Saturday, April 27, 2024

సోమవారం బీహార్‌లో నితీశ్ విశ్వాస పరీక్ష

- Advertisement -
- Advertisement -

పాట్నా : బీహార్ శాసనసభలో సోమవారం జరగనున్న బల పరీక్షపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఆర్‌జెడి, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహాఘట్‌బంధన్‌కు గుడ్‌బై చెప్పి ఎన్‌డిఎలో చేరిన ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తన ఆధిక్యాన్ని సోమవారం నిరూపించుకోవలసి ఉంటుంది. ఈ కీలక బల పరీక్షకు ముందు కాంగ్రెస్ పార్టీ తమ ఎంఎల్‌ఎలను హైదరాబాద్‌లో దాచింది. ఆర్‌జెడి ఎంఎల్‌ఎలు మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ నివాసంలో శనివారం నుంచి మజిలీ చేస్తున్నారు. నితీశ్ ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమైన అనంతరం బల పరీక్షకు ముందు తమ ఎంఎల్‌ఎలను బిజెపి బుద్ధ గయలోని మహా బోధి రిసార్ట్‌కు తరలించింది. ఒక శిక్షణ కోసం వారి బుద్ధ గయ రిసార్ట్‌కు పంపామని, ప్రతిపక్షం నుంచి వారికి ఎర ముప్పు లేదని బిజెపి స్పష్టం చేసింది. బీహార్ శాసనసభలో మొత్తం సభ్యుల సంఖ్య 243. మెజారిటీ లక్షం 122. ఎన్‌డిఎకు 128 మంది సభ్యులతో సుఖప్రదమైన ఆధిక్యం ఉంది. వారిలో 78 మంది బిజెపి సభ్యులు. జెడి (యు)కు 45 మంది, హిందుస్థానీ అవమ్ మోర్చా (హెచ్‌ఎఎం)కు నలుగురు సభ్యులు ఉన్నారు.

స్వతంత్ర ఎంఎల్‌ఎ సుమీత్ సింగ్ మద్దతు ఎన్‌డిఎకే. ప్రతిపక్ష కూటమికి 114 సీట్లు ఉన్నాయి. ఆర్‌జెడికి 79, కాంగ్రెస్‌కు 19, సిపిఐ (ఎంఎల్)కు 12 మంది, సిపిఐ (ఎం), సిపిఐలకు చెరి ఇద్దరు సభ్యులు ఉన్నారు. ఎఐఎంఐఎంకు ఒక సీటు ఉండగా మరొక సీటు ఇతరులకు చెందినది. కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు హైదరాబాద్ నుంచి పాట్నాకు చేరుకోగానే తేజస్వి నివాసానికి తరలిస్తారు. వారు ఆయన నివాసం నుంచి ఆర్‌జెడి ఎంఎల్‌ఎలతో పాటు అసెంబ్లీకి వస్తారు. బల పరీక్ష సమయంలో అందరూ సభలోనే ఉండాలని తమ ఎంఎల్‌ఎలు అందరికీ జెడి (యు) మూడు లైన్ల విప్ జారీ చేసింది. బల పరీక్షకు ముందు వారిని మరి ఏ ప్రదేశానికీ తరలించలేదు. హెచ్‌ఎఎం కూడా తమ ఎంఎల్‌ఎలు నలుగురికీ బల పరీక్ష కోసం సభలో ఉండాలని విప్ జారీ చేసింది. జీతన్ రామ్ మాంఝీ తమ పార్టీ నితీశ్ కుమార్ ప్రభుత్వానికి అనుకూలంగా వోటు వేస్తుందని తెలిపారు. ఇది ఇలా ఉండగా, బీహార్ అసెంబ్లీ స్పీకర్ అవధ్ బిహారీ చౌదరి రాజీనామా చేయడానికి నిరాకరించారు.

నిబంధనల ప్రకారం అసెంబ్లీ కార్యకలాపాలను నిర్వహిస్తానని ఆయన చెప్పారు. బీహార్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ సెంట్రల్ హాల్‌లో ఉభయ సభల సంయుక్త సమావేశంలో చేసే ప్రసంగంతో సెషన్ మొదవుతుంది. ఆ తరువాత స్పీకర్‌పై అవిశ్వాసం నోటీస్‌పై చర్చ జరుగుతుంది. అటు పిమ్మట నితీశ ప్రభుత్వం విశ్వాస తీర్మానంపై వోటింగ్ కోరుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News