్థితులలో ఇండియా కూటమి సమైక్యంగా లేదన్న సూచనలు బయటకు వెళితే బిజెపిని ఉమ్మడిగా ఢీకొట్టడం ఆసాధ్యమవుతుంది. బిజెపిని దుర్కోవాలంటే ప్రతిపక్ష కూటమికి ప్రత్యేక వ్యూహం కూడా ఉండాలి. లేని పక్షంలో ప్రారంభం కాకముందే యుద్ధంలో ఓటమిని అంగీకరించినట్లవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News