Monday, April 29, 2024

రైతుల డిమాండ్లు తీర్చకుంటే బిజెపికి మళ్లీ అధికారం అసాధ్యం

- Advertisement -
- Advertisement -

మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక సంచలన వ్యాఖ్యలు

BJP to regain power without farmer strike

జైపూర్(రాజస్థాన్): వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతుల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలని మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సూచించారు. రైతుల డిమాండ్లను నెరవేర్చకపోతే ఈ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాదంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్‌లోని ఝుంఝును జిల్లాలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న మాలిక్ ఈ వ్యాఖ్యలు చేశారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తర్ ప్రదేశ్‌లోని అనేక గ్రామాలలో ప్రస్తుతం బిజెపి నాయకులు అడుగుపెట్టే పరిస్థితి లేదని ఆయన తెలిపారు.

తన స్వస్థలం మీరట్‌లో బిజెపి నాయకులు ఎవ్వరూ కనిపించడం లేదని, అలాగే ముజఫర్‌నగర్, బాగ్‌పట్ తదితర ప్రాంతాలలో కూడా బిజెపి నాయకులు అడుగుపెట్టే పరిస్థితి లేదని ఆయన అన్నారు. రైతులకు సంఘీభావంగా మీ పదవిని వదులుకుంటారా అని విలేకరులు ప్రశ్నించగా తాను రైతుల పక్కన నిలబడుతున్నానని, ప్రస్తుతం తన పదవిని వీడాల్సిన అవసరం లేదని, అవసరమైతే అందుకు కూడా తాను సిద్ధమేనని ఆయన స్పష్టం చేశారు. రైతుల ఆందోళనపై తాను గతంలో అనేక మందితో పోరాడానని పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన జాట్ నాయకుడైన మాలిక చెప్పుకొచ్చారు.

ప్రధాని, హోం మంత్రితోపాటు అనేకమందితో తాను ఘర్షణపడ్డానని ఆయన చెప్పారు. మీరు తప్పు చేస్తున్నారు..అలా చేయొద్దంటూ వారితో వాదించానని ఆయన అన్నారు. కనీస మద్దతు ధర(ఎంఎస్‌పి)కు చట్టబద్ధ భరోసా కల్పిస్తే సమస్య సునాయాశంగా పరిష్కారమవుతుందని ఆయన తెలిపారు. మూడు బిల్లుల అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున రైతులు కూడా ఆ విషయంపై పట్టుబట్టే అవకాశం లేదని మాలిక అభిప్రాయపడ్డారు. కేవలం ఎంఎస్‌పి ఒక్కటే మిగిలి ఉందని, దాన్ని కూడా మీరు పరిష్కరించలేకపోతున్నారని, ఆ డిమాండ్ నెరవేర్చకుండా ఏదీ పరిష్కారం కాదని మాలిక్ అభిప్రాయపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News