Monday, April 29, 2024

విశ్వాస పరీక్ష నెగ్గిన నితీశ్ కుమార్

- Advertisement -
- Advertisement -

పాట్నా : బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సారథ్యంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం అసెంబ్లీలో కీలకమైన విశ్వాస పరీక్షలో నెగ్గింది. విశ్వాస తీర్మానానికి అనుకూలంగా 129 మంది ఎంఎల్‌ఎలు వోటు వేశారు. వారిలో ప్రతిపక్ష రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్‌జెడి) ఎంఎల్‌ఎలు ముగ్గురు కూడా ఉన్నారు. ప్రతిపక్ష సభ్యుల వాకౌట్ మధ్య కొత్త ప్రభుత్వం 129 వోట్లు సాధించింది. అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 243. మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ఆర్‌జెడి, కాంగ్రెస్, వామపక్ష ఫ్రంట్‌తో కూడిన ప్రతిపక్షం వాకౌట్ చేసింది. అంతకు ముందు నితీశ్ కుమార్ తన ప్రభుత్వంపై విశ్వాసం కోరుతూ సభలో ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. నితీశ్ కుమార్ భారతీయ జనతా పార్టీ (బిజెపి)తో కలసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం విదితమే. నితీశ్ కుమార్ జనతా దళ్ (యు) చీఫ్‌గా ఇటీవలే బాధ్యతలు చేపట్టారు. అసెంబ్లీ స్పీకర్‌గా ఆర్‌జెడికి చెందిన అవధ్ బిహారి చౌదరి తొలగింపును సభ తీర్మానాన్ని ఆమోదించిన వెంటనే నితీశ్ కుమార్ విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు.

తీర్మానానికి అనుకూలంగా 125 మంది ఎంఎల్‌ఎలు వోటు వేశారు. తీర్మానానికి వ్యతిరేకంగా 112 మంది ఎంఎల్‌ఎలు వోటు వేశారు. తొలుత అసెంబ్లీ మద్దతు కోరుతూ నితీశ్ కుమార్ లాంఛనంగా తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు సభలో పెద్ద డ్రామా చోటు చేసుకున్నది. ఆగ్రహోదగ్రుడైన తేజస్వి యాదవ్ తమ పూర్వపు మిత్రుడు నితీశ్‌పై వ్యంగ్యోక్తులు విసిరారు. ‘పల్టు కుమార్’ తీరును ఆయన కొత్త భాగస్వామి ప్రధాని నరేంద్ర మోడీకి, బిజెపికి తేజస్వి గుర్తు చేశారు. ‘ఆయన మళ్లీ ఫిరాయించబోరని ప్రధాని మోడీ ‘గ్యారంటీ’ ఇస్తారా అని తేజస్వి అడిగినప్పుడు ఆయన పార్టీ సభ్యులు హర్షధ్వానాలు చేశారు. నితీశ కుమార్ తన చర్యలకు బీహార్ ప్రజలకు సంజాయిషీ ఇచ్చుకోవాలని ఆయన కోరారు. ‘మీరు రాజీనామా అనంతరం రాజ్ భవన్‌లో నుంచి వెలుపలికి వచ్చినప్పుడు ‘మన్ నహీ లగ్ రహా థా& హమ్ లోగ్ నాచ్‌నే గానే కే లియే థోడే హై (మేము ఆనందించడం లేదు& మేము ఉన్నది మీకు వినోదం కలిగించడానికేనా)’ అని మీరు అన్నారు.

మీకు మద్దతు కోసం మేము అక్కడ ఉన్నాం’ అని తేజస్వి చెప్పారు. ‘కానీ ఆయన ఒకే పదవీ కాలంలో మూడు సార్లు ప్రమాణ స్వీకారం చేశారు. అటువంటిది మేము ఎన్నడూ చూడలేదు’ అని తేజస్వి అన్నారు. తేజస్వి యాదవ్ ప్రసంగం అనంతరం ప్రతిపక్ష సభ్యులు సభలో నుంచి వాకౌట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News