Saturday, April 27, 2024

డిజిటల్ బ్రిడ్జి సాధనంతో పక్షవాత రోగిలో చలనం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: చైనాలో 2011లో ట్రాఫిక్ ప్రమాదంలో మెడ విరిగి అసలు నడవలేక పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తికి మెదడు, వెన్నుపూస మళ్లీ చైతన్యవంతం అయి నడవగలిగేలా వైద్యులు చేయగలిగారు. నెదర్లాండ్‌కు చెందిన 40 ఏళ్ల గెర్ట్‌జన్ ఒస్కామ్ చైనాలో 2011లో రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో మెడ విరిగింది. దాంతో పక్షవాతం ఆవరించింది. మంచానికే పరిమితమయ్యాడు. ఈ పరిస్థితుల్లో స్విట్జర్లాండ్‌కు చెందిన న్యూరోసైంటిస్టులు బ్రెయిన్ మెషిన్‌ను అభివృద్ధి చేసి ఒక్సామ్‌లో ప్రయోగించారు. ప్రమాదం వల్ల వెన్నుముక లోని నరాలు దెబ్బతినడంతో నిరుపయోగమైన కండరాలను తిరిగి పనిచేయించగలిగారు. వైర్‌లెస్ సిగ్నల్స్‌ను మెదడుకు అనుసంధానం చేయడంతో కండరాలు తిరిగి పనిచేయగలిగాయి. ఇందులో డాక్టర్లు ఒక సాధనాన్నిశరీరంలో అమర్చారు. అది మెదడు లోని తరంగాలను చదివి వెన్నుముకకు ఆదేశాలను పంపింది. కుడి కండరాలు పనిచేసేలా ఆదేశించింది.

అంతకు ముందు ట్రయిల్‌లో ఒస్కామ్‌కు ఒక వ్యవస్థ ద్వారా పరీక్షలు చేశారు. దాని ఫలితంగా నడకలో ఒక లయతో కూడిన అడుగులు పడ్డాయి. కంప్యూటర్ ద్వారా వెన్నుముకకు సిగ్నల్స్ పంపించడంతో ఇది సాధ్యమైంది. ఈ సాధనంతో ఒకేసారి అనేక అడుగులు వేయడానికి వీలైంది. ఈ కదలిక అంతా పూర్తిగా రొబొటిక్ మయమైంది. బటన్ లేదా సెన్సార్ ద్వారా ప్రేరేపించడమైంది. లాయుసన్నే యూనివర్శిటీ ఆస్పత్రికి చెందిన న్యూరో సర్జన్ ప్రొఫెసర్ జొసిలిన్ బ్లోచ్ ఒస్కామ్ మెదడులో ఎలెక్ట్రోడ్లను అమర్చి ప్రేరేపించగా, అది ఒస్కామ్ కాళ్లు కదపడానికి ప్రయత్నించే సమయంలో ఎలెక్ట్రోడ్లు న్యూరల్ యాక్టివిటీని గమనించగలిగాయి. ఈ మేరకు రీడింగ్స్ ఆల్గోరిథమ్ వల్ల ప్రాసెస్ చేయబడ్డాయి. అవి నాడులు కింద మార్చబడ్డాయి. అవి తరువాత వెన్నెముక లోని ఎలెక్ట్రోడ్లకు పంపబడ్డాయి.

నాడులు వెన్నెముక లోని నరాలను చైతన్యవంతం చేశాయి. ఫలితంగా కండరాలు అనుకున్న విధంగా కదలికను కలిగించాయి. ఈ ప్రయోగంతో బ్రెయిన్‌కు వెన్నెముకకు మధ్య కమ్యూనికేషన్‌ను తిరిగి పునరుద్ధరించగలిగామని, అది డిజిటల్ బ్రిడ్జి సాధనం ద్వారా కాలి కదలికను నియంత్రించ గలిగిందని ప్రొఫెసర్ గెగోయిరె కోర్టైన్ వెల్లడించారు. ఈ వ్యవస్థ ఒస్కామ్ ఆలోచనలను సంగ్రహించి వాటిని వెన్నెముక చైతన్యంగా మార్చగలుగుతోందని, ఫలితంగా తనంత తాను కదిలేలా చేస్తుందని పేర్కొన్నారు. ఈ సాధనం సహజమైన అవయవం లాగే పనిచేస్తోందని ఒస్కామ్ వెల్లడించాడు. ఇదివరకు మాదిరిగానే నిలుచోవడం, నడవడం చేయగలుగుతున్నానని చెప్పాడు. తన ఆలోచనల బట్టే ఇవన్నీ జరుగుతున్నాయని వివరించాడు. ఈ సాధనం మనిషి పునరావాసానికి ప్రోత్సాహం కలిగిస్తుంది.

ఈ సాధనంతో దాదాపు 40 సార్లు శిక్షణ నిర్వహించిన తరువాత తన కాళ్లపై ఒస్కామ్ పట్టు సాధించగలిగాడు. మెదడు, వెన్నెముకల అనుసంధానం తిరిగి అభివృద్ధి చేసిన తరువాత వెన్నెముక నాడులు తిరిగి ఉత్పత్తి అవడం ప్రారంభమయ్యాయి. కోల్పోయిన నియంత్రణ మళ్లీ అలవడింది. అయితే ఈప్రయోగం అంతా మొదటి దశ లోనే ఉంది. భవిష్యత్తులో సూకా్ష్మతి సూక్ష్మమైన సాధనాలు పక్షవాత రోగులకు ఎంతో ప్రయోజనం కలిగిస్తాయని , వాళ్లు మళ్లీ నడిచేలా దోహదపడతాయని వైద్య నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పక్షవాతం వచ్చిందంటే సాధారణంగా కాళ్లు, చేతులు చలనాన్ని కోల్పోతాయి. వెన్నెముకకు గాయాలైనప్పుడే ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది.

ఈ సంఘటనలో ప్రమాదం జరిగిన పదేళ్లకు ఒస్కామ్‌లో పురోగతి కనిపించింది. ఈ విధంగా ఇటీవలనే ప్రమాదాల్లో వెన్నెముక దెబ్బతిని పక్షవాతానికి గురైన మిగతా పక్షవాత రోగులు కూడా పురోగతి సాధించగలరన్న నమ్మకం కలుగుతోంది. ఇదంతా డిజిటల్ బ్రిడ్జి సాధనం వల్లనే అని వైద్య ప్రవీణులు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News