Wednesday, May 1, 2024

ఫిరాయింపులకు ముగింపు లేదా?

- Advertisement -
- Advertisement -

BJP govt is hotbed of party defections in India

 

పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ విపక్షంలోని ప్రభుత్వాలను కూలదోయడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని, మేము అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ విష సంస్కృతిని అంతమొందించి రాజకీయాల్లో నూతన ధోరణులను అమలుచేసి చూపిస్తామంటూ 2014 ముందు కమలనాథులు పలికిన మాటలు నీటి మూటలేనని తేలిపోయింది. దేశంలోని వివిధ రాష్ట్రాలలో పార్టీ ఫిరాయింపులకు తెర తీసి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన వివిధ రాష్ట్ర ప్రభుత్వాలను అడ్డదారిలో పడగొట్టి ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తోన్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ తీరును ఎన్నికల సంస్కరణలు సూచించే అసోసియేషన్ ఆఫ్ డెమొక్రాటిక్ రిఫారమ్స్ (ఎడిఆర్) నివేదిక తేటతెల్లం చేసింది. దేశంలో పార్టీ ఫిరాయింపులకు బిజెపి ప్రభుత్వం పెద్దపీట వేస్తుండడంతో కప్పగంతుల రాజకీయాలు పెరిగిపోయి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలుగుతోందని ఎడిఆర్ నివేదిక అసహనాన్ని వ్యక్తం చేసింది. దేశంలో 2016 -2020 సంవత్సరాల మధ్య 433 మంది పార్టీలు మారినట్లు వీరిలో 405 మంది ఎమ్మెల్యేలు, 12 మంది లోకసభ, 16 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నట్లు నివేదిక తెలిపింది. 2016-2020 మధ్యకాలంలో మధ్యప్రదేశ్, మణిపూర్, గోవా, అరుణాచల్‌ప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలు పడిపోవటానికి ఎంఎల్‌ఎల ఫిరాయింపులే ప్రధాన కారణమని నివేదిక స్పష్టం చేసింది.

దేశంలోని వయోజనులైన ప్రజలు భారత రాజ్యాంగం ద్వారా కల్పించబడిన ఓటు హక్కుతో వివిధ రాజకీయ పార్టీల సిద్ధాంతాల, ఎన్నికల ప్రణాళికల ఆధారంగా తమకు నచ్చిన ప్రతినిధులను ఐదేళ్ల నిర్ణీత కాలానికి ఎన్నుకుని చట్టసభలకు పంపుతున్నారు. ఎన్నికైన ప్రజాప్రతినిధుల చేతిలో తమ భవిష్యత్తును, దేశ భవిష్యత్తును పెడుతున్నారు. ఐదు సంవత్సరాల కాలానికి ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేస్తూ వారి అభివృద్ధికి పాటు పడాల్సిందిపోయి, తమకు అవకాశాన్ని కల్పించిన పార్టీని నట్టేట ముంచి, తమకు ఓటేసిన ప్రజల అభిప్రాయాలను తుంగలో తొక్కి తమ సొంత ప్రయోజనాల కోసం డబ్బులకు, పదవులకు ఆశపడి యధేచ్ఛగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారు.

ఐదేళ్లలో పార్టీలు మారి తిరిగి ఎన్నికలలో పాల్గొన్న 443 మంది ఎంఎల్‌ఎల, ఎంపిల ఎన్నికల అఫిడవిట్లను అసోసియేషన్ ఆఫ్ డెమొక్రాటిక్ రిఫారమ్స్ విశ్లేషించింది. పార్టీలు మారిన ఎంఎల్‌ఎలు, ఎంపిల ఆస్తులు 39 శాతం పెరిగినట్లు ఎడిఆర్ వెల్లడించడం ప్రజలను నివ్వెరపరుస్తోంది. 2016 నుంచి 2020 వరకు ఇతర పార్టీల నుంచి ఎంఎల్‌ఎ లు, ఎంపిలు పెద్ద సంఖ్యలో బిజెపి కండువా కప్పుకున్నట్లు ఎడిఆర్ నిగ్గు తేల్చింది. బిజెపిలో 182(44.9 శాతం) మంది, కాంగ్రెస్‌లోకి 38 సభ్యులు (9.4 శాతం), తృణమూల్ కాంగ్రెస్, ఎన్‌పిపిలో 16 మంది (4 శాతం), జెడి (యు)లో 14(3.5 శాతం), బిఎస్‌పిలోకి 11 మంది (2.7 శాతం) చేరినట్లు ఎడిఆర్ చెబుతోంది. ఐదు సంవత్సరాల కాలంలో 182 మంది ఎంఎల్‌ఎలు వివిధ రాజకీయ పార్టీలకు రాజీనామా చేసి బిజెపిలో చేరి వివిధ రాష్ట్రాలలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలను కూలదోయడంలో ప్రధాన పాత్ర పోషించారు.

2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కాషాయ దళం ఫిరాయింపు రాజకీయాలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వాలను అస్థిరపరచడంలో చేయని ప్రయత్నమంటూ లేదు. పార్టీలు మారిన 405 మంది ఎంఎల్‌ఎలలో 170(42 శాతం) మంది కాంగ్రెస్ పార్టీని వీడి ఇతర పార్టీలలో చేరిపోయారు. 18 (4.4 శాతం) మంది బిజెపి నుంచి ఇతర పార్టీలలో చేరారు. లోకసభలో మూడింట రెండు వంతుల మెజారిటీ ఉండి రాజ్యసభలో సంఖ్యా బలం లేకపోవడంతో పలు కీలక బిల్లులకు ఆమోదం లభించడంలో ఇబ్బందులు తలెత్తడంతో బిజెపి రాజ్యసభలో ఫిరాయింపుల పర్వానికి తెర లేపింది. పెద్దల సభ గౌరవానికి భంగం కలిగించేలా రాజ్యసభలో 16 మంది ఎంపిలు పార్టీలు మారితే వీరిలో 10 మంది బిజెపిలోకి ఫిరాయించడం ఆ పార్టీ అనుసరిస్తున్న వైఖరికి నిదర్శనంగా నిలుస్తోంది. కాంగ్రెస్ నుంచి ఏడుగురు, టిడిపి నుంచి ముగ్గురు, ఎస్‌పి నుండి ఇద్దరు, తృణమూల్ కాంగ్రెస్, జెడి(యు), ఎన్‌సిపి, ఎన్‌పిపి నుంచి ఒక్కొక్కరు పార్టీ వీడారు.

2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదంతో అడ్డగోలుగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ అధికారంలో ఉన్న విపక్ష ప్రభుత్వాలను కూలదోయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. 2018లో కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన జెడి(ఎస్), కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బిజెపి అనేక ప్రయత్నాలు చేసి తాను అనుకున్నది సాధించింది. అనేక రోజుల పాటు రిసార్టులలో క్యాంపు రాజకీయాలు నడిపిన కమలనాథులు కాంగ్రెస్ జెడి(ఎస్) కి చెందిన 16 మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించడంతో 14 నెలల పాటు కుమారస్వామి నేతృత్వంలో కొనసాగిన సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. 2018 చివరలో జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గడ్ రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలలో కాషాయ దండుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. మూడు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ప్రభుత్వాలు ఏర్పాటు చేయడంతో బిజెపి కేంద్ర నాయకత్వం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ నాయకుడైన జ్యోతిరాదిత్య సింధియాకి కేంద్రమంత్రి పదవి ఆశ చూపి 22 మంది ఎంఎల్‌ఎల చేత రాజీనామా చేయించడంతో కమల్ నాథ్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలల లోపే అధికారాన్ని కోల్పోయింది.

జ్యోతిరాదిత్య సింధియాకి రాజ్యసభ సభ్యత్వానికి మాత్రం కల్పించి కేంద్ర మంత్రి పదవికి మాత్రం మొండిచేయి చూపింది. రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాట్ ముఖ్యమంత్రిగా పిసిసి అధ్యక్షుడు సచిన్ పైలెట్ ఉప ముఖ్యమంత్రిగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బిజెపి ప్రభుత్వం పడరాని పాట్లు పడింది. సచిన్ పైలెట్ బిజెపిలోకి వస్తే ముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఇవ్వడంతో రాజస్థాన్‌లో కొన్నాళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. బిజెపితో అంటకాగి ముఖ్యమంత్రి పదవిపై కన్నేసిన సచిన్ పైలెట్ కు తోడుగా అనుకున్న సంఖ్యలో ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బిజెపిలో చేరడానికి ముందుకు రాకపోవడంతో బిజెపి ఆడించిన నాటకానికి తెరపడింది. 2019 అక్టోబర్ లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి, శివసేన కూటమి మెజారిటీ స్థానాలలో గెలుపొందడం జరిగింది. చెరో రెండున్నర ఏళ్ళు ముఖ్యమంత్రి పీఠాన్ని పంచుకోవాలనే హామీని బిజెపి విస్మరించడంతో శివసేన కూటమి నుంచి వైదొలిగి ఎన్‌సిపి, కాంగ్రెస్ పార్టీలతో కూటమిగా ఏర్పడింది.

ఎలాగైనా మహారాష్ట్ర పీఠంపై కూర్చోవాలనే దుర్బుద్ధితో ఎన్‌సిపిలో చీలిక తెచ్చేందుకు బిజెపి విశ్వప్రయత్నాలు చేసింది ఎన్‌సిపి నేత శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ మరికొంత మంది ఎంఎల్‌ఎలను తమ వైపుకు ఆకర్షించిన బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మెజారిటీని నిరూపించుకోలేక నవ్వుల పాలైంది. అనంతరం శివసేన, ఎన్‌సిపి, కాంగ్రెస్‌లు ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొన్నటికి మొన్న పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి రాష్ట్రపతి పాలన పెట్టడానికి బిజెపి కారణమైంది. 30 మంది సభ్యులు గల పుదుచ్చేరి అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ 14 మంది, ఇరువురు డిఎంకె సభ్యుల సహకారంతో ప్రభుత్వం కొనసాగుతుంటే, నలుగురు కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు ప్రలోభాలతో రాజీనామా చేసి బిజెపిలో చేరడంతో ప్రభుత్వం కుప్పకూలిపోయింది.

అంగట్లో గొర్రెల మాదిరి ఎంఎల్‌ఎలను, ఎంపిలను కొనుగోలు చేసి ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తున్న విష సంస్కృతికి అడ్డుకట్ట వేయాలనే సదుద్దేశంతో 1985లో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 52 వ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్రంలో మొదటిసారిగా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం రూపొందించారు. దీనికి సంబంధించి రాజ్యాంగంలో 10వ షెడ్యూల్ చేర్చారు. ఫిరాయింపుల చట్టంలోని లోపాలను స్వార్థపరులు తెలివిగా ఉపయోగించుకుంటూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని నీరుగారుస్తున్నారు. ఆనాడు ఏ సభలలోనైతే పార్టీ ఫిరాయింపులకు ముగింపు పలకాలని చట్టాన్ని తీసుకువచ్చి, పలు సందర్భాల్లో సవరణలు తీసుకువచ్చారో నేడు ఆ సభల సాక్షిగానే పలువురు సభ్యులు పార్టీలు మారుతూ ప్రజాభిప్రాయానికి విలువే లేకుండా చేస్తున్నారు. 2016- 2020 మధ్యకాలంలో రాజ్యసభలో 16 మంది ఎంపిలు, లోకసభలో 12 మంది ఎంపిలు పార్టీలు మారడం ఫిరాయింపు రాజకీయాలకు పరాకాష్ఠగా నిలుస్తోంది. నేడు చట్టసభలకు వివిధ పార్టీల తరపున ఎన్నిక అవుతున్న వారిలో పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లు, సంపన్నులు ఎక్కువ మొత్తంలో ఉంటున్నారు.

ప్రజా సంక్షేమాన్ని పక్కకుపెట్టి వారి వ్యాపారాల కోసం, ఆస్తులు కాపాడుకోవడం కోసం, కాంట్రాక్టుల కోసం అధికారంలో ఉన్న పార్టీలలో విచ్చలవిడిగా చేరిపోతున్నారు. అధికారంలో ఉన్న పార్టీలు ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు విపక్ష సభ్యులు చేసే ఫిర్యాదుల మీద సభాపతులు నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారు. పార్టీ ఫిరాయింపుల పై స్పందించి నిష్పాక్షికంగా విచారణ జరిపి సత్వరం నిర్ణయం తీసుకోవాల్సిన సభాపతులు అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారు. ఫిర్యాదులు ఏళ్ళతరబడి, మళ్లీ ఎన్నికలు వచ్చేంత వరకు స్పీకర్ వద్ద పెండింగ్‌లో ఉంటున్నాయి. వీటిపై న్యాయస్థానాలు జోక్యం చేసుకునే అవకాశం లేకపోవడంతో అవకాశవాద రాజకీయాలకు ఆస్కారం ఏర్పడుతోంది.

అసోసియేషన్ ఆఫ్ డెమొక్రాటిక్ రిఫారమ్స్ (ఎడిఆర్) పార్టీ ఫిరాయింపులకు అనేక రకాల కారణాలు దోహదపడుతున్నట్లు విశ్లేషించింది. ప్రస్తుతం దేశంలో విలువలతో కూడిన రాజకీయాలకు స్థానం లేకపోవడం, డబ్బు అధికారం కోసం తహతహలాడటం, సమర్ధత, నిజాయితీ, విశ్వసనీయత కొరవడుట, అధికారాన్ని కానుకగా కట్టబెట్టడం, ధన బలానికి, కండ బలానికి ప్రాధాన్యత పెరిగిపోవడం, చట్టాల ప్రభావం నామమాత్రంగా మారిపోవడం తదితర కారణాలతో పార్టీ ఫిరాయింపులు విచ్చలవిడిగా జరుగుతున్నాయని ఎడిఆర్ స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలను ఆర్‌టిఐ పరిధిలోకి తీసుకువచ్చి, పార్టీ ఫిరాయించిన వారు వెంటనే ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా, ఎలాంటి అధికార పదవి చేపట్టకుండా నిషేధించాలని ఈ సంస్థ సూచించింది. పార్టీ ఫిరాయింపులకు ఏమాత్రం అవకాశం లేకుండా రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్‌ను సవరించి పార్టీలు మారే ఎంఎల్‌ఎలు, ఎంపిలపై అనర్హత వేటు వేసే అధికారాన్ని గవర్నర్లకు, రాష్ట్రపతికి ఇవ్వాలని ప్రభుత్వాలకు ఎడిఆర్ సూచించిన సవరణలను, సూచనలను కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు పరిశీలిస్తుందో వేచి చూడాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News