Saturday, April 27, 2024

భయానక చావుల బుచా

- Advertisement -
- Advertisement -

Bucha, suburb of Kiev, Ukraine, is now mound of corpses

చేతులు కాళ్లు కట్టేసి చంపేశారు
కీవ్ శివార్లలో శవాల గుట్టలు
రష్యా యుద్ధనేరాల మరో స్థలి

బుచా : ఉక్రెయిన్‌లోని కీవ్ శివార్ల పట్టణం బుచా ఇప్పుడు శవాల దిబ్బగా మారింది. చేతులు కట్టేసి ఉండగా పడి ఉన్న వందలాది శవాలు. ఒళ్లంతా తూటాల గాయాలతో నేలకొరిగిన వారు కీవ్ శివారు పట్టణం బుచాలో ఇప్పుడు మట్టి దుమ్మూధూళి మధ్య శవాలై కన్పిస్తున్నారు. ఈ ప్రాంతంలో నరమేథం సాగించి నిష్క్రమించిన రష్యా సైనిక బలగాలు ఇప్పుడు శవాలను వదిలిపెట్టి వెళ్లుతున్నాయి. రష్యా దారుణ స్థాయిలో యుద్ధ నేరాలకు పాల్పడిందని, ఓ భయానక సినిమాలోని దృశ్యాలు బుచాలో కన్పిస్తున్నాయని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో 410 భౌతికకాయాలను కనుగొన్నారని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఇటీవలే తమ దళాలు రష్యా నుంచి దీనిని తిరిగి కైవసం చేసుకున్నాయని, రష్యా సేనలు ఈ పట్టణం వదిలివెళ్లుతూ వందలాది మందిని బందీలుగా చేసుకుని దారుణంగా హింసించి చంపేసినట్లు ఇప్పుడు ఇక్కడ నెలకొన్న పరిస్థితితో వెల్లడైందని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు.

రష్యా సైన్యం బస చేసిన చోటనే దాదాపు 21 శవాలు పడి ఉన్నాయి. పౌరులను ఇక్కడికి తీసుకువచ్చి చంపివేసిన ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. వారి చేతులను వెనకకు తాళ్లతో కట్టేసి వధించినట్లు స్పష్టం అయింది. కొందరిని అతి సమీపం నుంచి నిలబెట్టి కాల్చిచంపారు. ఇక్కడ రష్యా సామూహిక హత్యాకాండ ఇప్పటి శవాల గుట్టలతో వెల్లడవుతోందని ఉక్రెయిన్ తెలిపింది. అయితే ఈ వాదనను రష్యా రక్షణ మంత్రిత్వశాఖ తోసిపుచ్చింది. తాము ఉక్రెయిన్ తూర్పు ప్రాంతం వైపు పురోగమిస్తున్నామని ఈ పట్టణం నుంచి చాలా రోజుల క్రితమే వెనకకు వెళ్లామని అక్కడ దారుణాలకు దిగామని చెప్పడం అసత్యం అని రష్యా అధికారికంగా తెలిపింది. బుచాలో ఘటనపై యూరోపియన్ దేశాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. రష్యాపై ఇప్పటి ఆంక్షలు సరిపోవని మరింత కట్టడికి దిగాలని, ప్రపంచ దేశాలు ఈ దిశలో కలిసికట్టుగా వ్యవహరించాలని పిలుపు నిచ్చాయి. రష్యా నుంచి గ్యాసు దిగుమతులను నిలిపివేయాలని జర్మనీ రక్షణ మంత్రి సూచించారు.

రష్యా సైన్యం ఇంటింటికి వెళ్లి చంపేసింది

ప్రపంచంలో ఎక్కడా జరగని నేరం అకృత్యాలు ఇప్పుడు తమ కళ్ల ముందు జరిగాయని బుచాలోని ఓ నివాసి తెలిపారు. తన పేరు చెప్పడానికి భయపడ్డాడు. తాను ఏదో విధంగా ప్రాణాలతో బయటపడ్డానని, తమ ప్రాంతానికి వచ్చిన రష్యా సైనికులు ఇంటింటికి వెళ్లి ప్రజలను పట్టుకుపొయ్యారని, కొందరిని అక్కడికక్కడే చంపేశారని వాపొయ్యాడు. తలదాచుకుంటున్న వారిని వెంటాడి తీసుకువెళ్లి బందీలుగా చేసుకున్నారని తెలిపాడు. పలువురి నుంచి సెల్‌ఫోన్లు లాక్కోవడం రష్యా వ్యతిరేక భావజాలాలు ఉన్న వారిని ఈ ఫోన్ల వాట్సాప్ ఇతర సందేశాల ద్వారా గ్రహించి వారిని మట్టుపెట్టడం జరిగిందని ఈ వ్యక్తి వివరించారు. చలిని తట్టుకునేందుకు మంటలు పెట్టుకునే వారిని, సరుకుల కోసం బయటకు వచ్చిన వారిని కూడా వదలలేదని హన్నా హరేగా అనే వ్యక్తి తెలిపారు. తనను సైనికులు నిలిపివేసి తుపాకి మడమలత కాలిపై కొట్టారని, దీనితో తుంటి ఎముక విరిగిందని రోదిస్తూ చెప్పాడు.

తరువాత కాల్పులకు కూడా దిగారని తాను ఏదో విధంగా తప్పించుకున్నానని అన్నారు. బుచాలో ఇప్పుడు ఉన్న పరిస్థితి ఓ హారర్ సినిమాను మించిపోయిందని అధ్యక్షులు జెలెన్‌స్కీ సలహాదారు ఒలెక్సీ అరెస్టోవిచ్ తెలిపారు. ఉక్రయిన్ అధ్యక్షులు జెలెన్‌స్కీ వీడియో సందేశం వెలువరించారు. పౌరులను చిత్రహింసలకు గురి చేసి వారిని చంపివేసిన రష్యా సైనికులు ఉద్ధేశపూరిత రాక్షసత్వానికి ప్రతీకగా నిలుస్తారని మండిపడ్డారు. ఈ ఘాతకాలలో పాల్గొన్న రష్యా సైనికుల తల్లులను ఉద్ధేశించి కూడా జెలెన్‌స్కీ మాట్లాడారు. ఈ విధమైన దోపిడిదార్లకు జన్మనిచ్చి ఉండొచ్చు కానీ వారైనా ఇంతటి మారణకాండకు పాల్పడరేమో , ఇటువంటి అమానుషాలకు దిగిన మీ బిడ్డలను ఇదే విధంగా గాలికివదిలేస్తారా? తల్లులుగా ఆలోచించండి, వీరికి ఆత్మ హృదయం ఏదీ లేనట్లుంది. నడివీధులలో క్రూరమృగాలు సంచరించినా అవి చేసే పనులకు ఇంగితం లేదని అనుకోవచ్చు అయితే ఇక్కడ సాగించిన మారణకాండకు దిగిన వారు ఉద్ధేశపూరితంగా ఈ విధంగా వ్యవహరించడం వారిది ఎటువంటి జన్మగా భావించాల్సి ఉంటుంది? ఇటువంటి వారికి తల్లులు జన్మనివ్వాల్సి వచ్చిందా? అని ప్రశ్నించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News