Friday, May 3, 2024

బీహార్‌పై కమలం కసరత్తు

- Advertisement -
- Advertisement -

BJP Election Committee meets on Bihar Assembly elections

 

బిజెపి ఎన్నికల కమిటీ భేటీ

న్యూఢిల్లీ : బీహార్ అసెంబ్లీ ఎన్నికలను ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని శనివారం బిజెపి అత్యున్నత స్థాయిలో పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సిఇసి) సమావేశం నిర్వహించింది. ఈ భేటీకి ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరయ్యారు. బిజెపి అధ్యక్షులు జెపి నడ్డా అధ్యక్షతన జరిగిన భేటీలో అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై చర్చించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు మూడు వారాల వ్యవధి ఉంది. ఈ దశలో అభ్యర్థుల ఎంపిక, రాజకీయ సమీకరణలు, ఎల్‌జెపితో ఇప్పటి పరిస్థితి ఇతర అంశాలపై సమీక్ష జరిగింది. బిజెపి ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించడం ఇదే తొలిసారి. బీహార్‌లో మూడు దశల పోలింగ్ జరగనుంది. తొలిదశ పోలింగ్ ఈ నెల 28న జరుగుతుంది. రెండో దశ నవంబర్ 3, మూడో దశ నవంబర్ 7న జరుగుతాయి. జెడియూతో దూరం, బిజెపికి అనుకూలం నినాదంతో ఎల్‌జెపి ఈసారి ఎన్నికల బరిలోకి దిగుతోంది. దీని పరిణామాలపై అగ్రనేతలు దృష్టి సారించినట్లు తెలిసింది.

బీహార్ అసెంబ్లీలో 234 స్థానాలు ఉన్నాయి. బిజెపి 110 స్థానాలలో పోటీ చేస్తుంది. ప్రధాన భాగస్వామ్యపక్షం 122 సీట్లకు, వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ (విఐపి)కి 11 సీట్లు పోటీ చేసేందుకు వీలుంది. మిగిలిన ఏడింటిలో హిందూస్థాన్ అవామ్ మోర్చా అభ్యర్థులు ఉంటారు. మాజీ సిఎం జితన్ రామ్ మాంజి ఆధ్వర్యంలో ఈ పార్టీ ఉంది. బీహార్‌కు సంబంధించినంత వరకూ ప్రధాన భాగస్వామ్యపక్షం ఎల్‌జెపి ఎన్‌డిఎ నుంచి దూరంగా వెళ్లింది. పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ బహిరంగంగానే ముఖ్యమంత్రి నితీష్‌పై నిప్పులు చెరిగారు. మరో వైపు ప్రతిపక్షాలు కాంగ్రెస్, ఆర్జేడీలు సరైన విధంగా సీట్ల సర్దుబాటుతో ఎన్నికలకు సిద్ధం అయ్యాయి. ప్రస్తుత పలు పరిణామాలను దృష్టిలో పెట్టుకుంటూ , అభ్యర్థుల ఎంపిక తరువాత ప్రచారదశలో బీహార్‌కు ఎంచుకోవల్సిన అంశాలపై వ్యూహాల ఖరారు గురించి బిజెపి ఎన్నికల కమిటీ బేరీజుకు దిగినట్లు వెల్లడైంది.ఈ వారంలోనే బిజెపి27 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది.

తొలిదశలో 71 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ప్రస్తుత దశలో జెడియు బిజెపి మధ్య సీట్లసర్దుబాట్లు అంత తేలిక కాదని వెల్లడైంది. పలు కీలక స్థానాలపై పరస్పరం బెట్టువీడని పట్టులు ఉండటంతో ఎటువంటి పరిస్థితికి దారితీస్తుందనేది కీలకంగా మారింది. నితీష్‌పై ప్రజల్లో వ్యతిరేకత తమకు ప్రతికూలతను తెచ్చిపెడుతుందా? అనే కోణంలో బిజెపి అత్యున్నత స్థాయి నేతలు అంతర్మథనంలో పడ్డారు. మరో వైపు కోవిడ్ దశలో సరైన విధంగా వ్యవహరించలేదనే విమర్శలు మోడీ ప్రభుత్వంపై ఉన్నందున దీని ప్రభావం తమపై పిడుగుపాటు అవుతుందా? అని అత్యంత తెలివిగా ఆలోచించే నితీష్ ఆలోచనలో పడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News